పుట్టుక గురించెవరైనా మాట్లాడుతుంటే
నా వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది
విశ్వం పుట్టడానికెన్ని సిద్దాంతాలున్నాయో ...
నాకు తెలియదు కానీ...
ఈ ప్రపంచంలో నేను పుట్టడానికిమాత్రమొక్కటే సిద్ధాంతం
వంశపారంపర్యంగా నాకుటుంబంవాళ్ళే
దేవుడిపెళ్ళాలైపోవడం
భూస్వామ్యానికి భోగవస్తువునై
పెత్తందారీ చిత్తాన్ని రాగరంజితం చేయడం
వాళ్ళ కామదహనానికి బలైపోతూ
తరతరాలుగా మాతంగిగానలిగిపోవడం

అంతా తమపుట్టుక గురించి
ఏవేవో పురాణాల్ని పవిత్రంగా వినిపిస్తుంటే
నేను కూడా
ఏ పోలేరమ్మనో, ఏ పోచమ్మనో రచ్చబండ మీద కీడ్చుకొచ్చి
నేనెవడికి పుట్టానో
నాకెవడివల్ల ఎవడు పుట్టాడో
ఆదేవతలచేతే చెప్పించాలనిపిస్తుంది

అయినా నాకో అనుమానంగానీ...
మహాపురుషుల పాదాలనుంచి పుట్టినోళ్ళు తప్ప
ఆదేవుళ్ళెవ్వరికీ ఇతరుల యవ్వనాలంతగా రుచించవా...?
- డా. దార్ల వెంకటేశ్వర రావు.
( ఈ కవిత ఈ రోజు (29-01-2007) ఆంధ్ర ప్రభ దినపత్రిక 'సాహితీ గవాక్షం ' లో ప్రచురితమయ్యింది)

పూర్తిగా చదవండి