చలపాయిగారి కథ-2

చలపాయిగారు కొంచెం పొట్టిగా పుష్టిగా ఆరోగ్యంగా ఉండేవారు.మనిషి చామన చాయ.70ఏళ్ళ వయసులో కూడా మంచి భోజనపుష్టి ఉండేది.వినికిడి ఏ మాత్రమూ మందగించలేదు.కంటిచూపు మసకబారలేదు.మధుమేహం రక్తపోటులాంటివి దరిజేరలేదు.ఆ వయసులో కూడా కిలోమీటరు దూరం నడిచి జిల్లా గ్రంథాలయానికి వెళ్లేవాడు.1976ప్రాంతంలో ఆయన స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకుని బొంబాయినుంచి తిరిగి గుంటూరు వచ్చేశారు.గుంటూరు బ్రాడీపేట నాలుగో లైనులో వారి తండ్రిగారి నుంచి సంక్రమించిన రెండంతస్తుల యిల్లు ఒకటి 500గజాల స్థలంలో విస్తరించి ఉండేది.అక్కడే శేష జీవితం గడపాలని అనుకున్నారు.అలానే కొంతకాలం గడిపారు కూడా.ఆయనకి బొంబాయిలో కూడా ఒక అపార్ట్‌మెంట్ ఉండేది.అది ఆయన కట్టించినది కాదు.కొన్నదీ కాదు.అది ఆయన పాతికేళ్ళ పాటు అద్దెకున్న అపార్ట్‌మెంట్.దాని యజమాని దాన్ని ఈయనకి అద్దెకిచ్చి మళ్లీ అటు తిరిగి చూసిన పాపాన పోలేదు.కనుక న్యాయస్థానం వారు దాన్ని చలపాయిగారికి ధారాదత్తం చేస్తూ తీర్పుచెప్పారు.అప్పట్లో ఆయన దాన్ని 15లక్షలకి అమ్ముకున్నాడని చెప్పుకున్నారట.

ఆయన తెలుగు హిందీ ఇంగ్లీషుభాషల్లోనే కాక గణితశాస్త్రంలోను భౌతికశాస్త్రం(Physics)లోను మంచి ఉద్దండ పిండం.తెలుగు భాషాభిమాని కూడా."ఉన్న దరిద్రాలకి తోడు మన నెత్తిమీద ఈ హిందీ ఏమిటి ?"అని తఱచుగా వాపోయేవాడు.జిల్లా గ్రంథాలయంలో తన కుటుంబ సభ్యులందరి పేరిటా సభ్యత్వం తీసుకుని-వెళ్ళినప్పుడల్లా ఓ డజను దిబ్బల్లాంటి పుస్తకాలు ఇంటికి మోసుకొచ్చి తదేక ధ్యానంతో అహోరాత్రాలూ చదివేవాడు.ఇంటికొచ్చే పిల్లలకి ఉచితంగా ట్యూషన్ చెప్పేవాడు.ఆయన బోధన మూలంగా లాభపడి IITదాకా వెళ్ళినవారిలో వెంకటేశ్వర్లుగారి పెద్దబ్బాయి కూడా ఒకరు.

చలపాయిగారు పూర్తి నాస్తికుడని చెప్పలేము.కనుక ఒక రకంగా అజ్ఞేయవాది(agnostic)అని చెప్పుకోవచ్చు.మొత్తం మీద గుడికి వెళ్ళడం గాని తద్దినాలు పెట్టడం గాని ఆయన జీవితంలో భాగం కాదు."కర్మ సిద్ధాంతమో దైవ విశ్వాసమో ఏదో ఒకటే కరెక్టవుతుంది గాని రెండూ ఏకకాలంలో కరెక్టయ్యే అవకాశం లే"దని వాదించేవాడు.

ఆయనకి విఠల్ అనే కొడుకు తప్ప వేరే సంతానమెవరూ లేరు.చాలా కాలంపాటు సంతానం లేక ఆయన భార్య దుర్గమ్మగారు పంఢరీపురం విఠలుడికి మొక్కుకుంటే ఆ అబ్బాయి పుట్టాడు.ఆవిడ తన బిడ్డకి ఆ దేవుడి పేరే పెట్టుకుంది.అతను బెంగుళూరులోనే చదువుకుని అక్కడే Hindustan Aeronautics లో చాలా కాలం నుంచి ఉద్యోగం చేస్తున్నాడు.అతని క్కూడా ఇప్పుడు 52-53ఏళ్లుండొచ్చు.అతనికి 1976ప్రాంతంలో విశాఖపట్నంలో వివాహం జరిగింది.పెళ్ళితంతు ఇంకా మొదలుకాలేదు.ఆడపెళ్ళివారి విడిదిలో రాత్రివేళ కరెంటు పోయింది.ఆ సమయంలో చలపాయిగారి బంధువుల్లో మదపిచ్చి గల ఓ పెద్దమనిషి పెళ్ళికూతురిని వెనకనుంచి వాటేసుకున్నాడు.ఆ అమ్మాయి భయంతో పెద్దపెద్దగా కేకలుపెట్టింది.క్షణంలో కరెంటొచ్చింది.ఆ పెద్దమనిషిని అందరూ కొట్టబోయారు."తప్పయిపోయింది క్షమించండి పెళ్ళికూతురనుకోలేదు."అని సర్ది చెప్పుకున్నాడు ఆ బుద్ధిహీనుడు.గొడవ ఇంకా ఎక్కువ సాగదీస్తే పెళ్లే ఆగిపోగలదని భావించిన పెళ్ళిపెద్దలు ఆ వ్యవహారాన్ని అంతటితో సద్దుమణిగించారు.ఆదిలోనే హంసపాదులా ఈ సంఘటనకి దీర్ఘ కాలిక దుష్ఫలితాలేర్పడ్డాయి.తరువాత ఆ కోడలుపిల్ల మామగారి తరఫువారెవ్వరూ తన యింటికి రాకుండా కట్టడి చేసిందని చెప్పుకుంటారు.

చలపాయిగారికి విజయలక్ష్మి అనే చెల్లెలు కృష్ణ అనే తమ్ముడు కూడా ఉన్నారు.చెల్లెలు పెద్దగా చదువుకోలేదు.బళ్ళో ఉండగానే మానిపించి చిన్న వయసులో పెళ్ళిచేశారు.ఆ అమ్మాయి చిన్నప్పటినుంచి బొద్దుగా ఉండేది.ఆ అమ్మాయి భర్తతో కలిసి ఉండడానికి ఇష్టపడ్డా తన లావు కారణంగా విడాకులొచ్చాయి.చలపాయిగారు పదవీ విరమణ చెయ్యడానికి ముందూ తరువాత కూడా ఆ బ్రాడీపేట ఇంట్లో నివసించినది విజయలక్ష్మి గారే.విడాకులొచ్చాక కూడా లావు తగ్గించుకోవడానికి ఆవిడ ఏ ప్రయత్నమూ చెయ్యలేదు.ఆ లావు అలా వయసుతో పాటు పెరిగి పెరిగి 60ఏళ్ళ వయసుకల్లా భీకరాకారం దాల్చింది.పైగా"వెంకటేశ్వర్లుగారూ మీ బ్యాంకులో గుమాస్తాలు నన్ను చూసి నవ్వుతున్నారు.ఇదేమీ బాగాలేదండి"అంటూ ఫిర్యాదులు చేసేది.

చలపాయిగారికి 70ఏళ్ళ వయసులో తమ్ముడైన కృష్ణాయితో బ్రాడీపేట ఇంటి గురించి మనస్పర్థలొచ్చాయి.ఆయన నండూరులో ఉన్న పొలాలు ఒకటొకటిగా అమ్మేస్తూండడం ఆయన చెల్లెలికీ తమ్ముడికీ భయాందోళనలు కలిగించాయి.బ్రాడీపేట ఇల్లు కూడా అమ్మేస్తాడనే అనుమానం వారిలో దృఢపడింది.అప్పటికే కృష్ణాయిగారు ఢిల్లీలో స్థిరపడి దశాబ్దాలవుతోంది.ఆ మధ్యలో ఇటు తొంగి చూసినది వంగి వాలినది ఏమీ లేదు.కాని 1991నాటికి ఆ యింటి మార్కెట్ విలువ 30లక్షలుండేది.ఈ నేపథ్యంలో అన్నా చెల్లెళ్లిద్దరూ కలిసి తనకేదైనా విషం పెట్టి చంపేసి ఆ యిల్లు స్వాధీనం చేసుకుంటారనే అనుమానంతో చలపాయిగారు ఆ యింటి పై అంతస్తులో మకాం పెట్టి హోటల్‌లో భోంచెయ్యసాగాడు.అన్నదమ్ములు ఎదురుపడితే చాలు హోరాహోరీ వాగ్యుద్ధాలై పోయేవి.అన్నయ్య గుంటూరొచ్చాడనే సమాచారం అందిన మరుక్షణం పోటీగా తమ్ముడు ఢిల్లీ నుంచి రెక్కలు కట్టుకుని వాలేవాడు.ఆయన బెంగుళూరు తిరిగి వెళ్ళాకనే తాను ఢిల్లీ బండి ఎక్కేవాడు.ఇలా చాలా నెలలపాటు జరిగింది.

ఈ క్రమంలో ఒకసారి అలా ఢిల్లీకి తిరిగి వెళుతూ దారిలో ఒక స్టేషన్‌లో మంచినీళ్ళు పట్టుకుందామని సీసాతో సహా ట్రెయిన్ దిగాడు కృష్ణాయిగారు.ఆయన సీసా ఇంకా నిండకముందే మధ్యలో తలెత్తి చూసేసరికి ట్రెయిన్ కదిలి వెళ్ళిపోతోంది."ఆఁ..ఆఁ..ఆఁ.."అంటూ షాకుతో అక్కడికక్కడే విరుచుకు పడిపోయాడు.మఱింక లేవలేదు.ఆయన సీసాలోని నీరంతా ఒలికిపోయింది.

తరువాత వారి ఇంటిని విజ్ఞాన్ విద్యాసంస్థల వారు కొన్నారు.చలపాయిగారు బెంగుళూరులో తన కొడుకు దగ్గరికి వెళ్లిపోయారు.ఇప్పటికీ బతికే ఉంటే ఆయనకి 86 ఏళ్ళు ఉంటాయి.

పూర్తిగా చదవండి