tandm.jpgCountry:Bhutan

Year:2004

Language:Dzonghka

Story & Direction: Khyentse Norbu

Awards: Deauville Asian Film Festival - Audience award

Asian Americal Film Festival - Emrging Director award

“మానవుని దు:ఖానికి కారణం ఉంది. కోరిక వలన దు:ఖం పుడుతోంది. దు:ఖం పోవాలంటే కోరిక నశించాలి” అని చెప్పిన బుద్ధుని బోధనలు విశ్వసిస్తున్న దేశాలలో భూటాన్ ఒకటి.

దర్శకుడు Khyentse Rinpoche ఒక పేరుపొందిన బౌద్ధ లామా. తన భూటాన్ ప్రజల జీవితాన్ని, సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాడు. మోహంలో మునిగిన ఒక కుర్రవాడి కధను(జపనీస్ కధ),ప్రాచుర్యంలో ఉన్న ఓ బౌద్ధ నీతికధను కలిపి, చక్కని సినిమా తీసాడు.

కధ

అది భూటాన్ లోని ఓ మారుమూల పల్లెటూరు. Dondup యూనివర్శిటి పట్టభద్రుడు, ఆ పల్లెలో ప్రభుత్వ అధికారిగా పనిచేస్తుంటాడు. ఎంతగా గౌరవ మర్యాదలు లభిస్తున్నప్పటికీ, అతనిలో ఏదో అసంతృప్తి, మెరుగైన జీవితం కోసం ఆరాటం. మెరుగైన జీవితం అంటే ఏమిటి?

“ఈ పల్లెలో ప్రభుత్వాధికారి ఉద్యోగం కంటే అమెరికాలో ద్రాక్ష తోటలో పని మేలు”, అనుకుంటాడు. అమెరికాలోని ఫ్రెండ్, తన వీసాకు కావలిన పనులు పూర్తిచేయాలి. స్నేహితుడి ఉత్తరం కోసం ఎదురు చూస్తూంటాడు. ఎంతకీ రాక చాలా అసహనంగా ఉంటాడు. చివరకి అతను కోరుకున్న ఉత్తరం వస్తుంది. రాజధాని Thimphu నగరంలో అపాయింట్ మెంట్ ఉంటుంది. త్వరగా అక్కడికి చేరుకోవాలి. గ్రామాధికారికి Tsechu ఉత్సవానికి వెళ్తున్నానని చెప్పి బస్టాపుకి బయలుదేరుతాడు. కొద్దిలో బస్సు మిస్సవుతాడు. నగరానికి పోయే బస్సు వారానికి ఒకసారి మాత్రమే వస్తుంది. ఇక చేసేదేమిలేక ఓ కొండ రోడ్ పై ఏదైనా లిఫ్టు దొరుకుతుందేమో అని ఎదురుచూస్తుంటాడు. అసహనం క్రమంగా పెరుగుతూ ఉంటుంది.

యాపిళ్ళ బుట్ట మోసుకుంటు ఒక ముసలి రైతు, తంబూరాతో ఓ బుద్ధ యోగి వచ్చి కలుస్తారు.

“ఎక్కడకి వెళువుతున్నావు”, యోగి ప్రశ్నిస్తాడు.

” చాలా చాలా దూరం. నా డ్రీంలేండ్ కి వెళుతున్నాను”, అని చెప్తాడు.

లిఫ్టు దొరకక ఆ రాత్రి అక్కడే మజిలీ చేస్తారు. చివరకి ఓ లారీలో కొంత దూరం లిఫ్టు దొరుకుతుంది. లారిలో ఓ తాగుబోతు ప్రయాణిస్తుంటాడు. దారిలో ఓ వ్యాపారి,అతని పడుచు కూతురు కలుస్తారు. ఆమె అందానికి Dondup ఆకర్షివుతవుతాడు.

* * *

ప్రయాణంలో కాలక్షేపానికి అందరికి యోగి ఒక కధ చెప్తాడు. అది Dondup మానసిక స్థితిని పోలియుండే కధ:

” ఓ గ్రామంలో రైతుకు ఇద్దరు కొడుకులు; తషి, కర్మ. తషి పెద్దవాడు. తండ్రి అతనిని మెజీషియన్ చేయాలని ప్రత్యేక స్కూలుకి పంపుతుంటాడు. తషికి చదువుపై ధ్యాస తక్కువ.ఎప్పుడు తన కలల్లో విహరిస్తుంటాడు. “దూరంగా ఏదో సుందర ప్రదేశం,అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు, అక్కడికి పారిపోవాలి” అని అనుకుంటుంటాడు.

~ ~ ~

తషి ఓ తెల్లని గుర్రాన్ని స్వారీ చేస్తుంటాడు. అది చాలా వేగంగా పరుగులు తీస్తూ తషిని ఓ అరణ్యంలో పడేసి మాయమవుతుంది. దారి తప్పి, గాయాల పాలైన తషికి ఓ కట్టెలు కొట్టుకునే వృద్ధుడు,అతని భార్య Deki తారసపడతారు.

Deki అందమైన పడుచు. ఆమె అందానికి తషి ఆకర్షితుడవుతాడు. అతనిలో కోరిక పడగవిప్పుతుంది. ఆమె కూడా అతనిని ఇస్టపడుతుంది. బంధం పెరుగుతుంది. Deki కి గర్భం వస్తుంది. ఈ విషయం భర్తకి తెలిస్తే చంపేస్తాడంటుంది. చివరకి తషి తన భర్తని చంపేలా ప్రోత్సహిస్తుంది. తషి కొన్ని విషపు ఆకులతో పసరు తయారుచేస్తాడు. పసరుని మద్యంలో కలిపి భర్తకిస్తుంది. వృద్ధుడు మరణిస్తాడు. తషిలో పత్యాత్తాపం మొదలవుతుంది. విరక్తితో అక్కడి నుండి పారిపోతుంటాడు. Deki అతనిని ఆగమని అరుస్తూ వెంట పరిగిడుతూ నదీ ప్రవాహంలో పడి మాయమవుతుంది. తషి వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు.

~ ~ ~

వాస్తవంలోకొచ్చిన తషి అదంతా భ్రమని, తను తాగిన మద్యం ఫలితమని, తన మనసు చేసిన గారడీగా గ్రహిస్తాడు.”

* * *

యోగి చెప్పిన కధకి Dondup ప్రాముఖ్యత ఇవ్వనట్టు నటిస్తాడు. కాని తోటి ప్రయాణికుల మంచితనం,ముఖ్యంగా వ్యాపారి కూతురి అమాయకత్వం, ఆదరణ అతనిని ఆలోచింపచేస్తుంది. ఏదో స్వల్ప ఆంతరిక మార్పు. “అందమైన మాతృదేశం,అమాయకపు పల్లెజనం,వారి ఆదరణ,ప్రేమ…” బహుశా తను ఏంకోల్పోబోతున్నాడో గ్రహిస్తాడు.

Dondup, యోగి ఓ చిన్న ట్రాక్టర్లో Thimphu నగరానికి పోతుంటారు.

“మరో కధ చెప్తాను వింటావా?” అంటాడు యోగి. Dondup నవ్వుతాడు.

“అనగనగా ఓ గ్రామంలో ఓ చదువుకున్న యువకుడు ఉన్నాడు. అతను ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని అమెరికాలో యాపిళ్ళు ఏరే పనికి బయలుదేరుతాడు. దారిలో ఓ అందమైన అమ్మాయిని కలుస్తాడు.” అని యోగి హాస్యమాడతాడు.

“ఆ యువకుడు ఆ అమ్మాయికోసం తన అమెరికా ప్రయాణాన్ని విరమించుకున్నాడు!” Dondup నవ్వుతూ అంటాడు.

ట్రాక్టర్ Thimphu నగరం వైపు పోతూ ఉంటుంది.

* * *

ప్రధాన పాత్రధారి Dondup భూటాన్ రేడియో కార్యక్రమాల నిర్మాత.

చాలామందికి ఎలాంటి సినిమా పరిజ్ఞానం,అనుభవం లేకపోయినప్పటికి,అందరూ చాలా సహజంగా నటించారు.

చిన్న చిన్న జీవిత అనుభవాలకు,కొంత కల్పన జోడించి,మంచి కధని తయారు చేసాడు దర్శకుడు. స్వతహాగా బౌద్ధ లామా అయిన ఆయనకి ఈసినిమా తీయడం ఒక దివ్య అనుభవం.

ఈ సినిమా విజయానికి కారణం, దర్శకుడు,నటులు,ఇతర టెక్నీషియన్ల ప్రతిభే కాకుండా, మరో బలమైన కారణం కూడా ఉంది.

“చాలామందికి భూటాన్ అనే దేశం ఉందనే తెలియదు. కొందరికైనా ఈసినిమా ద్వారా తెలియాలి”, అనే అంకితభావంతో అందరూ కృషిచేసారు.

ఈసినిమా కొంతవరకైనా ఆలోటును భర్తీ చేస్తుంది.

* * *

Send post as PDF to www.pdf24.org

పూర్తిగా చదవండి