జయోస్తు! శ్రీరస్తు!..

------------------------

కళ్ళూ చెవులూ లేకేం!

అన్నీ ఉన్నాయి!

దివ్యంగానే పనిజేస్తున్నాయి.

నోరు గూడా మూగబోలేదు.

ఎన్ని జెప్పానిప్పటివరకు?

ఎన్ని విధాలుగా, మళ్ళీ మళ్ళీ జెప్పాను?

స్వయంగా జెప్పాను,

సంయమి వర్యులతో జెప్పించాను!

కథలతో జెప్పాను.

కమ్మని సూక్తులుగా జెప్పాను.

ఇతిహాసాలుగా అందించాను.

పురాణాలుగా వివరించాను.

ప్రేమతో జెప్పాను.

గురువుగా బోధించాను.

ఎప్పుడూ విన్నట్లు తలలూపడమే!

అర్థమైనట్లు అహంకరించటమే.

త్రికరణ శుద్ధిగా ఆచరణలో బెట్టింది ఎందరు?

నీదీ నాదీ అనే భావము వదిలి

మనము,మనది అనే భావము పెంచుకోమన్నాను.

ఎల్లల సంగతి మరిచిపోయి, చెరిపివేసి

వసుధైక కుటుంబ భావనతో బ్రతుకమన్నాను.

కుల,మత వ్యవస్థలు, వర్ణవిభేదాలు

అన్నీ ప్రక్కన బెట్టి

మనిషి మనిషిలో వెలిగే ఆత్మను చూడమన్నాను.

సర్వజీవరాశిలోనూ దైవం ఉంటుందన్న విషయము

విస్మరించవద్దని జెప్పాను.

సర్వసమభావనతో, సమదర్శిత్వంతో, ఐకమత్యంతో

అందరూ ఒకే కుటుంబ సభ్యులు గా

స్నేహంతో, సౌహార్ద్రభావనతో, సౌశీల్యముతో,

సాధువర్తనతో, ధర్మమార్గములో

చూపిన బాటలో నడువమని నెత్తీ,నోరూ కొట్టుకొని

పదేపదే మొరబెట్టుకొన్నాను.

ఎన్నిసార్లు దారిదప్పినప్పుడు మందలించాను?

ఎంతమందితో సందేశాలు బంపాను?

ఎన్నిసార్లు భవితవ్యం గురించి నిష్కర్షగా హెచ్చరించాను?

కర్తవ్యపాలన గూర్చి బోధించాను?

కండబలం కంటే బుద్ధి బలం

వ్యక్తి సుఖం కంటే సంఘ సుఖం

స్వార్థం కంటే పరార్థం, పరమార్థం

మిన్న యని సోదాహరణంగా చూపించాను? నిరూపించాను?

చెప్పినవన్నీ పెడచెవిని బెట్టి,

తనకు తెలిసినదే సర్వమని, కనిపించేదే సత్యమని

నాకంటే బలవంతుడు, అధికుడు లేడని నమ్మి

విర్రవీగి, అహంకరించి విధినిర్వహణ జేయకుండా

తమ యునికి, సంపద, అధికారము నిత్యమని భ్రమించి

ఇతరుల గురించిన యోచనే లేకుండా

మానవ సంక్షేమం కోసము, విశ్వకల్యాణము కొఱకు

వినియోగించవలసిన జ్ఞాన, విజ్ఞాన సంపత్తిని

వనరులను దూరదృష్టి యనేదే లేకుండా

స్వార్థం కోసము దుర్వినియోగం జేస్తూ

న్యాయాన్యాయ విచక్షణ లేకుండా

ధర్మాధర్మ విచారణ జేయకుండా

విశ్వజనీనమైన సాంఘిక సూత్రాలకు

కట్టుబడియుండకుండా

స్వాతంత్ర్యము పేరుతో అన్నిటినీ యుల్లంఘిస్తూ

ఎవరికిష్టమైన రీతిలో వారు ప్రవర్తిస్తూ

తమ యునికికే కారణ భూతమై, సర్వవ్యాపకమై,

దృశ్యాదృశ్యరూపాలలో అన్నిటికీ సాక్షీభూతమై

సృష్టి స్థితి లయ కారిణియైన శక్తి యునికిని శంకిస్తూ,

అధికారాన్ని ధిక్కరిస్తూ, నిరసిస్తూ, తృణీకరిస్తూ

మానవతా వాదాన్ని, ధర్మాన్ని విడనాడి

సంకుచితభావాలతో, స్వార్థంతో,

స్వలాభాపేక్షతో చరిస్తూ

ఒకరిపైకి యింకొకరు కయ్యానికి కాలుదువ్వుతూ

అధికార దర్పంతో, అస్త్ర శస్త్ర బలంతో

అణుబలంతో ఆహవరంగంలోకి దుముకుతుంటే

మారణ హోమం గాక యేమవుతుంది?

మనసులు ముక్కలుగాక, తనువులు ఛిన్నాభిన్నం గాక

కొంపలు గూలక, దేశాలు నాశనంగాక

విశ్వశాంతికి భంగం వాటిల్లక యేమవుతుంది?

సస్యశ్యామలమై, నదీనదాలతో, నవ్వుపువ్వులతో,

ఆనంద నమ్దనవనమై విలసిల్లవలసిన యీ భూమి

రుద్రభూమి గాక యేమవుతుంది?

చెప్పిన పాఠాలు నేర్వకపోతే

ఉపదేశాలు పెడజెవిని బెడితే

అంతరాత్మను అణగ ద్రొక్కితే

అహంభావముతో చిందులు వేస్తే

శాంతి, సహన భావాలను

బలహీనతగా, చేతకానితనంగా పరిగణిస్తూ

సౌమ్యతతో చెప్పినది సంద్రంలో ద్రోసి

అజ్ఞానంతో అడుగు నేలకోసము

అనిత్యమైన సుఖాలకోసము, అధికారం కోసము

అనునిత్యము ప్రాకులాడుతూ, పోరుకాడుతూ

అందించిన వెలుగు, సాయము నందుకోకుండా

దుర్గమమైన బాటలో పయనించేవారికి

కన్నుగానని చీకటిలో,

కీకారణ్యం లో నడయాడేవారికి

దుఃఖాలు రాకుండా ఉంటాయా?

ముళ్ళ పొదలు గీరుకోకుండా ఉంటాయా?

ఒళ్ళు రక్తసిక్తముగాకుండా ఉంటుందా?

కాళ్ళూ, చేతులూ సక్రమంగానే ఉంటాయా?

క్రూరమృగాలు తారసిల్లకుండా ఉంటాయా?

ప్రాణభయము లేకుండా ఉంటుందా?

నా ఉనికిని గుర్తించటానికి అహంకారం

నామాటపై అపనమ్మకం, నాబాట గూర్చి అగౌరవం

నామస్మరణ జేయటానికి నామోషీ

ఏమని అడిగితే చెబుతారు సంజాయిషీ

ఎంతకరుణ జూపినా గుర్తించరు

స్వాంతలో వెలిగే వెలుగును గమనించరు

చూపిన బాటను పయనించరు

చేయమనే పనులు జేయరు

పట్టుకొన్న పాశాలను కోయరు

సంకెళ్ళను దీయరు

ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలనుకోవటమే

మితియనేది లేకుండా ప్రతిక్షణమూ దేనికో

ఆశించటమే

అందినదానికి తృప్తినొంది

అందించినవారికి అంజలించి, ధన్యవాదాలు జెప్పి

యితరులతో పంచుకొనేది యెందరు?

పరుల సౌఖ్యము గురించి ఆలోచించేది యెందరు?

ప్రతిదానికీ, ప్రతిచోటా విద్వేషాలు, దౌర్జన్యాలు

సౌమ్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని

అనుకొనేది యెందరు?

ధైర్య సాహసాలతో ముందంజ వేసేదెందరు?

నేనెందుకు కలగ జేసికోవాలిప్పుడు?

నేను జెప్పేదేదీ విననప్పుడు, తలకెక్కనప్పుడు?

కరుణ లేక గాదు. వెన్నకంటే మెత్తనైన హృదయం

నాది. కన్నీటికి కరిగిపోతుంది. బాధకు

ద్రవించిపోతుంది. మీ ఆనమ్దం నా ఆనందంగా

పొంగిపోతుంది.

యే ఒక్కరికి కష్టము గలిగినా, ఆపద గలిగినా

అల్లాడిపోతుంది. అమ్మా అనగానే వాత్సల్యంతో,

ఆప్యాయతతో అక్కున జేర్చుకొని బాధ

పోగొట్టాలనిపిస్తుంది. నిత్యమూ ఆనందంగా

ఉంచాలనిపిస్తుంది.

అయినా కళ్ళూ చెవులూ అప్పగించి చూస్తూ కూర్చున్నాను.

ఎందుకు? మీ పాఠాలు మీరు నేర్చుకోవాలి. చెప్పింది

విని, అమ్మ ఔదార్యము, ప్రేమ గుర్తించి, అమ్దరికీ

మంచి జేసే త్రోవలో పయనించటానికి నిర్ణయము

తీసికోవాలి. అహంకారము త్యజించాలి. శరణాగతి

బొందాలి. సాధువర్తనతో, సత్యభాషణతో,

ఆత్మబలంతో, ధైర్యసాహసాలతో ముందుకు సాగాలి.

అవసరమనుకొన్న చోట, సమయములో

అవమానమనుకోకుండా, కించపడకుండా అమ్మ సాయము

దీసికోవాలి.

తెలిసింది స్వల్పమనీ, తెలియనిది

అపారమనీ గుర్తింపు రావాలి.

అందరూ నావారే.అందరూ అమ్మ బిడ్డలే.

అందరిలోనున్న దాత్మ యొక్కటే.

అందరికీ అమ్మ యిచ్చిన యీ భూమిపై నివసించటానికి,

సుఖించటానికి హక్కు ఉంది. అందరమూ ఐకమత్యముగా

ఉన్నప్పుడే అమ్మ సంతోషిస్తుంది, ఆశీర్వదించి

అందరికీ అడిగినవందిస్తుంది. భూమి పై ప్రేమ,

శాంతి నెలకొంటాయి. నందనవనమవుతుంది అనే

భావన రావాలి. సాటివారి దుఃఖాలు తనవిగా

కన్నీరు నింపగలగాని, కరమందజేయగలగాలి.

సాటివారి యున్నతి తనదిగా సంతోషించగలగాలి.

అప్పుడే యీభువి స్వర్గతుల్యమవుతుంది. నీలాటివారు

ఆశించే శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. ఇంతకంటే

చెప్పేదేముంది? మీలోని లోటుపాట్లకు అమ్మను,

దైవాన్ని తప్పుబట్టకండి. స్వేచ్ఛ పేరుతో,

తెలిసినదే సర్వస్వమనుకొని, సృష్టి తనకొరకు

మాత్రమేననుకొన్నట్లు అహంభావంతో, స్వార్థముతో

వర్తించే జాతి కన్నువిప్పకపోతే

జరిగేది జాతి వినాశనమే!

కడకు మిగిలేది ఒక గుప్పెడు బూడిదే.

ఇప్పటికైనా మించిపోయింది లేదు.

కన్ను విప్పండి. కరమూ కరమూ కలపండి.

కలసికట్టుగా సాగండి. కాంతిపథములో నేగండి.

గళము దెరవండి. ఐకమత్యగానము జేయండి. అమ్మ

మనసుకు హాయి గూర్చండి.

దీవనలందండి. ఆనందంగా నుండండి.

జయోస్తు!శ్రీరస్తు!శుభమస్తు!

7-25-06

5:58 PM

Some thing that flowed instantaneously as soon as I

saw moehana's kavita " daevuDiki cevulu laevu!"

on racchabaMDa.

To Post a message, send it to: racchabanda@yahoogroups.com

Courtesy: http://www.kanneganti.com/

--~--~---------~--~----~------------~-------~--~----~

--

Read and Post racchabanda articles in telugu from

http://groups.google.com/group/telugu-unicode.

This article is posted from that site.

-~----------~----~----~----~------~----~------~--~---


పూర్తిగా చదవండి