నేను గమనించినవేంటంటే…
మీకు తెలుసా? June 13th, 2007బ్లాగరు మహాశయులారా అందరికీ నమస్కారం!
చాలా రోజులయింది బ్లాగుల్లోకి అడుగు పెట్టి… అన్ని పనులూ ముగించుకుని ఇలా రాయడం మొదలు పెట్టడానికి - సుమారు రెండు నెలలు అయిందనుకుంటా! అయితే కూడలి మాత్రం రోజూ చదువుతూనే ఉన్నా!
వాదాలూ, వివాదాలూ, వింతలూ, వినోదాలూ అబ్బో చాలానే ఉన్నాయిగా!
ఇన్నాళ్ళూ కేవలం పాఠకునిగా మిగిలాక, చాలా విషయాల్ని గురించి ఒక మంచి అవగాహన వచ్చింది. అదే మన బ్లాగులూ, బ్లాగర్ల గురించేనండీ! అవేంటో మీతోనే చెప్పేస్తే బాగుంటుందనీ ఇలా మొదలెట్టా!
మన బ్లాగుల్లో ముఖ్యంగా నేను గమనించినవేంటంటే…
(నేను చెప్పబోయేవన్నీ ఖచ్చితమైనవి అనుకోకండి. అన్నింటికీ “అనిపిస్తోంది” అన్నది కలుపుకొని చదవండి.)
కొందరు బ్లాగర్లు ఇంతకు పూర్వం తమ పోస్టులపై వ్యాఖ్యానించిన వారిని దృష్టిలో పెట్టుకుని అవకాశం దొరికినప్పుడు వారి ఆలోచనలను అనాలోచితంగా ఖండిచటం పనిగా పెట్టుకున్నారు. (ఆధారాల విషయం ఎందుకులెండి! మనందరికీ తెలుసు)
బ్లాగర్లలో వర్గాలూ ఉన్నాయండీ!!!
ఇంట్లో తమ వాళ్ళతో ఆప్యాయంగా గడపాల్సిన సమయాన్ని కాస్తా ఈ బ్లాగులకే వెచ్చిస్తూ అనవసరపు చెత్తంతా రాసే వాళ్ళు ఎక్కువయ్యారు.
అంతా రాసే వాళ్ళే గానీ, ఇతరుల పోస్టులను చదివి వాటిల్లోని వాస్తవాంశాలను గూర్చి ఆలోచించే వారి సంఖ్య తక్కువ!
కూడలిలో కనిపించిన వాళ్ళే కనిపిస్తారు, అంతే కాదండోయ్ వాళ్ళకు వాళ్ళే పొగిడేసుకుంటూంటారు. విషయం లేకపోయినప్పటికీ!
పాఠకులను ఆకర్షించాలనో, మరేదో చేయాలనో పూర్తిగా వ్యక్తిగత విషయాలను రాస్తూ, అందులో అనవసరపు చమత్కారాలు గుప్పిస్తూ, ఏదో ఉత్కంఠ రేపుతున్నామని భ్రమపడిపోయి, తమ ప్రతిభకు తామే మురిసిపోయే కొందరు ఉన్నారనీ… (వీళ్ళు రాసేవి యాత్రా చరిత్రలు, స్వీయానుభవాలు, అనుభూతులు కావు! వ్యాపార నవలల కన్నా ఇంకా ఇంకా హీనమైన ధోరణిలో…)
మంచి పాలు కూడా ఉందండీ!
వీళ్ళు తమ అభిప్రాయాల్ని సాలోచనంగా, నిర్భయంగా బయట పెడతారు. తమపై వచ్చే విమర్శల్ని గురించి కూడా ఆలోచిస్తున్నారు.
సమాజంలోని కట్టుబాట్లు, సిద్ధాంతాలు, ఆచారాలు మొ.న వాటికి పూర్తిగా లోబడిలేరు. వాటిలోని మంచి చెడ్డల్ని సవిమర్శకంగా అలోచిస్తూ పాఠకుల్నీ ఆలోచింపజేస్తున్నారు.(మాతృత్వం, ప్రాంతీయత, పాలన పరమైన అంశాలపై జరిగిన చర్చలను బట్టి.)
చదివించే విధంగా, ఒకవేళ చదివినా మంచి విషయాన్ని తెలుసుకున్నాం అని అనిపించే విధంగా రాసేవాళ్ళూ ఉన్నారు. అయితే వీరి సంఖ్య చాలా చాలా పెరగాలి.
ఇంకా చాలానే ఉన్నాయి గానీ ఇప్పటికివి చాలు.
వీటన్నిటికీ నేను పూర్తిగా అతీతున్ని అని మాత్రం అనుకోకండే!
పూర్తిగా చదవండి