సుమతీశతక స్ఫూర్తి-9

శతక విశిష్టత

సుమతీశతకంలో 99శాతం పద్యాలు కవి స్వోపజ్ఞకాలే గాని ఏ ఇతరభాషాగ్రంథానికీ అనువాదం కాకపోవడం విశేషం. కవి అనుకరించాలనుకుంటే, కామందక నీతిసారం నుంచో, క్షేమేంద్రుడి చారుచర్య నుంచో అనువదించి ఉండగలడు. కాని అలా చెయ్యలేదు. కారణం- దీన్ని ఒక గ్రంథంగా సంతరించాలనే ఉద్దేశంతో కవి ఈ పద్యాల్ని కూర్చినట్లు కనిపించదు. అప్పుడొకటీ, ఇప్పుడొకటీ ఆశువుగా చెప్పినవే తరువాత శతకరూపం దాల్చి ఉంటాయి. అలా అనుకున్నప్పుడు, బహుశా మొదట్లో ఈ గ్రంథంలో వందపద్యాలకంటే ఎక్కువే ఉండి ఉండాలి.ఇది బడిపిల్లలకి పాఠ్యపుస్తకంగా మారాక పిల్లల సౌలభ్యం కోసం కుదించిన వంద పద్యాలే చివరికి పెద్దలక్కూడా మిగిలాయి కాబోలు. గ్రంథంగా సంతరించాలనే ఉద్దేశం లేకపోవడం చేత భర్తృహరి నీతిశతకం (సంస్కృతం) లానో, తిరువళ్ళువర్ రచంచిన తిరుక్కుఱళ్ (అరవం)లానో ఈ శతకానికి విషయ విభజన చెయ్యడం అసాధ్యమైంది. ఒకే పద్యంలో పరస్పర సంబంధం లేని అనేక విషయాలకి ఓ సామాన్యక్రియ (common verb) తోనో, ఓ సామాన్య విశేషణం (common adjective) తోనో లంకెపెట్టడం సుమతీశతకమంతటా కవి అవలంబించిన ప్రక్రియ.పద్యమంతటా ఒకే అంశాన్ని స్పృశించిన సందర్భాలున్నాయి గాని తక్కువ. ఈ క్రింద కొన్ని ఉదాహరణలిస్తున్నాను, పరికించండి :

క. అక్కఱకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ !

క. అడియాస కొలువు గొలువకు, గుడిమణియము సేయబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు, అడవిని తోడరయకొంటి నరుగకు సుమతీ !

క. అప్పుగొని చేయు విభవము, ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
తప్పరయని నృపు రాజ్యము దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ !

క. ఆకొన్న కూడె అమృతము : తా కొంకక యిచ్చువాడె దాత ధరిత్రిన్
సోకోర్చువాడే మనుజుడు : తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ !

క. ఇచ్చునదె విద్య : రణమున జొచ్చునదే మగతనంబు : సుకవీశ్వరులున్
మెచ్చునదె నేర్పు : వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ !

మకుటానికి (అంటే- సుమతీ అనే పద్యాంతానికి) ముందు యతినిర్బంధవశాన ఉంచిన "వసుధను కదరా మహిలో "మొదలైన మాటలు మినహా సుమతీశతకంలో తురుపుముక్కల్లాంటి వ్యర్థపదాలెక్కడా కనిపించవు. పదాల కోసం తడుముకోవడం కూడా లేదు.ఈ ధారాశుద్ధిని బట్టే ఈ రచన మొదట్లో పూర్తిగా మౌఖికమైన ఆశుకవిత్వమై ఉండవచ్చుననడం.

పూర్తిగా చదవండి