Fox టీవీలో వెదర్ ఛానెల్లో ఏ పూట కా పూట ఎంతో కచ్చితంగా వాతావరణం చెప్పే రీతి చూస్తూ చూస్తూంటే, అలనాటి జ్ఞాపకాలు మెదిలాయి.

నమస్కారం, ఈనాటి ఘోరదర్శన్ ప్రసారాలకి స్వాగతం. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు.

ఉదయం 9:00 గంటలకు లకు ఉదయం ప్రసారాలు…
మధ్యాహ్నం 12:00 గంటలకు మధ్యాహ్న ప్రసారాలు…..
సాయంత్రం 5:00 గంటలకు సాయంత్రం ప్రసారాలు…..

(అబ్బో ఏం సృష్టి రహస్యం చెప్పావురా బాబూ, ఉదయం పూట ఉదయం ప్రసారాలుట,   మధ్యాహ్నం పూట మధ్యాహ్న ప్రసారాలుట, సాయంత్రం పూట సాయంత్రం ప్రసారాలుట అని తెగనవ్వుకొనే వాళ్ళం)

తర్వాత టైం పాసు చేయటానికి బొత్తిగా ప్రోగ్రాములు లేక, లలిత సంగీతం పేరుతో ముందుగా ఓ బృందగీతం అని చెప్పి ఓ పెద్ద గుంపుతో (మందగీతం) ఓ రెండు పాటలు పాడిస్తారు. అదో పెద్ద గోలగా ఉండేది.

వెంటనే ఎక్కడలేని ఆనందంతో అనౌన్సరు ప్రత్యక్షం! మరే కార్యక్రమం అనౌన్స్ చేయటానికి రాని దొంగ నవ్వు అది. (ఆ నవ్వు వెనకాల ఈ ప్రోగ్రాం దెబ్బకి చావండి కుంకల్లారా అనుకునే ఓ క్రూరమైన కసి) ఎందుకయ్యా అంటే, తమ తురుపుముక్క ప్రోగ్రాం(తొక్కప్రోగ్రాం) అయిన పాడి పంటలు కార్యక్రమం కోసం. కొన్నేళ్ళుగా చూపిస్తూనే ఉన్న అరిగిపోయిన రికార్డులు అయిన, లాభదాయకమైన పందుల పెంపకమనో, కొబ్బరి చెట్టుకు రబ్బరు తెగులో, పశువుల్లో కృత్రిమ గర్భధారణ అనో, మేకల్లో ఆకలి చావులనో … లాంటివి జనం మీద వదిలేసి చావగొట్టేవాళ్ళు. ఈటీవీ వాడొచ్చి, అన్నదాత పేరుతో అందర్నీ లాక్కెళ్ళిపోయినా అదే వరస.

తరువాత మొదలయ్యేది వాతావరణ ప్రహసనం. నోరెళ్ళ బెట్టుకొని, ఆశగా ఏదో పనికొచ్చే వాతావరణ విషయాలు చెబుతాడేమో అని ఎదురు చూసేవాడికి ఇది దక్కేది.

ఈ రోజు ఆకాశం అక్కడక్కడా మేఘావృతమై ఉంటుంది. పగలు వేడిగా, రాత్రి చల్లగా ఉంటుంది. అక్కడక్కడా ఒకటి రెండు జల్లులు పడొచ్చు. ఇంతకు మించి పెద్దగా చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు.

ఒరే బడుద్దాయ్, ఆ చెప్పుకోదగని మార్పేదో చెప్పిచావరా అని గట్టిగా అనాలనిపించినా, జనాలకి భయపడి నోర్మూసుకునే వాళ్ళం. అలా నాలుగు వాక్యాల్లో మొత్తం రాష్ట్రంలోని రైతు సోదరులందరికీ వాతావరణం చెప్పేవాళ్ళు.

ఉన్నట్టుండి, 7:00 అయ్యేటప్పటికల్లా ఏ మాత్రం హావభావాల్లేని భ్రాంతిస్వరూప్ అదే శాంతిస్వరూప్ ప్రపంచంలో ఏ మూలైనా, ఎక్కడున్నా సరే ఊడలేసుకోని దూకేవాడు వార్తలు చదవటానికి. అదేమిటో గానీ, మహానుభావుడు పెళ్ళి వార్తకీ తద్దినం వార్తకీ ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టి చదివేవాడు. ఎవరైనా ప్రముఖుడు పోయిన రోజు వార్తలు పోనీ వేరే వాడితో చదివిస్తాడేమో అనుకుంటే, ఊహూ, తానే వచ్చి చావు వార్తలో కూడా కామెడీ నింపేవాడు. ఇలానే చాలా ఏళ్ళ పాటు ఘోరదర్శన్ని దున్నుకున్నా, నాకు తెలిసి మనోడి పంటి వరస చూసిన జ్ఞాపకం లేదు.

ఇదంతా ఏదో హాస్యానికనుకున్నా కూడా, తెలిసిందేమంటే, ఈ నాటికీ మనోళ్ళ దగ్గర డాప్లర్ రాడార్ లేదుట. అందుకే ఇలా అర్థం పర్థం లేని వాతావరణం చెప్తూ ఉంటారు. అదుంటే, మనకి గంట గంటకీ వాతావరణ విషయాలు కచ్చితంగా తెలుస్తాయి. మన రైతులకి చాలా ఉపయోగం. బహుశా, ప్రయివేట్ చానెల్స్ వాళ్ళకి ఉన్నాయేమో. ఘోరదర్శన్ వాళ్ళు ఇది కొనలేకపోవటానికి డబ్బు మాత్రం కచ్చితంగా కారణం కాదనే నా విశ్వాసం.

అలానే ఈ మధ్య నుంచే ఘోరదర్శన్ ఓ ఫ్రీ చానెల్ ఇక్కడ డైరెక్ట్ టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నారు. క్వాలిటీ… రామ రామ … బ్లాక్ అండ్ వైట్ కాదూ కలర్ కాదు, అదో విచిత్రమయిన రంగులో వస్తున్నాయి ప్రోగ్రాంస్ అన్నీనూ -)


పూర్తిగా చదవండి