అమ్మో అమ్మో…వారమౌతోంది నేను బ్లాగి! మరీ ఇలాగైపొయినాదేటి జీవితం? )

శనివారం రాత్రి జానకి గారితో ఝుమ్మంది నాదం రెండో భాగం వచ్చింది. ఇది కూడా చాలా బాగా ఉండింది. జానకి గారి ఉత్సాహం, గలగలమంటూ నిండుగా ఆవిడ నవ్వే ఆ నవ్వు, వింటూ ఉంటే మాయ చేసి ఆవిడ పాటల లోకం తప్ప మరోలోకం లేదని నమ్మింపజేసే ఆ గాత్రం… ఇవన్నీ ఉండగా ఆ ప్రోగ్రాం బాగుండక ఎలా ఉంటుంది చెప్పండి? అయితే, మరీ ఆవిడ భర్త ని ఆవిడ ఎంతగా మిస్సవుతున్నారో… అవన్నీ చెప్పించడం కాస్త అనవసరమేమో అనిపించింది. ఓ పక్క ఆ తెర పై ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటే చూస్తున్న నా కళ్ళల్లో కూడా నీళ్ళు తిరిగాయి. అవన్నీ ఇప్పుడు గుర్తు చేయడం అవసరమా? అనిపించింది. సర్లెండీ… ఇంటర్వ్యూలు అంటే ఇక పర్సనల్, ప్రైవేట్ విషయాలు, సున్నితమైనవి… గట్రా అంతా మర్చిపోతారేమో!

ఇందులో జానకి గారు - “దండాలు సామీ” అని ఒక పాట పాడారు…. “అనితరసాధ్యము నా గాత్రము” అన్నట్లు పాడారు. నాలుగు తరాల గొంతుకల్లో పాడారు. ఓ చిన్న పిల్ల, ఒకా యువతి, కాస్త మధ్య వయసు గొంతు, ఓ ముదుసలి గొంతు…ఎక్కడా అది ఒకే మనిషి పాడింది అనిపించనీకుండా పాడారు…. పాట అవగానే అక్కడ సునీత “దండాలమ్మా మీకు” అన్నది. తెరపై చూసిన నాలాంటి వాళ్ళు ఎండరో మనసులోనే “దండాలు” చెప్పుకున్నారు. అన్నీ స్వీకరించి జానకమ్మ మాత్రం ఎప్పటిలాగే కల్మషం లేని తన నవ్వు….. చిన్న పిల్లల నవ్వంత స్వచ్చమైన నవ్వు… నవ్వారు. ఈ ప్రోగ్రాం ఎపిసోడ్ల వీడియో ఎక్కడన్నా దొరికితే, ఆ దండాలు సామీ పాట ఆడియో ఎక్కడన్నా ఉన్నట్లు తెలిస్తే, కాస్త ఇక్కడ ఓ కామెంటు రాయగలరు.

వారం రోజుల విరహం తరువాత నాకు నా వాచీ కి సెల్లేయించుకునే అదౄష్టం కలిగింది. దాన్ని చేతికి తొడుక్కోగానే, ఎంత వద్దనుకున్నా నా మొహం వెలిగింది.. నా నడక లో కాస్త ఉత్సాహం తొంగిచూసింది. )

రాత్రి నేను ఓ జెమినీ సీరియల్ ఓ పది నిముషాలు చూసా. పదినిముషాల్లోనే దాని గురించి బ్లాగేంత శ్టఫ్ ఉంది అక్కడ. మొదటగా - ఆ సీరియల్ లో ఓ ఇల్లు చూపిస్తారు. విషయమేంటంటే…ఎప్పుడూ కిటికీలు, తలుపులు అన్నీ వేసే ఉంటాయి. ఎందుకు అంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలకు సూర్యరశ్మి పడదట! ఒక్క సూర్య కిరణం తాకినా ప్రమాదమేనట. అలాంటి రోగం నిజంగా ఉందో లేదో మరి నాకు తెలీదు కానీ, ఎంత సీరియల్లోనైనా, చూట్టం కాస్త వింతగానే ఉంది… మరో వింత ఏమిటి అంటే…. వాళ్ళింటికి ముగ్గురు పనివాళ్ళు వస్తారు… వాళ్ళ పేర్లు - రేణుమతి, ఉలూపి, హస్తి. ఈ పేర్లేంటి వింతగా ఉన్నాయి అనుకుంటూ ఉంటే చెప్పారు..అవి భారతం లో పేర్లట. రేణుమతి ఏమో నకులుడి భార్య అట. ఉలూపి ఏమో అర్జునుడి మూడో భార్యట. హస్తి అన్నవాడు..ఏదో చెప్పారు…. పెద్ద రిలేషన్….గుర్తు రాడం లేదు. ( వార్నాయనో! సీరియళ్ళలో ఈ పేర్లేమిటో…. అంత రిసర్చి చేసి నకులుడి భార్యా, అర్జునుడి మూడో భార్యా అనుకుంటూ ఆ పేర్లని వెదికి పెట్టడం ఏమిటో…అనుకున్నా.

సీరియళ్ళ వాళ్ళు కూడా నావెల్టీ కోసం ప్రయత్నిస్తున్నారన్నమాట! ఈ లెక్కన త్వరలో ధర్మరాజు పెదనాన్న పినతండ్రి మనవడి మేనల్లుడి తోడల్లుడి పేరు అంటూ వచ్చే ఎపిసోడ్ లో మరో కేరెక్టరొచ్చినా ఆశ్చర్యం లేదు. ఐనా, నేను చూస్తే, ఆ షాక్ తట్టుకోలేనేమో…సో, నేను చూడను. పది నిముషాలకే వింతగా అనిపించింది నాకది.


పూర్తిగా చదవండి