‘రానారె’ తో ముచ్చట్లు!
Uncategorized February 15th, 2007మొన్న నా ఇంటర్వ్యూలలో భాగంగా టెక్సాస్ కు మూడు సార్లు వెళ్లాను. కానీ ప్రతి సారీ మన తోటి తెలుగు బ్లాగరయిన ‘కాదరయ్య’ను అదే మన ‘రానారె’ ను కలవాలనుకొంటూనే ఉన్నాను. మొదటి రెండు సార్లు కుదిరింది కాదు, ఇలా కాదని ఈసారి వయా హ్యూస్టన్ వెళ్లాను. అలా మూడోసారి ముచ్చటగా కలిసి ముచ్చట్లు చెప్పుకొనే అవకాశం దొరికింది.
ఠంచనుగా అనుకొన్న సమయానికే కలుసుకొన్నాం ఇద్దరం. అన్నట్టు మీరెవరైనా ఆర్కుట్ లో రానారె ఫోటోలు చూసిఉంటే (మా మరో మిత్రుడన్నట్లు తన బ్లాగులోని కళ్లల్లో ‘అమాయకత్వాన్ని’ ఎలానూ చూసి ఉంటారు) మీకో సంగతి చెప్పాలి. ఫోటోలో కంటే అందంగా ఉన్నాడు. పెళ్లీడు కొచ్చిన అమ్మాయిలూ ఒక్కసారి మీ చెవులు రిక్కించి వినండి…ఈ యువకుడు యుక్తవయస్సు కొచ్చాడు (’ది మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ ఇన్ ది టౌన్’ అని దీనర్థం.)
ఇప్పటివరకూ పెళ్లిపత్రికలే మన బ్లాగుల్లో చూస్తున్నాం (చూ.అనిల్ చీమలమర్రి) ఇకపై పెళ్లిచూపులు కూడా బ్లాగుల్లో జరుగుతాయేమో;-) ఏదేమైనా తనివితీరా మాట్లాడుకొన్నాం… ఎంతదాకా అంటే నేనెక్కాల్సిన విమానం ఎగిరిపోయేదాకా! నాకది తెలిసే సరికి అప్పటికే రానారె తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. ఇక ఏం చేస్తాం అంటూ ఒక పుస్తకాల షాపులో కూలబడి ఆవురావురుమని తినడం మొదలుపెట్టాను పొత్తాలని. చిత్రం ఏమిటంటే తను కూడా దారితప్పి గంట ఆలస్యంగా చేరాడట తన నెలవుకి. నేనేమో ఆరు గంటలు ఆలస్యంగా చేరాను కొలువుకి.
సి.బి.రావు గారూ మీరేనా తెలుగు బ్లాగర్ల చిత్రాలు పెట్టేది? సముద్రానికీవల మేము సైతం అంటూ పెడదామనుకొని వీరలెవల్లో కెమెరా తీసుకెళితే…అక్కడికీ రానారె గుర్తు కూడా చేసాడు, కానీ ఏది మాటల ఊసుల్లో పడి అదీ మరచిపోయాను…ప్చ్! మొత్తానికి ఎలాగో ‘ఒడెస్సా‘ చేరాను. కింద చూస్తే అంతా ఎడారే, కనుచూపు మేరా నలుచదరంగా చిన్న చిన్న మట్టిరోడ్లు మధ్యలో ఆయిల్ పంపులు. పైపొచ్చు భూషయ్య సొంత ఊరట (పుట్టిన ఊరు కాదు) పక్కనున్న మిడ్-ల్యాండ్.
మొత్తానికి బాగానే చేశాను ఇంటర్వ్యూ. నా రెసిడెన్సీ (ఎం.డి.) ప్రస్థానంలో ఇదే చివరి మజిలీ. ఫలితాలు తేలేది మార్చి 15న, అప్పటి వరకూ వేచి చూస్తూ ఇదిగో ఇలా…అన్నట్టు చెప్పడం మరిచానండోయ్! నా ఈ ‘శ్రీ కృష్ణదేవరాయలు’ని బ్లాగర్ల పోటీలో నామినీగా ఎన్నుకొన్నందుకు మీకు, ఆ నిర్ణేతలకు నా కృతజ్ఞతలు. పక్కనే చూశారుగా ‘మీ ఓటు నాకే’ అనే లంకె ఎలా మెరిసిపోతోందో…ఇంకెందుకింక ఆలస్యం ఆ లంకె మీద నొక్కండి, మీ ఓటును వేయండి!
పూర్తిగా చదవండి