అనుమాన పిశాచం కథ వెంకటేశ్వర్లుగారు బందరు (నేటి మచి…
మా నాన్నగారి స్మృతు September 24th, 2006అనుమాన పిశాచం కథ
వెంకటేశ్వర్లుగారు బందరు (నేటి మచిలీపట్నం) నుంచి వచ్చి గుంటూరు హిందూ కాలేజిలో బి.కాం చదవడానికి చేరిన కొత్తల్లో ఉండడానికి ఇల్లు దొరక్క చాలా ఇబ్బందిపడ్డారు. అందుచేత ఎక్కడైనా ఇల్లు చూసిపెట్టమని చావలి రామచంద్రరావు అనే ఆయనకి చెప్పారు. (ఆయన వెంకటేశ్వర్లుగారి కంటే పదీ, పన్నెండేళ్ళు పెద్ద)ఆయనకి కోటంరాజు కుటుంబరావనే యువకుడితో పరిచయముంది.సదరు కుటుంబరావుకి రైల్‌పేటలో ఇల్లుంది.ఆయన జాలయ్య మార్కెట్లో ఒకాఫీసులో బుకింగ్ క్లర్కుగా పనిచేసేవాడు. అక్కడ రామచంద్రరావుగారు కుటుంబరావు దగ్గర కూర్చుని బీడీలు తాగుతూండేవాడు. వెంకటేశ్వర్లుగారి అభ్యర్థన విని ఆయన వెంటనే, "దానిదేముంది ? కుటుంబరావింట్లో ఓ వాటా ఖాళీగా ఉంది. అతను మా శిష్యుడే" అంటూ ఆ వాటా ఇప్పించాడు. వెంకటేశ్వర్లుగారు తల్లితో సహా రైల్‌పేటలో మకాంపెట్టారు.
అది 1948. అప్పటికి గుంటూరు ఇంత మహానగరం కాదు. ఇప్పుడు టి.టి.డి. కళ్యాణమండపం, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఉన్న ప్రాంతంలో ఎఱుకలవాళ్ళూ, యానాదివాళ్ళూ గుడిసెలేసుకుని ఉండేవారట. అలాగే సరస్వతీ మహలు, ఉడిపి హోటలు మొదలైనవేవీ లేవు. వెంకటేశ్వర్లుగారు డొంకదారి గుండా రైల్‌పేట నుంచి హిందూ కాలేజికి వెళ్ళేవారు.
అసలు కథకొద్దాం.
కోటంరాజు కుటుంబరావుగారి భార్య పేరు భారతి. ఆవిడ చాలా అందంగా ఉండేదంటారు. ఆవిడ స్వయానా కోరుకుని కోటంరాజుగారిని పెళ్ళాడిందిట.అయితే ఆయనకి పెళ్ళాం మీద పుట్టెడు అనుమానం."నన్ను ప్రేమించిన దానివి నాకంటే ముందు ఎంతమందిని ప్రేమించావో చెప్పవే లంజముండా !" అని తరచుగా చావగొడుతూండేవాడు.మామూలుగా పిలిచే పిలుపులు కూడా రౌద్రంగా పిలిచేవాడు.వెంకటేశ్వర్లుగారు వారింట్లో కిరాయికి చేరాక కుటుంబరావుగారు జాలయ్య మార్కెట్లో ఉద్యోగం మానేసి గుంటూరు రైల్వేలో అసిస్టెంటుగా చేరారు.తరువాతెప్పుడో స్టేషన్ మాస్టరు కూడా అయ్యారట.
ఆ రోజుల్లో మహలక్షమ్మగారు కొడుకుని ఇంట్లో ఉంచి అప్పుడప్పుడు మఱ్ఱిపూడి వెళ్ళి ఉండేది. వేసవికాలపు రాత్రి వేళల్లో వెంకటేశ్వర్లుగారు తాము కిరాయికున్న వాటా వాకిట్లోనే మంచం వేసుకుని పడుకునేవారు. (రెండు వాటాల వాకిళ్ళనీ వేరు చేస్తూ మధ్యలో ఒక గోడ ఉండేది) కుటుంబరావుగారు కొన్ని రాత్రులు స్టేషన్లోనే ఉండిపోయేవారు. అందుచేత వారి శ్రీమతి ఒక్కతే తమ వాటా వాకిట్లో మంచం వాల్చుకుని పడుకునేది. ఈ సంగతి తెలిసి కుటుంబరావుగారు హఠాత్తుగా ఒక అర్ధరాత్రి వేళ వచ్చి గోడెక్కి తొంగిచూస్తూ ఇద్దరినీ కనిపెడుతూండేవాడట.తెల్లవారాక మళ్ళీ వచ్చి ఏదో ఒక వంకతో "లంజముండా!" అని నిష్కారణంగా భార్యని చావబాదేవాడు.
వెంకటేశ్వర్లుగారి పట్ల కుటుంబరావుగారికి అసహనం ప్రబలడానికి మరో కారణం కూడా ఉంది. వెంకటేశ్వర్లుగారు ఇంటికి వచ్చినప్పుడు వీధి తలుపు తెరవమని పిలిచేవారు కారు.సైకిల్‌బెల్లు మోగించేవారు. మహలక్షమ్మగారు రాకముందే భారతిగారు లేచి వచ్చి తలుపు తీసేది. అది చూసి కుటుంబరావుగారికి ఒళ్ళు మండిపోయేది.
కుటుంబరావుగారి ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి దారితీసిన సంఘటన ఒకటి జరిగింది. వెంకటేశ్వర్లుగారు తన బంధువైన శివరాం గారిని ఇంట్లో ఉంచి తల్లిని తీసుకురావడానికని మఱ్ఱిపూడి వెళ్ళారు.శివరాంగారికి అప్పుడు షుమారు 19 ఏళ్ళ వయసు.పాపం !ఆయన ఇంట్లో ఉన్నంతకాలమూ కుటుంబరావుగారూ ఆయన భార్య అన్ని సౌకర్యాలూ చేశారు.కాని కుటుంబరావుగారు స్టేషన్‌కెళ్ళిన సమయంలో భారతిగారు శివరాంగారితో కేరంబోర్డు ఆడిందట.శివరాంగారు వెళ్లిపోయాక కుటుంబరావుగారు వచ్చి ఈ విషయం తెలుసుకుని భార్యని యథాప్రకారం చావగొట్టారు. "వాడెవడే ? నీకేమవుతాడో చెప్పవే" అంటూ వేధించారు. చివరికి "దీనికంతటికీ కారణం ఆ వెంకటేశ్వర్లే" అని తీర్మానించుకున్నారు.
ఒకరోజు రాత్రి ఏడుగంటలకి ఒక రౌడీతో సహా కుటుంబరావుగారు ఇంటికొచ్చి వెంకటేశ్వర్లుగారితో తగాదా పెట్టుకుని ఛాతీపై కొట్టేసరికి వెంకటేశ్వర్లుగారు రెచ్చిపోయి ఆయన మీద కలియబడ్డారు.ఆయన వెంకటేశ్వర్లుగారిని దూరంగా తోసెయ్యాలని చూశారు.వెంకటేశ్వర్లుగారు వదలకుండా ఆయన బాహువు దొరకబుచ్చుకుని అందినంత కొరికారు.కుటుంబరావుగారు ఏడుపుమొహం పెట్టి తన రౌడీమిత్రుడితో "కుక్కలా కొరికిపెట్టాడండీ చెయ్యంతా !మనిషి కాటుకు మందు లేదంటారు.బతుకుతానో, చస్తానో !" అని వాపోయారు.
'ఇంత జరిగాక ఇహ వీడింట్లో ఉండకూడ 'దని తీర్మానించుకుని వెంకటేశ్వర్లుగారు తన మరో మిత్రుడైన కోటేశ్వర్రావుగారి గదిలో తాత్కాలికంగా మకాం పెట్టారు. అయినా కుటుంబరావు బెడద వదల్లేదు. ఎన్నోసార్లు తన రౌడీమిత్రులతో కొట్టించాలని ప్రయత్నించేవాడు.వెంకటేశ్వర్లుగారు తన ఇబ్బంది గురించి సుబ్బారావు (ఈయన తర్వాతికాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి Assistant Secretary-IAS Cadre గా పనిచేశారు) మొదలైనవారితో చెప్పుకున్నారు. అసలు కుటుంబరావు వెనక ఉండి అతన్ని పురిగొల్పుతున్నది చావలి రామచంద్రరావేనని వాళ్ళంతా కలిసి నిర్ణయించారు.
ఒకరోజు వెంకటేశ్వర్లుగారి మిత్రబృందమంతా చావలి రామచంద్రరావు వచ్చే దారిలో మాటేసి కూర్చున్నారు.ఆయన రాగానే, మీదపడి "వెధవా !అడ్డమైన చెత్త సలహాలూ ఇచ్చి కుటుంబరావుగాణ్ణి మావాడి మీదికి రెచ్చగొడతావా ?"అని బాగా దేహశుద్ధి చేశారు.చావలి రామచంద్రరావు లెంపలేసుకుని "బాబ్బాబూ ! తప్పయిపోయింది. ఈ సారికి మన్నించండి ! ఇహ మీవాడి జోలికి మా కుటుంబరావు రాడు. నా మాట నమ్మండి." అని శరణువేడుకుని బయటపడ్డాడు. ఆ తరువాత వెంకటేశ్వర్లుగారికి కుటుంబరావుని తలుచుకునే అవసరం ఎప్పుడూ రాలేదు.
కుటుంబరావుగారు 1978-81 మధ్య ఎప్పుడో పదవీ విరమణ చేశారని తెలుస్తోంది. వయసు మళ్ళాక ఆయన మెహర్ బాబా భజనల్లో పాల్గొనేవారట.
పూర్తిగా చదవండి