సరిహద్దు వివాదాలు సంకుచితుల గోదాలు
ఇటీవల కర్నాటక అసెంబ్లీ బెళగావి (Belgaum)లో సమావేశమైనప్పుడు అక్కడి మరాఠీ సంఘాలవారు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి నాయకత్వంలో “బెళగావి మహారాష్ట్రకే చెందాలి”అని ఆందోళన చేశారు.ఇండియన్‌యూనియన్‌లో ఏ ఇతర రిపబ్లిక్కుకీ లేనన్ని సరిహద్దుల సిగపట్లు కర్నాటకకే ఉండడం గమనార్హం.పాపం !ఈ తప్పు కర్నాటకది కాదు.దాన్ని ఏర్పరచిన ఆనాటి యూనియన్ ప్రభుత్వానిదే.ఏదో హడావిడిగా కన్నడిగులకో రిపబ్లిక్కయితే ఏర్పడిందనిపించారు.అక్కడా ఇక్కడా మనమే అధికారంలో ఉంటాం కదా మరేం ఫర్వాలేదనుకున్నారు.వారు అనుకున్నట్లే అక్కడా ఇక్కడా ఒకే పార్టీ అధికారంలో ఉన్నంతకాలం సంసార పక్షంగా సర్దుకుపోయారు.ఆ ముసలివారంతా చచ్చిపోయాక సదరు రిపబ్లిక్కుల ఏర్పాటులో ఆనాడు జరిగిన అవకతవకలన్నీ ఇప్పుడు దయ్యాల్లాగా జుట్లు విరబోసుకుని ఆవులిస్తూ లేచి కూర్చుంటున్నాయి.
కర్నాటక తప్పు ఎక్కడ ఉందంటే-ఆనాటి యూనియన్ చేసిన తప్పుల్ని తనమీద వేసుకుని ఓ యథాస్థితివాది(statusquoist)గా మారి తన ఏలుబడిలో ఉన్న కన్నడేతర ప్రజల ఆకాంక్షల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాయడంలో !శోచనీయమైన విషయమేంటంటే అది ఆంధ్రలాంటి ఏకభాషా రిపబ్లిక్ కాదు.ఇక్కడ “తెలుగు మాతృభాష” అని చెప్పుకునే వారు 85 శాతం మంది, “తెలుగు తెలుసు”నని చెప్పుకునే వారు మరో 10 శాతం మంది ఉండగా, కర్నాటకలో “కన్నడం మాతృభాష”అని చెప్పుకునేవారు 62 శాతం మంది మాత్రమే.అక్కడ జిల్లాలకి జిల్లాలే కన్నడేతర ప్రజలతో ఎన్నో వందల యేళ్ళుగా నిండిపోయి ఉన్నాయి.బళ్ళారి జిల్లాలో తెలుగు, బెళగావి జిల్లాలో మరాఠీ, కూర్గులో కొడగు, ఉత్తర కెనరా, దక్షిణ కెనరా (Canara) జిల్లాలలో తుళు మెజారిటీ భాషలుగా వ్యవహారంలో ఉన్నాయి.ఆ విధంగా కన్నడ భూభాగం కర్నాటక భూభాగం కంటే వాస్తవంలో చాలా చిన్నది.ఈ పరిస్థితి కన్నడ జాతీయవాదుల్లో ఓ రకమైన అభద్రతా భావానికీ పరభాషా ద్వేషానికీ దారితీసింది.మనం తమిళుల్ని దురభిమానులనుకుంటున్నాం గాని ప్రస్తుతం దక్షిణాదిలో అసలు సిసలైన దురభిమానులు కన్నడిగులు.ఇదో తాజా వాస్తవం.
ఆంధ్రావారు తమ 24వ జిల్లా బళ్ళారిని మర్చిపోయి చాలా రోజులయింది.ఇప్పుడా జిల్లా తెలుగు సినిమా పరిశ్రమకి తప్ప మనకెవరికీ స్మృతిపథంలో లేదు.అలా మనం మర్చిపోయిన మన తెలుగు జిల్లాలు నెహ్రూ బాబాయిగారి పుణ్యమా అని చాలానే ఉన్నాయి.ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌లో భాగమైన దంతివాడ జిల్లా 25వది. ఒరిస్సాలో భాగమైన గంజాం జిల్లా 26వది.దాని పక్కనే ఉన్న బరంపురం జిల్లా (ఒరియా వారు బెర్హంపూర్అంటారు) 27వది.అలా మనకి లేకుండా చెయ్యబడ్డ భూభాగం (territory)మొత్తం కలిపితే ఒక చిన్న రిపబ్లిక్కంత ఉంటుంది.
ఈరోజు అదంతా తల్చుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది.పోగొట్టుకున్న భూభాగాలు తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం.నాన్-తెలుగుగా మారిపోయిన భూములు తిరిగి తెలుగు భూములు(Telugu territories)గా మారడం అసాధ్యం.అందుగురించి పొరుగు రిపబ్లిక్కులతో శత్రుత్వాలు యుద్ధాలు రక్తపాతం ప్రాణనష్టం జాతీయ ఆస్తుల విధ్వంసం అంతర్జాతీయ న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు-ఇవన్నీ బాధామయ అనుభవాల్ని మిగులుస్తాయి.అందుచేత ఉన్న పరిస్థితుల్లో పోగొట్టుకున్న భూభాగాల్లో నివసించే మన ప్రజలకి అక్కడి వ్యవస్థలో రాజకీయ సాంస్కృతిక హక్కులు ఉండాలని డిమాండ్ చెయ్యడానికి మనం పరిమితం కాగలం.కర్నాటకలో తెలుగువారి మానవహక్కులు ఉల్లంఘనకి గురౌతున్నాయి.తెలుగు సినిమాల్ని తాము చెప్పినప్పుడు విడుదల చెయ్యాలని ఆదేశించడం, విద్యాలయాల్లో తెలుగు సబ్జెక్టునే ఎత్తివెయ్యడం, తెలుగువారు కర్నాటకలో పంటభూములు కొనకూడదని ఆర్డినెన్సు తేవడం-దీనికంతటికీ అర్థం ఏంటి ? (సదరు ఆర్డినెన్సు ఇప్పటికీ అమలులో ఉందో లేదో నాకు తెలీదు)
చరిత్రలో కర్నాటకకి రెండో రాజధాని ఎప్పుడూ లేదు.ఇప్పుడు కొత్తగా బెళగావిని రెండో రాజధాని చేసుకోవడంలో అర్థమేంటి ? మరాఠీవారి పుండు మీద కారం జల్లాలనే దురుద్దేశం కాకపోతే ?
ఇదంతా దేనికి దారి తీస్తుందో ఇప్పుడే చెప్పలేం.సరిహద్దు తగాదాలు మనుషుల ప్రాణాలు తీసేదాకా వెళ్ళకముందే మనం మేలుకోవడం మంచిది.గతంలో ఓ సారి అస్సాం సరిహద్దుల్లోకి ప్రవేశించినందుకు నాగాలాండ్‌కి చెందిన 8 మంది పోలీసుల్ని కాల్చి చంపారు.అమెరికా దేశపు మాజీ అధ్యక్షుడు శ్రీ బిల్ క్లింటన్ చెప్పినట్లు-”మన పొరుగువారుగా ఎవరు ఉండాలో మనం ఎంచుకోలేం”కాబట్టి కష్టమో నిష్ఠూరమో-ఉన్నవారితో సుహృద్భావం ప్రదర్శించడం ఉత్తమం.ఫ్రెంచి జర్మన్ కొరియన్ జాతీయుల్లాగా మన తెలుగుజాతి కూడా ప్రపంచ స్థాయికి ఎదగాలంటే ఓ జిల్లా గురించో, లేక ఓ తాలూకా గురించో తల బద్దలుకొట్టుకోవడం మానేసి ఇరుగుపొరుగును ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి.
రిపబ్లిక్కుల మధ్య సరిహద్దు తగాదాలు, నీళ్ళ తగాదాలు, ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండులు -ఇవన్నీ సామ్రాజ్యవాదులకి ఎంతో ఆనంద దాయకమైన విషయాలు.ఇలా విభజించి పాలించడం ద్వారానైనా ఈ సామ్రాజ్యాన్ని ఇంకొంతకాలం నిలబెట్టవచ్చునని వారు ఆశిస్తారు.కాని మనక్కావాల్సింది బలవంతపు బ్రాహ్మణార్థంలాంటి సమైక్యం కాదు.ప్రతి భాషాజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఇతర భాషాజాతులకి సలాం కొట్టే అవసరం లేని సమైక్యం.ఎవరి బ్లాక్‌మెయిళ్ళకీ బెదిరింపులకీ లొంగాల్సిన అవసరం లేని సమైక్యం.ఇది అర్థం చేసుకుంటే ప్రతి వ్యక్తీ తెలుగుజాతీయవాదిగా మారతాడు.

పూర్తిగా చదవండి