మొన్న ఆ మధ్య మా మెడికల్ క్యాంప్ కోసం పోస్టర్లు అంటించడానికి వెళ్ళాము నేనూ, నా స్నేహితురాలూనూ. మళ్ళీ నా బ్రెయిన్ లో ఓ మూల నక్కి, అప్పుడప్పుడూ గోల చేసే నిస్సహాయత కాసేపు గోల మొదలెట్టింది.

అవి రోడ్డు లో ఖాళీ గా ఉన్న చోట ఏర్పరుచుకున్న స్లం ఏరియా లు. ఈరోజు ఉన్నాయి..రేపు ఉంటాయో లేదో తెలీదు. వర్షకాలం లో ఎలా బ్రతుకుతారో అర్థం కాదు. ఒక చిన్న టెంటేసుకుని అందులో ఐదారుమంది ఎలా ఉంటారో అర్థం కాదు. ఓ మోస్తరు మధ్యతరగతి ఇండిపెండెంట్ ఇల్లు పట్టే స్థలం లో అక్కడ కనీసం లో కనీసం ఓ 5,6 కుటుంబాల “ఇళ్ళు” ఉంటాయి. సమస్తం అక్కడే… … మరి… చూస్తూ చూస్తూ చలించకుండా ఉండలేను… చలించినా చేయగలిగేదేమీ ఉండదు. ఆదివారం క్యాంపు కి రండమ్మా, మీ వాళ్ళకి కూడా చెప్పండి అనడం తప్ప. మహా అంటే పిల్లలతో చదువుకొమ్మని చెప్పడం… వాళ్ళు కాస్త స్నేహంగా స్పందిస్తే సరదాగా ఓ పది నిముషాలు కబుర్లాడటమో.. అవకాశముంటే ఆటాడడమో…అంతే!

నాకు అన్నింటికంటే ఆశ్చర్యం కలిగించేది ఏమిటి అంటే - మాకున్న వాలంటీర్ల కొరత. ఇది విద్యార్థుల్లో ఉన్న indifference అనుకోవాలా? కాంపిటీషన్ లో పడి మానవత్వం మరుస్తున్నారా? క్యాంపు పెట్టిన ప్రతి సారీ ఇదే తంతు… తెలుగు తెలిసిన వాలంటీర్లు దొరకరు! ఉన్నది ఇద్దరో ముగ్గురో… వాళ్ళలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ప్రీ-క్యాంపు కార్యకలాపాలకి తప్ప క్యాంప్ కి వెళ్ళి డాక్టర్ కి సహాయపడ్డం కుదరదు చాలా సార్లు. తోటి విద్యార్థులకి చెప్పడమైతే చెప్పగలను గాని, campaign చేసే తెలివితేటలు ఏడవలేదు నాకు! :(

ఆ మధ్య లింగ్డో గారు మా కాలేజీ కి వచ్చినప్పుడు విధ్యార్థులతో ఓ సెషన్ ఏర్పాటు చేసారు. నేను ప్రశ్నలేమీ అడక్కపోయినా అక్కడే కూర్చుని అందరి అభిప్రాయాలు విన్నాను. అప్పుడో లింగ్డో అన్న మాటలు గుర్తు వస్తున్నాయి. టెక్నికల్ యూనివర్సిటీల్లో పిల్లల మధ్య సామాజిక సమస్యల గురించీ, రాజకీయాల ఇతర యూనివర్సిటీల్లో జరిగే వాడి-వేడి చర్చలు జరగవనీ, అలా జరగడం చాలా అవసరమనీ అన్నారు. బహుశా అలాంటి చర్చలు జరక్క పోవడానికీ, మా జనాల్లో (అనగా టెక్నికల్ యూనివర్సిటీల జనాలకి) ఉండే indifference కీ ఏమన్న సంబంధం ఉంటే ఉండొచ్చు అనిపిస్తుంది. వీళ్ళకి వాస్తవం అంటే పెద్ద పెద్ద కంపెనీల్లో లషలకు లక్షలు గుమ్మరించే ఉద్యొగం మాత్రమేనా? సమాజం లో ఇంకో తరగతి వారి జీవితాలు తమతో పోలిస్తే ఎంత దుర్భరంగా ఉన్నాయో పట్టదా? అనిపించింది. నాకేమీ ఎదగాలన్న కోరిక లేక కాదు. లక్షలు జీతాలొచ్చే ఉద్యోగం కోరుకోవడం తప్పనీ కాదు… నాకూ ఉంది చదువవగానే మంచి ఉద్యోగం లో చేరాలి అన్న కోరిక… ఎవరికుండదు? కానీ…. మనకున్న ఖాళీ సమయం లో…. ఓ కాస్త సమయం… ఐదు సినిమాలు చూసే సమయం లో నాలుగు మాత్రం చూసి ఓ సినిమా సమయం దీనికి కేటాయించొచ్చు.

అసలైనా, నేనెవరి కోసం ఈ టపా రాస్తున్నానో వారు ఇది చూసే అవకాశం లేదు అనుకోండి… అయినా…ఏదో నా గోల నాది….. మనీ సాయం చేయాలని విద్యార్థుల్నుంచి ఎవరూ ఆశించరు. మాట సాయం, కాస్త చేత సాయం…. వెరసి..కాస్త సమయానికి ఓ చెయ్యేస్తే  అంతకంటే కావాల్సిందేముంది…. ??


పూర్తిగా చదవండి