ముందొక సారి సంగీతంతో .. అటుపై సాహిత్యంతో నన్నొకటికి రెండుసార్లు పల్లిటీ కొట్టించిందీ పాట.

భాగ్యనగరంలో పని చేస్తుండగా నా సహోద్యోగి బల్ల దగ్గర నిల్చుని ఏవో కాయితాలు చూస్తున్నాను. అతని కంప్యూటర్ స్పీకర్లలోంచి సన్నగా వస్తున్నదీ పాట. ముందు పాటలో అంతర్గతంగా ఉన్న బలమైన లయ నన్ను ఆకర్షించింది. నా కాయితాలు నేను చదువుకుంటూ నా ప్రమేయం లేకుండానే దానికి తల ఊపుతున్నాను. పాట ముగిశాక అతన్నడిగాను, ఏవిటది, మళ్ళీ పెట్టమని. సఖి సినిమాలోదని చెప్పి మళ్ళీ పెట్టి సౌండు పెంచాడు. ఆ పేరు విని నాకేమీ స్ఫురించలేదు. ఇప్పుడు స్పష్టంగా వినబడే కానడ రాగం వినగానే నాకర్ధమైంది .. ఇది అలై పాయుదే అని ఊతుక్కాడు వేంకట సుబ్బయ్యర్ గారి కర్ణాటక సంగీత కృతి. ఇదేవిటి మరి ఏవో తెలుగు మాటల్లా వినబడుతున్నాయే .. అదే పేరుతో మాధవన్ షాలిని జంటగా తీసిన తమిళ చిత్రంలో ఈ కర్ణాటక కృతిని యథాతథంగా ఉపయోగించారు. ఓహో, ఈ సఖి అనే సినిమా దానికి తెనుగు సేత అన్న మాట! తమిళ సినిమాలో ఉన్న కర్ణాటక కృతిని కూడా తెలుగులో అనువదించి అదే బాణీలో వాడారే .. భలే ఉందే అని కొద్దిగా ఆశ్చర్య పోయాను .. అంతే .. అంత కంటే పెద్దగా పట్టించుకోలేదు.

ఇదంతా జరిగి ఐదేళ్ళు కావస్తోంది.

మొన్నీమధ్యన మన కల్హార స్వాతికుమారి గారు ఉన్నట్టుండి నిశాంత మహీజ శకుంత మరంద మెడారి గళాన వర్షించవా అన్నారు. ఒక్కసారి తాగుతున్న టీ కొరబోయి నోరు కాల్చుకుని .. అదేంటండీ బాబూ అట్లా జడిపిస్తే ఎలాగన్నాను. అమాయకంగా మొహం పెట్టి ఏదో మీలాంటి వాళ్ళు అర్ధం చెబుతారేమో నన్న ఆశతో అన్నారు. చూడు తల్లీ, ఏదో తెలిసిన నాలుగు తెలుగు ముక్కలు చెప్పుకుని కాలం గడుపుతున్నాను, ఇలా నిలదీయటం భావ్యమా అన్నాను. దయతల్చి ఆవిడే అర్ధం చెప్పారు. నిశాంత అంటే .. రాత్రి ముగిసింది అనగా ఉషోదయ వేళ .. మహీజ .. హమ్మ్ ఇది కొంచెం కొరకరాని కొయ్యే ...(భూమికి పుట్టినది - చెట్టు - థాంక్యూ వికటకవిగారూ) .. శకుంత .. చిన్నప్పుడు చదూకోలా? శకుంత పక్షులు పెంచుట చేత ఆమెకి శకుంతల అని పేరు వచ్చెను అని .. అవొక జాతి పక్షులన్న మాట. మరందం అంటే తేనె. ఎడారి గళాన వర్షించవా అనేది నాకూ అర్ధమైంది, తెలుగేగా! అంటే .. ఓ స్వామీ, తెల్లారు ఝాఁవున ఫలానా లాంటీ తేనెని ఎడారిలాగా ఎండిపోయిన నా గొంతులో కురిపించూ అని కవిహృదయం. అరె, భలేగా రాశాడే, ఎక్కడిదీ గీతం అనడిగా .. సఖి సినిమాలో పాట, అలై పొంగెరా అని సమాధానం. నాకు బల్బు కాదు కదా, ట్యూబులైటు కూడా వెలగలా!

అప్పుడిక లాభం లేదని ఆమె పాట సాహిత్యం మొత్తం పంపారు. చదువుతున్నా .. ఎక్కడో ఏదో జ్ఞాపకాల వీచికలు కదులుతున్నాయి.
అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిశాంత మహీజ శకుంత మరంద మెడారి గళాన వర్షించవా ...
అరెరే!
తరాన ననాన బిరాన వరాల .. ఇదేదో తెలిసినట్టు ఉందే?
అలై పొంగెరా? ఓ అలై పోంగెరా .. అలై పాయుదే .. కణ్ణా .. అలై పొంగెరా కన్నా .. భలే భలే..

ఏళ్ళ తరబడి కర్ణాటక సంగీతం వినివిని ఉన్న నాకు ఈ కృతి చిరపరిచయం. ఎందరో మహానుభావుల గళాన ఈ పాట వినే భాగ్యం నాకు దక్కింది. దీని తెలుగు అవతారం ఇలా తమాషాగా సాక్షాత్కరించడమే నాకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.

ఊతుక్కాడు వేంకట సుబ్బయ్యర్ త్యాగరాజ స్వామికి ముందటి వాడు. ఆయన జీవితాన్ని గురించి మనకి ఎక్కువ తెలీదు గానీ బాహ్య ప్రపంచాన్ని మరచి సదా బాలకృష్ణ ధ్యానంలో కృష్ణ లీలల్ని గానం చేస్తుండేవారని ప్రతీతి. ఆయన కృతులు అద్భుతమైన లయ విన్యాసంతో నిజంగా బాలకృష్ణుడే నర్తిస్తున్నట్టు ఉంటాయి. ఆ గతి కూడా తిన్నగా ఉండదు, పసి పిల్లవాడి చిందుల్లాగే ప్రతి రెండు వాక్యాలకీ గతి మారి పోతుంటుంది. ఇహ వాటిలోని లిరికల్ బ్యూటీని చెప్పటానికి నా తమిళ జ్ఞానం చాలదు. అన్నట్టు మార్నింగ్ రాగా అనే తెలింగ్లీషు సినిమాలో షబనా అజ్మీ పాత్ర చివరకి తోడి రాగంలో పాడే పాట తాయే యశోద ఉందన్ ఆయర్ కులత్తు దిత్తన్ కూడా వీరి కృతే.

మొత్తానికి ఈ నిశాంత మహీజ నన్నొక ఊపు ఊపి వొదిలి పెట్టింది. ఏవిట్రా దీనిలో ఉన్న పస అని పట్టి చూశా .. మీరూ గమనించండి, ఒక్క నిమిషం మాటల్ని మరిచి పోయి .
లలాల లలాల లలాల లలాల - IUI అనే వరుస పదే పదే పునరావృతమవుతోంది.
దీన్ని ఛందస్సులో జ - గణం అంటారు. జ గణంతో జగడం కోరగా తగదు అన్నాడూ శ్రీశ్రీ సిరిసిరిమువ్వ పద్యాల్లో. అది సరే .. ఒకటే జ గణం ఇన్ని సార్లు రెపీటవడమెందుకూ?
పదండి, మా నిఘంటువు చూద్దాం .. కవిరాజ విరాజితము .. ఈ పద్యమునందు ప్రతి పాదమునను ముందు ఒక న గణమును, దాని పిదుప ఆరు (ఏకంగా ఆరే!) జ గణములును, అంత్యమున ఒక వ గణమును ఉండ వలయును. ఈ నిఘంటువు రాసిన మహానుభావుడు ఉదాహరణ ఇవ్వలేదు. ఇవ్వక పోతే మన సొంత తెలివి లేదా? డవిరెక్టుగా .. తెలుగు లెస్స అన్న తెలుగు వల్లభుడు శ్రీకృష్ణదేవరాయలవారి ఆముక్త మాల్యద నించే ఎగ్జాంపిలు తెచ్చి దాఖలు చేస్తున్నా ..

క.వి. జయ జయ చంద్ర దినేంద్ర శతాయుతసాంద్ర శరీర మహా ప్రసరా ..
ఓయబ్బో, ఇంతదానికి సాహితీసమరాంగణ సార్వభౌమ అని బిరుదొకటి, ఇంతకన్న మా వేటూరే గొప్పగా రాశాడులే పోవయ్యా.

చూడండి మళ్ళొక్కసారి .. అసలు ఎంత ముద్దొస్తున్నదో .. లేచి ఆ లయలో లీనమై చిందెయ్యాలనిపించటంలేదూ?
అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిశాంత మహీజ శకుంతమరంద మెడారి గళాన వర్షించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిల్లు బిగించవా
సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిల్లు బిగించవా
కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా
చిగురు సొగసులను కలిరుటాకులకు రవికిరణాలె రచించవా
కవిత మదిని రగిలి ఆవేదనా
ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలి ఆవేదనా
ఇతర భామలకు లేని వేదనో
ఇది తగునో యెద తగవో ఇది ధర్మం అవునో
ఇది తగునో యెద తగవో ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు
మధుర గాయమిది గేయము పలుకగా
అలై పొంగెరా కన్నామానసమలై పొంగెరా
నీ ఆనంద మోహన వేణుగానమున .. ఆలాపనే .. కన్నా.. కన్నా..

ఆ మహా వాగ్గేయకారునికి దీటైన ప్రతి సృష్టి తెలుగులో చేసిన వేటూరికి జోహార్లు!
ఈ అద్భుతమైన కవిత్వాన్ని నాకు చూపించిన స్వాతి కి స్నేహపూర్వక కృతజ్ఞతాంజలులు!!
*** *** *** *** *** ***
కొసమెరుపు - పాట గురించి నా పైత్యంతా తీరిగ్గా చదివాక అసలు పాట వినకుండ ఎలా?
తమిళం లో
తెలుగు లో
తమిళం పాట ఒకబ్బాయి నోట
పూర్తిగా చదవండి