ఉద్ధరే దాత్మనాత్మానం

పుష్కలంగా పంటభూములున్నాయనే అతివిశ్వాసం తన విద్యావ్యాసంగం (educational career)మీద చాలా చెడుప్రభావం చూపించిందని వెంకటేశ్వర్లుగారు అనేవారు.ఆ కారణంచేతనే పోయిన B.Com.పరీక్షకి మూడుసార్లు కట్టి కూడా ఉత్తీర్ణులు కాలేకపోయారు.పెద్దలు నచ్చజెప్పిన మీదట ట్యూషన్‌లో చేరడానికి అంగీకరించారు.

ఆ రోజుల్లో ఆంధ్రా మొత్తం మీద గుంటూరులో గాని, హైదరాబాదులో గాని ఎక్కడా ట్యుటోరియల్ కాలేజీలు లేవు. ట్యుటోరియల్ కాలేజీలనే పోకడ (trend)ఆంధ్రాలో మొదలయింది వెంకటేశ్వర్లుగారి ప్రియ మిత్రుడైన C.V.N.ధన్ (C.విశ్వనాథన్) గారి రవి కాలేజి (గుంటూరు)తో ! ఆ తరువాత కొన్ని సంవత్సరాలకే రాయలసీమలో కీ.శే.శ్రీ బాదం శేషారావుగారనే విద్యావేత్త Sri Sarada institutions (Kurnool) పేరుతో ఒక ట్యుటోరియల్ కళాశాల ఒక పాఠశాల స్థాపించారు.అప్పటిదాకా రాయలసీమలో కూడా ట్యుటోరియల్ కళాశాలలు లేవు.బాదం శేషారావుగారు 1997లో చీరాలలో హృద్రోగంతో మరణించారు.ఆయన ప్రాముఖ్యం ఎరగని పత్రికలవారు ఆ వార్తను ప్రచురించలేదు.

మద్రాసులాంటి మహానగరంలో కూడా "మినర్వా కాలేజ్" పేరుతో ఒకే ఒక్క ట్యుటోరియల్ కళాశాల ఉండేది.అది ఎగ్మూరులో Halls Road మీద ఉండేది.వెంకటేశ్వర్లుగారు 1953లో అక్కడ చేరారు.చేరడమైతే చేరారు గాని ఠంచనుగా హాజరయ్యేవారు కారు.మామూలు డిగ్రీ కళాశాలల నిర్వాహకుల కంటే ట్యుటోరియల్ కళాశాలల నిర్వాహకులు విద్యార్థుల ప్రగతి పట్ల హెచ్చు శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి 'మినర్వా' వారు వెంకటేశ్వర్లుగారి పెద్దలకో ఉత్తరం రాశారు, మీవాడు క్లాసులకి సరిగా హాజరు కావడంలేదని !వెంకటేశ్వర్లుగారు గుంటూరు వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు"ఏరా !వెంకులూ !క్లాసులకి సరిగా వెళ్ళడంలేదట నువ్వు, ఎందుకు ?"అని మందలించారు.

వెంకటేశ్వర్లుగారికి చాలా కోపం వచ్చింది.తిరిగి మద్రాసు వెళ్ళినప్పుడు "ప్రిన్సిపాల్ గారికి క్షమాపణ చెబితేనే గాని క్లాసుకి రాకూడ"దన్నాడు లెక్చరరు.మేనేజ్‌మెంటువారి ఉత్తరం పట్టుకుని వెంకటేశ్వర్లుగారు వెళ్ళారు.ఆ ఉత్తరం ప్రిన్సిపాలు ముందు పెట్టి"క్లాసులకి సరిగా రమ్మని నాతో చెప్పచ్చు గదా !మా వాళ్ళకెందుకు ఉత్తరం రాయాలి ?"అని మండిపడ్డారు."నిన్ను సస్పెండ్ చేస్తున్నా.ఫో !ఇక్కణ్ణుంచి"అని గర్జించాడు ప్రిన్సిపాలు.వెంకటేశ్వర్లుగారు నవ్వాపుకోలేకపోయారు."పెద్ద పెద్ద కాలేజీల్లో సస్పెన్షన్‌లకే జడవలేదు.మీ బోడి ట్యుటోరియల్ కాలేజివాళ్ళు సస్పెండ్ చేస్తే ఓ లెక్కా ?"అన్నారు.మళ్ళీ ప్రిన్సిపాలుడు "Get out"అని అరిచాడు.

ఆ కాలేజిలో వెంకటేశ్వర్లుగారు చదివింది ముచ్చటగా మూడునెలలు మాత్రమే.తరువాత ఆయన తనంతట తానే చదువుకుని ఉత్తీర్ణులై మొత్తం మీద B.Com అనే భూతాన్ని భూస్థాపితం చేశారు.

పూర్తిగా చదవండి