అనగనగా ఓ కథానాయకుడు. పేరు మాటవరసకి బండోడనుకుందాం. ఎప్పుడో  కొన్ని ఏళ్ళ నాటి మాట. మన బండోడు దారుణమైన ఫ్లాప్ సినిమాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో, ఒక ఆవుట్ డోర్ సినిమా షూటింగ్ అడవుల్లో చిత్రీకరిస్తున్నారు. విరామ సమయంలో నీళ్ళు త్రాగి నిర్లక్షంగా ఆ బాటిల్ పక్కనపడేసాడు. అందులో మిగిలిన కొద్ది నీటిబొట్లు ఒక చీమ మీద పడగా, ఆ చీమ ఒక గంధర్వుడుగా మారింది.

అసలు విషయం తెలియని గంధర్వుడు ఇదంతా బండోడు తన మీద జాలిపడి నీరు ఇచ్చాడనుకొని, ఓ మానవా, నాపై నీరు పోసి నన్ను  శాప విముక్తుణ్ణి చేసావు. నీకేమి వరము కావలెనో కోరుకో అన్నాడు. వెంటనే మన బండోడు తన చావు తెలివితేటలతో జరిగిన విషయము క్షణంలో గ్రహించి, ఏమీ తెలియని వాడిలా అమాయకంగా,  దానిదేముంది ప్రభూ! ఏమియు ఆశించకుండా సహాయం చేయటం నాకు చిన్నప్పటినుంచి అలవాటే అన్నాడు. దానికి గంధర్వుడు, నీది మంచి మనసు నాయనా మరి నే వెళ్ళివస్తా అని వెళ్ళబోయాడు. తన ఓవర్ ఏక్టింగ్ బెడిసి కొట్టిందని గ్రహించి, బండోడు గంధర్వుడి వెంటపడి వరమిచ్చి వెళ్ళండి అని వేడుకున్నాడు. గంధర్వుడు సరేనన్నాడు. బండోడు తన పరిస్థితి వివరించి తన సినిమాలు ఎంత దరిద్రంగా ఉన్నా హిట్టయ్యే వరమడిగాడు. సకల ఆంధ్ర జనుల హితమును దృష్టిలో పెట్టుకొని దానికి గంధర్వుడు, నేనిచ్చే వరము కేవలం నిన్ను ప్రభావితం చేస్తుందే కాని, మరెవరినో చెయ్యాలంటే కుదరదు నాయనా అన్నాడు. ఎంతో పెద్ద ప్లాను వేసి అడిగిన వరం ఫెయిల్ అయ్యేటప్పటికి బండోడు తట్టుకోలేక పోయాడు. దాంతో బండోడు రివర్సు గేర్ వేసి గంధర్వుడు మాట తప్పాడని అతని మీద అలిగినట్లు నటించాడు.

అప్పుడు గంధర్వుడు వీడు జిడ్డుగాడని గ్రహించి ఇలా అన్నాడు. నీవడిగిన వరము నేను నెరవేర్చినట్లైతే, దాని వలన కలుగు మానవాళి నష్టమునకు నా శక్తులన్నియు నశించును నాయనా! అందుచేత నేనది అనుగ్రహించలేను, కాని దాని బదులుగా నేను మరి యొక వరము నిచ్చెదను కాని దీని ప్రభావము జనులపై కొద్దికాలమే యుండును స్వీకరింపుమని ఇట్లు పలికెను.

చూడు నాయనా, నీకు బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువ. నువ్వెన్ని కుప్పిగంతులు వేసినను నీ సినిమాలు హిట్టవుట కల్ల. అందుచేత నీవు, నీ బ్రెయిన్ ను వదిలి నీ బాడీని నమ్ముకో. నేనిదే నీకు వరమొసగు చున్నాను. ఈ క్షణము నుంచి నీ శరీరమందలి ఏదేని రెండు అంగములు భారీ శబ్ధమును చేయగలవు. దానిని నీవు యుక్తముగా నీ సినిమాల్లో వాడుకొని డబ్బులు వెనకేసుకో బిడ్డా అనెను. కానీ బండోడు ఇందుకు సమ్మతింపలేదు. దానితో గంధర్వుడు బండోడిని ముద్దుచేసి, చింతింపకు. నే నిచ్చిన వరముతో నీకు విజయం తథ్యం. అయిననూ, నువ్వు చేసిన సహాయమునకు గాను మరొక్క వరమునిచ్చుచున్నాను. నేను మరొక్కసారి నీవు తలచినప్పుడు వచ్చి సహాయపడగలనని చెప్పి మాయమైనాడు. కాని ఈలోగా నీవు విజయగర్వంచే పొంగిపోక కష్టపడి నటన నేర్చుకో అని వెడలిపోయెను.

వెంటనే మన బండోడు గంధర్వుడిచ్చిన వరమునకు  తగిన అంగములుగా తన నోటిని మరియు తొడలను ఎన్నుకున్నాడు. అప్పటినుంచి “నీ ఊరికొచ్చా, నీ పేట కొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ గదిలోకొచ్చా” అంటూ భయంకరంగా అర్థంలేని డైలాగులు చెపుతూ, అరుస్తూ, విలన్లను అవసరమున్నా లేకపోయినా తొడకొట్టి సవాల్ చేస్తూ, ఆ సౌండుతో చంపుతూ ఆ గంధర్వుడి వర ప్రభావం వలన కొన్ని హిట్స్ కొట్టుకున్నాడు.

కాని కాలము శాశ్వతముగా ఒకేలా ఉండదు కదా! గంధర్వుని ప్రభావము వీడి ప్రజలు మామూలు స్థితికి వచ్చారు. కాని మన బండోడు విజయ గర్వంతో అవేవి గ్రహించక, ఇంకా వికృతంగా అరగంట సేపు పర్వతాలెక్కి కుందేలు పట్టుకు రావటం, ఎదురుగా ఉన్నోడిని కొట్టటానికి పది నిమిషాలు అటూ ఇటూ పరిగెత్తటం, వేలితో, వెంట్రుకతో బరువులెత్తటం లాంటి సీన్లు కుప్పలు తెప్పలుగా నటించి ఎంతో మందిని హింసించి చివరకు ప్రజలచే తిరస్కరింపబడ్డాడు.దానితో కథ మళ్ళీ మొదటికొచ్చింది. హిట్లు లేక మన బండోడికి ఫిట్లు రావటం మొదలయ్యాయి.

మరో ఆలోచన లేకుండా మళ్ళీ గంధర్వుడిని పిలిచాడు. మళ్ళీ తన సినిమాలు హిట్ అవాలన్నాడు. దానికి గంధర్వుడు, చూడు నాయనా, నీకు మొదటే చెప్పాను. ఏమి లాభం? మళ్ళీ మొదటికొచ్చావు. ఇణ్ణాళ్ళు హాయిగా ఎంజాయ్ చేసావు. నటన నేర్చుకున్న పాపాన పోలేదు. నీవిచ్చిన నీళ్ళు తాగిన పాపానికి చివరిసారిగా ఈ సహాయం చేస్తున్నాను. అటుపై నీ దారి నీది అన్నాడు. నాయనా, ఇప్పటికీ నీకు బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువ గానే యున్నది. అంచేత, ఈ సారి నీకు గతములోనే ఇచ్చిన సౌండే కాక సైగలతో కూడా ప్రజలను మోసముచేయు వరమొసగుచున్నాను. కాని, ఇది కేవలం నీ రాబోవు రెండు చిత్రములకు మాత్రమే పనిచేయునని, అది ఎటుల వాడుకొనెదవో నీ ఇష్టము, అటుపై నీ టాలెంటే నీకు రక్ష అని చెప్పి మాయమయ్యెను.

బండోడు అదేమీ లెక్క చెయ్యక వరగర్వంతో మళ్ళీ యధా ప్రకారం తనదైన నటనతో ప్రజల ముందుకు వెళ్ళటానికి సిద్దమయ్యాడు………
*************************సశేషం*********************************************
 


పూర్తిగా చదవండి