సంబరపడకు అంకుల్ శామ్ !


ఇరాక్ అధ్యక్షుడు శ్రీ సద్దామ్ హుస్సేన్ ఈ రోజు ఉదయం 6 గం.ల ప్రాంతంలో బాగ్దాదు నగరంలో అమెరికా చట్టాల ప్రకారం అమెరికా ప్రతినిధులైన ఇరాకీల చేతిలో 69ఏళ్ళ పండువయసులో హత్యకి గురయ్యారు.ఆయన పీకకి తాడుబిగించి చంపడం జరిగింది.

శ్రీ సద్దామ్‌పై అనేక నేరారోపణలున్నాయి.ప్రస్తుతం ఆయన్ని హత్యచెయ్యడానికి అమెరికా చూపుతున్న కారణం-1982 లో దుజైల్‌నగరంలో 148 మంది షియాల ఊచకోత.ఇది కాక 1988 లో వేలాదిమంది కుర్దు జాతీయవాదుల్ని విషవాయు ప్రయోగంతో మట్టుబెట్టారనే ఆరోపణ కూడా ఉంది.

అయితే, ఓ దేశంపై మరో దేశం దురాక్రమణకి పాల్పడ్డం గెలిచిన దేశపు రాజు ఓడిపోయిన దేశపు రాజుని బంధించి చంపడం-అంతా చాలా పాత పద్ధతిలో జరిగిపోయింది.ఇక్కడ శ్రీ సద్దామ్‌ని విచారించింది ఓ స్వతంత్ర ఇరాకీ న్యాయమూర్తి కాదు.అమెరికా దయాధర్మభిక్షంతో నాలుగు కుర్చీలు సంపాదించుకుని బతుకుతున్న ఓ జీవచ్ఛవ ప్రభుత్వం.ఈ ఇరాక్‌కి సద్దామ్ తప్పొప్పుల్ని విచారించే నైతిక శక్తి లేదు.ఇది ఓ కీలుబొమ్మ ప్రభుత్వం.ఇది అమెరికాకి అంట్లు తోమిపెట్టడానికి తప్ప ఇంకెందుకూ పనికిరాని ఓ చచ్చుదద్దమ్మల ముఠా.ఇదే ఓ స్వతంత్ర ప్రభుత్వం శ్రీ సద్దామ్‌ని విచారించి ఉంటే ఆయన యొక్క నేరాలన్నీ నిరూపించి చట్టబద్ధంగా చంపి ఉంటే అందరమూ హర్షధ్వానాలు చేసి ఉండేవారం.

Posted by Picasa

అమెరికా దృష్టిలో శ్రీ సద్దాం చేసిన అసలు తప్పు ఈ హత్యాకాండలు కాదు.తాము ఉత్పాదిస్తున్న పెట్రోలుకి న్యాయమైన ధర అడగడమే ఆయన చేసిన పెద్ద తప్పు.ఈ ప్రపంచంలో అన్నీ అమెరికాకి ఉచితంగా లభించాలి.అమెరికాలో కార్లు కారుచౌకగా నడవాలి.అమెరికాలో ప్రతి పల్లెటూరికీ విమానాలు అనుమానాలు లేకుండా ఎగరాలి.ప్రపంచంలో ఎక్కడ పెట్రోలు దొరికినా అందులో అమెరికా వేలుపెట్టి తీరాలి.వారి కంపెనీలే ఆ చమురంతా తవ్వాలి.వెలికి తియ్యాలి.తరలించుకుపోవాలి.ఏ దేశప్రజల ప్రయోజనాలు ఎలా మట్టిగొట్టుకుపోయినా సరే అమెరికా కంపెనీల లాభసాటికి మాత్రం ఢోకా ఉండకూడదు.అదో United Corporations of America.ప్రజాస్వామ్యం అమెరికన్ జీవన విలువలు వంకాయ బెండకాయ- ఇవన్నీ సదస్సుల్లో మైకులు పగలగొట్టడానికి మాత్రమే.మన దగ్గర మేరా భారత్ మహాన్‌లు ఎలాంటివో అక్కడ అవి కూడా అలాంటివే.

ఓ బస్తీలో గూండాయిజం చెయ్యడానికి అలవాటుపడ్డ రౌడీకి ఒక్కడు ఎదిరించినా సరే గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి.ఇప్పుడు వీణ్ణి ఉపేక్షిస్తే ముందుముందు తన బతుకు కుక్కబతుకైపోతుందని నిశ్చయించుకుని పట్టపగలు అందరూ చూస్తూండగా ఆ తిరుగుబాటుదారుణ్ణి కసిగా కర్కశంగా చంపేస్తాడు.తన బండతనం ముందు హేతువాదం బలాదూర్ అని నిరూపించడానికి తహతహలాడతాడు.ఇప్పుడు ఇరాక్ విషయంలో అమెరికా చేసింది కూడా సదరు రౌడీపనే.తద్వారా ఉత్తర కొరియాని ఇరాన్‌ని కూడా బెదిరించవచ్చునని ఆలోచిస్తున్నాడు భూషయ్య(President George W.Bush).ఇక్కడ ప్రతియెన్నికకీ ఓ ప్రత్యేక రాష్ట్రం అవసరమౌతున్నట్లు అక్కడ ప్రతియెన్నికకీ ఓ బడుగుదేశం మీదికి పోయి యుద్ధంచెయ్యడం అవసరమౌతోంది.

అమెరికా ! నీకు నిజంగానే వినాశకాలం దాపురించింది.లేకపోతే నీకు ఈ విపరీత బుద్ధులెందుకు పుడతాయి? నీ చరిత్ర (రెడ్ ఇండియన్)హత్యలతో మొదలయింది.హత్యలతో కొనసాగుతోంది.హత్యలతోనే అంతమౌతుంది కూడా.భూమి ఉందని డబ్బుందని టెక్నాలజీ ఉందని ఒళ్లుమరిచి మదంతో కొవ్వొక్కి ఈరోజు నువ్వేస్తున్న కుప్పిగంతులకి భరతవాక్యం పాడే రోజొస్తుంది.తప్పకుండా వస్తుంది.నీ రావణాసుర లంక కోసం ఎందరో వానరవీరులు కూడా కాచుక్కూచున్నారు.నువ్వు నిష్కారణంగా పీనుగుల పెంటలుగా మార్చిన వియత్నాం గ్రెనడా లిబియా ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ దేశాల మానవాత్మలు నిన్ను మనస్ఫూర్తిగా శపిస్తున్నాయి.నువ్వు పాపాలుచేసి అలవోకగా మర్చిపోతున్నావు.నీ దుర్మార్గం మాత్రం ఎవరూ మర్చిపోవట్లేదు.ఏదో ఒక రోజు చలిచీమలన్నీ నిన్ను చుట్టుముడతాయి.నువ్వు ఆయా దేశాలకి పట్టించిన గతే నీకు కూడా పట్టిస్తుంది విధి.కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదులే.నేటి పీడితులే రేపటి పీడకులవుతారు.గుర్తుంచుకో.


పూర్తిగా చదవండి