అనగనగా ఒక పట్టణంలో, ఒక కాలేజ్ లో చదువుతున్న భీమరాజు మాంచి భోజన ప్రియుడు. భీమరాజుది మంచి దేహ సౌష్ఠవం. అప్పుడే పుట్టిన ఏనుగుపిల్లకన్న కొంచెం పెద్దగానూ, అడవి దున్నపోతుకన్నా కొంచెం చిన్నగా.. షుమారుగా, కొంచెం అటు ఇటుగా పిజ్జాలు తిని బలిసిన గాడిదలా ఉంటాడు.ఉదయం లేస్తే రాత్రయ్యేదాకా గురుడికి భోజన ధ్యాస తప్ప ఇంకా ఏం ఉండదు.

ఒక రోజు భీమరాజుకు పరీక్ష. రాత్రి కొంచెం పంచ భక్ష పరమాన్నాలతో తిని పడుకున్నడేమో! ఉదయం కొంచెం లేట్ గా నిద్ర లేచాడు. ఆకలేస్తుంది భీమరాజుకు. భీమరాజుకు ఒక్కగానొక్క అమ్మ. పేరు అన్నమ్మ, ఒక్కగానొక్క నాన్న. పేరు వీరన్న. ఈ వీర దంపతులకు ఒక్కగానొక్క కొడుకు బీమరాజు. భీమరాజు ను ముద్దుగా "భీమం" అని పిలుచుకుంటారు. మధ్య తరగతి కుటుంబీకులయినా వారికి ఉన్నంతలో చాలా అల్లారు ముద్దుగా పెంచి వాన్నిఆకారంలో సిలిండరు మీద ఫూట్ బాల్ పెట్టినట్టు తయారు చేశారు. అందరు అంటుంటే గాని వీరన్నకు తెలిసిరాలేదు, కొడుకు కొంచెం లావయ్యడని. పాపం అన్నమ్మ పతివ్రతా శిరోమణి. ఇల్లు దాటి బయట అడుగు పెట్టదు. అందుకే కొడుకు రోజు రోజుకు చిక్కిపోతున్నాడని అనుకుంటుంది.

సరిగ్గా పరీక్ష సమయం ఇంకా అరగంట ఉందనగా అన్నమ్మ భీమానికి ఒక పది దొశలు వడ్డించింది. బాగా నెయ్యి దట్టించి చేసిన మసాలా దోశలు చూడగానే భీమం పరీక్ష ఉన్న సంగతే మర్చిపోయాడు. పది మసాలా దోశలు ఆవురావురుమంటూ తినేశాడు. ఎవరయిన చూస్తే "పాపం బిడ్డ! తిని ఎన్ని రోజులయ్యిందో!" అనుకుంటారు. ఈ లోగా అన్నమ్మ మరొక్క పది దోశలు వడ్డించింది. "అమ్మా! మంచిగ చేసినవే... ఇంకొక పది చేసి పెట్టు. ఈ రోజు పరీక్ష అని రాత్రంతా చదివి అలసి పోయాను. బాగా ఆకలేస్తుందే..!" అన్నాడు. "నా బిడ్డే! నా బంగారం! ఎంత కష్టపడి సదువుతున్నావో! ఇంకా ఇరవై చేసిపెడతా.. తిను నాన్నా! బాగా తిను!" అంటూ దోశలేస్తుంది. ఈ మాటలు వీరన్న చెవిన పడ్డాయి. "ఒరేయ్! పంది నా కొడకా! పరీక్ష ఎప్పుడురా?" కోపంగా అరుస్తూ వచ్చాడు బయట నుండి. "అయ్యొ నాన్నా! పరీక్ష ఇప్పుడే! స్టార్టు అయ్యింది. మర్చిపోయిన. ఓయమ్మో! అవ్వి బాక్స్ ల పెట్టు. నేను ఎత్తుకపోత!" అంటూ దోశలు ఏనుగులాగా, చట్నీ దున్నపోతు కుడితి తాగినట్టు లాగించాడు. పాపం వీరన్న! కొడుకు ఇలా అయితే ఎలా బ్రతుకుతాడో అని బెంగ పెట్టుకున్నాడు. ఒక్కసారిగా చాలా కోపం వచ్చింది భీమం మీద. అసలే బక్క పర్సనాలిటీ. అచ్చం ఇప్పటి సినిమాల్లో కొండవలస లక్ష్మణ రావు లా, పాత సినిమాల్లో రాజబాబులా ఉంటాడు. కోపం లో కల్లుతాగినట్టు ఊగిపోతూ "వచ్చాక తిని చావొచ్చు. ముందు పద" అని ఒక్క తన్ను తన్ని రివర్సులో తనే కింద పడ్డాడు. భీమం వెనక్కు తిరిగి "నాన్నా న్యూటన్స్ లా అప్ప్లైడ్, వికెట్ ఔట్!" అన్నాడు వికట్టహాసం చేస్తూ.

ఎలాగయితేనేం! భీమం ను పరీక్షా హాలుకు తరలించి, అక్కడ సారును బ్రతిమాలి పరీక్షా హాలులో కూర్చోపెట్టాడు వీరన్న. అప్పటికే గంట సమయం గడిచిపోయింది. ఇంకా రెండు గంటల సమయం ఉంది. పాపం భీమం! పరీక్ష అయితే రాస్తున్నాడు కానిమనసంతా ఆ దోశల మీదనే ఉంది. దోశలు గుర్తుకు రాగానే ఆకలి స్టార్టు అయ్యింది. "బాక్స్ తెచ్చుకుంటే చక్కగా తింటూ రాసేవాన్ని. కాని మా అయ్య వద్దన్నాడు." అని తెగ బాధ పడిపోయాడు. భీమం అన్ ఈజీ గా ఉండడం తో ఇన్విజిలేటర్ "ఆర్ యు ఓ.కె. ఇప్పటికే గంట లేట్. అయినా రాయకుండా అలా కూర్చున్నవేం?" అని అడిగాడు. ఆ ఇన్విజిలేటర్ నల్లగా, బక్క్గగా, పెద్ద పెద్ద మీసలేసుకుని తొండకు మీసాలు పెట్టినట్టు ఉండడంతో, వీరప్పన్ లాగా కనిపించాడు భీమానికి. దాంతో భయపడి పరీక్ష రాయక తప్పలేదు.

రిజల్ట్స్ వచ్చాయి. భీమం ఫస్ట్ క్లాసులో ఇంటర్ పాసయ్యాడు. అనంతరం ఒక డిగ్రీ కాలేజి లో బి.యస్.సి లో జాయిన్ అయ్యాడు . . . . .

(భీమరాజుకు ప్రేమలో పడాలనే ఆలొచన రావడానికి కారణం.. రెండవ భాగంలో... వీలు చిక్కినప్పుడు రాస్తాను.)
పూర్తిగా చదవండి