కలత - నందిని సిధారెడ్డి
కవితలు September 30th, 2007
తప్పిన అడుగుల్లో
తలలు నాటుతున్నాం
కంటున్న కల పూర్తికాకుండానే
దబుక్కున మెలకువొస్తుంది
ఇక్కడేదో హార్మోనియం పెట్టె పగలినట్టు
శృతి విరిగిపోయింది
జానపదగీతం వినెతందుకు
జన్నభూమి మొరాయిస్తున్నది
ఊగిసలాటలో ఉడుకుతున్న జీవితం
చావువాసన సంతరించుకుంటున్నది
వానజల్లులు జల్లులుగా కురిసినా
మునుపటి వలె నేల పులకించటం లేదు
పాతనవి మొక్కలు కాదు
రాతికనీలు
వసంతం అడుగిడినా అవి చిగురించవు
తప్పిన దారుల్లో
కలలు వెదజల్లుతున్నాం
అష్టభుజి సందడిలో
ఉన్నభూజాలు పోతాయి
నిర్వాసితుల కన్నీళ్ళు
కంప్యూటర్ ను చెమరించలేవు
నిండు సభలో
మనిషి శిరచ్ఛేదాన్ని ఆపెతందుకు
ఎవరూ ముందుకు రారు
అందరిదీ ఒకే తల
నమ్రంగా నాలుక తిప్పటమే ఇ-కళ
దూప తీరకముందే
నది అదృశ్యం
ఎక్కక ముందే కొండ అదృశ్యం
విషాదాలు మోసెతందుకయినా
తలలుండాలె
వివేచన చేసెతందుకయినా
తలలుండాలె
ఎవల భుజాల మీద
వాళ్ళ తలలే ఉండాలె
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి