ఓ సినీమా కథ!
సినిమా, హాస్యం September 28th, 2007మొదటి అంకం:
తండ్రి: ఓరే శీను, ఇంత పొద్దెక్కాక ఇంకా లేవవేమిట్రా?
కొడుకు : అబ్బా డాడీ, ఇంకాసేపు పడుకోనీయండి
తండ్రి : ఒరే ఇడియట్, ఇవ్వాళ సోమవారం రా, సెలవ రోజు కాదు. త్వరగా లే.
కొడుకు : అమ్మా చూడవే, ఈ హిట్లర్ తో చస్తున్నా!
తల్లి : ఏవిటీ మీ గోల పొద్దుటి పూట, వాణ్ణి పడుకోనీయండి. అయినా నా చంటిగాడు ఏంచేశాడు?
తండ్రి : ఏం చెయ్యాలే, టెంత్ క్లాస్ టెన్ టైంస్ తప్పాడన్న బాధ ఉందా అసలు వాడికి?
తల్లి : వాడికేం ఖర్మ పది పాసయి ఉద్యోగం చేయటానికి. మనకున్నది ఒకే ఒక్కడు. అంతా వాడిదేగా.
తండ్రి : అవునులే, నేనో లక్షాధికారి వీడో జమీందారు.
తల్లి : చాల్లెండీ గోల, రేపు వాడి పుట్టినరోజు. మీకు తెలుసుగా మన శీనుగాడు చిరంజీవి ఫాన్ అని, ఓ చిరంజీవి సినిమా టిక్కట్లు తెచ్చి సర్ప్రైజ్ చేయండి.
తండ్రి : హూ! తప్పుతుందా, శంకర్ దాదా జిందాబాద్ !
రెండవ అంకం:
తండ్రి: ఒసేయ్ రాములమ్మా! గిన్నెలు కడిగాక, వెళ్ళేప్పుడు ఆ గేటు వేసి వెళ్ళటం మరిచిపోకు.
పనిమనిషి : గట్లనే. ఓ మాట చెప్పాలయ్యా మీతోని.
తండ్రి : ఆ చెప్పు.
పనిమనిషి : ఈయాల నా పుట్టినరోజు. మరి .. మరి, నిన్నే ఇష్టపడ్డాను, నీతో చెప్పాలని …..
తండ్రి : ఆపేయ్, సిగ్గులేదూ నీకు ఈ మాటలనటానికి. ఇది సంసారులుండే పొదరిల్లు. ఫో అవతలికి!
పనిమనిషి : ఓయ్ ఏందయ్యో? ఏమనుకుంటున్నవ్. నే సెప్పేది పూర్తిగినకుంట, ఏం లొల్లి సేత్తున్నవ్.
నా పెనిమిటి, నేను కల్సి నిన్నే ఇష్టపడ్డాను, నీతో చెప్పాలని సినిమాలకెల్లనికి పైసలిమ్మని అడుగుతే, నన్ను బద్నాం చేస్తవా. నా పెనిమిటిని తీస్కొనొస్తా, తల తిరుగుతుందా?
తండ్రి : ఓ అదా, సరే సరే. ఇదిగో ఈ ఏభై తీస్కోని వెళ్ళిపో.
తల్లి : ఏమిటీ, పనిపిల్లతో పరాచికాలు, కొంపదీసి ఆయనకి ఇద్దరా ఏమిటీ?
తండ్రి : ఛీ ఛీ, నన్ను నమ్మే !
తల్లి : ఏవండీ, మనవాడి పెళ్ళిగోల ఏమన్నా పట్టించుకుంటున్నారా?
తండ్రి: అబ్బో ఈ పోరంబోకు, పోకిరి వెధవకి తెగ సంబంధాలు వస్తున్నాయ్ లే.
తల్లి : ప్రియమైన శ్రీవారు, మన శీను చిలిపి కృష్ణుడు కాడండీ, శ్రీరామ చంద్రుడు.
తండ్రి : సరేలే, నన్నెవడు నమ్మాడు. అయినా పెళ్ళాం చెపితే వినాలి కదా.
మూడవ అంకం:
కొడుకు : అమ్మా, నన్ను దీవించు
తల్లి : నా నాయనే, నీలాంటి వాడు వంశానికొక్కడు చాలు. లే లే
కొడుకు : అమ్మా నాన్న కావాలి, ఉన్నారా లోపల?
తల్లి : ఏవండోయ్ శ్రీవారు, మన బంగారం పిలుస్తున్నాడు, రండీ.
తండ్రి : ఇదిగో వచ్చేశా, ఏంటి విషయం?
కొడుకు : డాడీ, ఏంలేదు ఒకటి చెప్పాలని ఉంది, విని చిరునవ్వుల వరమిస్తావా?
తండ్రి : గాడిద గుడ్డు కాదూ, ఒసేవ్, నే చెప్పలా వీడు మామూలోడు కాదు. విషయం చెప్పురా కొడకా.
కొడుకు : అమ్మా నాన్నా, ఓ తమిళ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్ళి చేసుకున్నాం.
తల్లి : ఒరే, ఇది 2 మచ్, నిను కనీ పెంచి …..
కొడుకు : ఆ…పాల డబ్బా కొనీ, సీసా కడిగి..నోట్లో పెట్టీ…సెంటిమెంట్ ఒద్దమ్మా, నా వాటా డబ్బిస్తే దుబాయ్ చెక్కేస్తాం
తల్లి : ఛీ, పోరంబోకు వెధవా, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి మీ నాన్న మాట కాదని,ఓ జులాయి, రౌడీ, దొంగ వయిన నిన్ను వెనకేసుకొచ్చినందుకు మంచి బుద్ధి చెప్పావురా నాకు. ఈ వర్షం సాక్షిగా ఇదే నా ప్రతిజ్ఞ. మా ఆస్థిలో నీకు చిల్లు గిన్నె కాదు కదా సత్తు బొచ్చె కూడా రాదు. ద్రోహి, కంటే కూతుర్నే కనాలి అని బాగా బుద్ధి చెప్పావురా కొడకా. ఏవండీ, ఇక మనకెవరున్నారండీ?
తండ్రి: బాధపడకు, నీకు నేను నాకు నువ్వు ఉన్నాము.
పూర్తిగా చదవండి