గృహప్రవేశం కథ

మా నాన్నగారి స్మృతులు కొనసాగిస్తున్నాను.

పల్లెటూరి కుఱ్ఱవాడైన వెంకటేశ్వర్లుగారికి గుంటూరు పట్టణం బాగా నచ్చింది.మఱ్ఱిపూడిలో లేని విధంగా ఆనాటి గుంటూరులో ఉన్న సినిమాహాళ్ళు హోటళ్ళు బస్సులు వగైరా అన్నీ ఆయన యువ హృదయాన్ని ఆకట్టుకున్నాయి.కాని అద్దెకొంపల్లో కాలక్షేపం చెయ్యాల్సి రావడమే ఆయనకి నచ్చలేదు.అదీగాక కోటంరాజు కుటుంబరావుతో పడ్డ తగాదాలు ఆయనకి ఓ చేదు అనుభవాన్ని మిగిల్చాయి.దాంతో ఆయన గుంటూరులో ఓ సొంతయిల్లు కట్టుకోవాలని నిశ్చయించు కున్నారు.అప్పటికి (1950)ఆయన ఇంకా బి.కాం పరీక్షలు రాస్తున్నారు.తన సంకల్పం గురించి ఆయన తల్లితో కూడా చెప్పారు.ఆవిడ కూడా అందుకు సమ్మతించింది.

అప్పుడప్పుడే గుంటూరులో కొంగ్రొత్తగా ఏర్పడింది Guntur Co-operative House Construction Society అనే సంస్థ.మన రాష్ట్రంలో ఉన్న అతిప్రాచీన గృహనిర్మాణసంస్థల్లో ఇది ఒకటి.ఇది ఇప్పటికీ విజయవంతంగా పనిచేస్తూనే ఉంది.దీని ప్రధాన కార్యాలయం గుంటూరులో శ్రీనివాసనగర్‌లో ఉంది.నిజానికి దీనిలా పనిచేస్తున్న సంస్థలు ఆంధ్ర ప్రభుత్వ లెక్కల్లో మరో రెండు మాత్రమే ఉన్నాయి.గుంటూరు నగరంలో అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ సంస్థ నిర్మించిన కాలనీలు ఎన్నో ! పాత పట్టాభిపురంతో మొదలైన ప్రస్థానం కొత్త పట్టాభిపురం శ్రీనివాసనగర్ భ్రమరాంబాపురం మల్లికార్జునపురం గణేష్ నగర్ మొదలైన పలు మహా కాలనీల నిర్మాణానికి చేరింది.ఈ సంస్థ నిర్మించిన ఇళ్ళు అందుబాటులో ఉండడమే కాదు మంచి దృఢమైనవి కూడా.వారు కట్టిన ఇళ్ళన్నీ అప్పట్లో చాలా పెద్దవి.ఉదాహరణకి పాతపట్టాభిపురంలో ఉన్న ఇళ్ళు ఏవీ 500 గజాలకి తక్కువ కావు.అలాగే కొత్త పట్టాభిపురంలో ఉన్న ఇళ్లేవీ 1000గజాలకి తక్కువ కావు.అలాగే ఇళ్ళ సంఖ్య కూడా గణనీయమైనది. రెండు పట్టాభిపురాల్లోను కలిపి అప్పట్లో 250 ఇళ్లు నిర్మించారు.1985-90 ప్రాంతంలో అందులో కొందరు సోమరిపోతులూ అవినీతిపరులూ చేరారు. కాని తొందరలోనే సంస్థ నష్టాల నుంచి కోలుకుని తన పూర్వవైభవాన్ని సంతరించుకుంది.

అప్పట్లో గుంటూరు మునిసిపల్ కౌన్సిల్‌లో చావలి సూర్యనారాయణగారనే కౌన్సిలర్ ఉండేవాడు.హౌస్ కన్‌స్ట్రక్షన్ సొసైటీకి ఆయనే పెద్ద దిక్కు.ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు కాంగ్రెస్‌పార్టీ చరిత్ర రచయిత అయిన భోగరాజు పట్టాభిసీతారామయ్యగారికి రాజకీయ అనుచరుడు.కొంచెం స్త్రీవ్యామోహపరుడు కూడా.ధర్మపత్ని కాక వరలక్ష్మి అనే బ్రాహ్మలామెతోను సునందమ్మ అనే మాల స్త్రీతోను "సత్సంబంధాలు"నెలకొల్పాడు.వారిలో వరలక్ష్మిగారు పట్టాభిపురం హైస్కూల్‌లో టీచరుగా పనిచేసేది.సూర్యనారాయణగారిని పెళ్ళిచేసుకోకపోయినా ఆయనతోను ఆయన ధర్మపత్నితోను కలిసి వారి ఇంట్లోనే ఉండేది.చాలా కలుపుగోలు మనిషి.సూర్యనారాయణగారితో పాటు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనేది.ఆయన భార్యకి కావాల్సినవన్నీ వేళకి సమకూర్చి స్కూలికి వెళ్లేది.సునందమ్మగారు వేరే ఎక్కడో దూరంగా ఉండేది.సూర్యనారాయణగారే ఆవిడ ఇంటికి వెళ్ళొస్తూ ఉండేవారు.ఆవిడకి ఆయన వల్ల ఒక కూతురు కూడా జన్మించింది.ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యాక సూర్యనారాయణగారు అగ్రకుల భేషజాలకి పోకుండా స్వయంగా పెళ్ళిపీటల మీద కూర్చుని కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు.ఆ విషయం ఆ రోజుల్లో గుంటూరంతా "హవ్వ హవ్వ" అనుకుంటూ విడ్డూరంగా చెప్పుకున్నారు.

ఆయనకి ఇద్దరు తమ్ముళ్లు-చావలి రామచంద్రరావు చావలి గోపాల రావు అని ! చావలి రామచంద్రరావుగారికి పిల్లలు లేరు.అందుచేత చావలి గోపాలరావుగారి మూడో కొడుకుని దత్తత తీసుకున్నారు.చావలి సూర్యనారాయణగారు 1963-65 మధ్యకాలంలో 60-62 ఏళ్ళ వయసులో గుంటూరులోనే మరణించారు.

మళ్ళీ మన సందర్భానికొద్దాం.తన గురువుగారైన పట్టాభి సీతారామయ్యగారి పేరుమీద గుంటూరులో ఓ పెద్ద కాలనీ కట్టించాలని చావలి సూర్యనారాయణగారు సంకల్పించాడు.కాకతాళీయంగా ఆయనదీ మఱ్ఱిపూడే.అందుచేత వెంకటేశ్వర్లుగారి మీద ఆయనకి అవ్యాజమైన అభిమానం ఏర్పడింది.

ఆ రోజుల్లో కంకరగుంట రైల్వేగేటు దాటితే ఊరు లేదు.ఆనాటికి గుంటూరంటే పెద్దబజారు, పాత గుంటూరు గ్రామం, బ్రాడీపేట, అరండల్‌పేట, కొత్తపేట ఇంతే !ఇంకేమీ లేదు.అంటే ఈనాడు మనకి తెలిసిన సువిశాలమైన పశ్చిమ గుంటూరు నగర భాగం బొత్తిగా లేదన్నట్టు.అక్కడంతా పొలాలు కొండలు గుట్టలు వాటి మధ్య భజరంగ్ జూట్‌మిల్స్ అనే పారిశ్రామిక సంస్థ ఉండేవి. అలాంటి చోట కాలనీ కట్టాలని ఆయన పూనుకున్నాడు.ఆ ప్రాంతం అప్పుడు గుంటూరు పట్టణ పరిధిలో కాక నల్లపాడు గ్రామ పంచాయితీ పరిధిలో ఉండేది.అక్కడ 100ఎకరాల్ని నివేశన స్థలాలుగా రోడ్లుగా విభజించారు.వాటిని సభ్యులకి చీట్లు(lottery)వేసి కేటాయించారు.సాధారణ స్థలాలు 500గజాలు ఉండగా మూల తిరుగుడు స్థలాలు (corner plots)మాత్రం పెద్దవి (700-800 గజాలవి)ఏర్పడ్డాయి.చావలి సూర్యనారాయణగారు అలాంటి ఓ మూలతిరుగుడు స్థలాన్ని వెంకటేశ్వర్లుగారికి కట్టబెట్టాడు.అలా ఏర్పడింది గుంటూరులో వెంకటేశ్వర్లుగారి శాశ్వత చిరునామా -"B 1-10 Old Pattabhipuram Guntur"

ఒక్కొక్క (డబుల్ బెడ్‌రూం)ఇల్లు కట్టడానికి వేసిన ప్రాథమిక అంచనా రు.10,000 (పదివేలు).కాని నిర్మాణ దశలో వ్యయం అంచెలంచెలుగా పెరుగుతూ పోవడంతో 1953నాటికి రు.17,000 చెల్లించాల్సి వచ్చింది.అయితే వెంకటేశ్వర్లుగారు మఱ్ఱిపూడి పద్ధతిలో వడ్లబస్తాల కొట్టు ఇంటి బయట రెండు నీళ్ళగదులు టాయిలెట్లు కట్టడం మూలాన కూడా ఖర్చు తడిసి మోపెడయింది.అదీ గాక సొసైటీవారు కట్టిన నాలుగు గదులకి తోడు ఇంకో నాలుగు గదులు కట్టి భవనాన్ని విస్తరించడం కూడా అందుకు దోహదించింది.

అలా ఊరికి దూరంగా కట్టిన పట్టాభిపురం కాలనీ నిర్మాణం 1953నాటికి పూర్తయింది.ప్రహరీ గోడలు (compound walls)గాని మేడలపై పిట్టగోడలు(parapet walls)గాని లేని ఇళ్ళతో అదో పూర్వకాలపు ఋష్యాశ్రమ వాటికలా ఉండేది.పొలాల మధ్య ఉండడంతో తరచుగా ఇళ్ళలోకి పాములు తేళ్ళు వచ్చేవి.రాత్రిపూట గుంటూరులోని రిక్షావాలాలు అక్కడికి రామని తిరస్కరించేవారు.ఇప్పుడేమో పట్టాభిపురమంటే నగరం నడిబొడ్డు.

వెంకటేశ్వర్లుగారు కట్టించిన ఇంటిని ఆయన మరణానంతరం 2002లో గుంటూరికి చెందిన ప్రకాశరావనే వైశ్య పారిశ్రామిక వేత్తకి అమ్మివేయడం జరిగింది.

పూర్తిగా చదవండి