"దురదృష్టవశాత్తూ అంబేడ్కర్ రాజ్యాంగం ఇలా రాశాడు కాబట్టి గానీ..."అంటూ రాజమండ్రి లోక్‌సభా సభ్యుడు శ్రీ ఉండవల్లి అరుణ్‌కుమార్(కాంగ్రెస్)ఏదో అన్నాడని కొందరు రచ్చచేస్తున్నారు."ఆ ఎంపీని చంపాలి"అనడం తప్ప ఇంక అన్నిరకాల శిక్షలూ సూచిస్తున్నారు.ఇప్పటికే అతని దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.గోలగోలగా రకరకాల నిలదీతలు(demands) .

అతని మీద అభియోగం (case) మోపాలి.

అతన్ని అనర్హుడుగా ప్రకటించాలి.

అతను అంబేడ్కర్ (విగ్రహం) పాదాల మీద పడి క్షమాపణ వేడుకోవాలి.

అతన్ని వెలివెయ్యాలి...గట్రా...గట్రా !!

ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్కరూ నచ్చాలనే నియమమేమీ లేదు.ఆ నచ్చేవాళ్ళల్లో కూడా అన్నీ నచ్చాలనే నియమం కూడా ఏమీ లేదు.నాకు మహాత్మాగాంధీ అంటే ఇష్టం.కాని ఆ మహాత్ముడిలో కూడా అన్నీ ఇష్టం లేదు.

అంబేడ్కర్‌ని కొంతమంది దేవుడితో సమానంగా చూస్తూ ఉండొచ్చు.అది వాళ్ళ ఇష్టం.అందుకు విరుద్ధంగా మఱికొంతమంది దృష్టిలో అంబేడ్కర్ దెయ్యంతో సమానం కావచ్చు.అది కూడా వాళ్ళ ఇష్టం.ఆ విధంగా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ సొంత ఇష్టానిష్టాల్ని ఏర్పఱచుకునే హక్కుంది.ఆ యిష్టానిష్టాల్ని బయటికి వ్యక్తం చేసే హక్కు కూడా ఉంది.ఇలాంటి హక్కులు అంబేడ్కరుకీ ఆయన యొక్క వీరాభిమానులకీ మాత్రమే కాదు, అందరికీ ఉన్నాయి.ఇవి ప్రపంచమంతటా మానవజాతి గుర్తించిన మానవహక్కులు.

ఈ హక్కులే గనక లేకపోతే అంబేడ్కర్ "రిడిల్స్ ఆఫ్ రామాయణ"(Riddles of Ramayana) అని రామాయణాన్ని అపహాస్యం చేస్తూ రాతలు రాయగలిగేవాడా ? ఈ హక్కులే గనక లేకపోతే ఆయన హిందువుల మీదా ప్రత్యేకించి బ్రాహ్మణుల మీదా విషం కక్కగలిగే వాడా ? అంబేడ్కరుకి ఇతరుల మీద ఉన్న హక్కులు, ఆ యితరులకు అంబేడ్కరు మీద మాత్రం ఉండకూడదంటే ఎలా ? రాళ్ళు రువ్వేముందు రాళ్ళు రువ్వించుకోవడానిక్కూడా సిద్ధంగా ఉండాలి.

దళితులు విలనైజ్ చేసిన మనువు బ్రాహ్మణ పక్షపాతి అయితే వాళ్ళు లయనైజ్ చేస్తున్న అంబేడ్కర్ దళిత పక్షపాతి.ఏమిటి తేడా కులతత్త్వంలో ? ఈనాడు ఈ అంబేడ్కర్ ఈ దళితుల్ని అక్కున జేర్చుకోవడానికి ఏ కారణాలైతే చూపిస్తున్నారో ఆ మనువు ఆనాడు ఆ బ్రాహ్మణుల్ని అక్కున జేర్చుకోవడానిక్కూడా సరిగ్గా అవే కారణాలు ఉండి ఉండొచ్చు.ఆ కాలంలో బ్రాహ్మణులు కూడా ఒక దళితవర్గమై ఉండొచ్చు.తరువాత వాళ్ళే ఒక అగ్రకులంగా మారి ఉండొచ్చు.అయిదువేల యేళ్ళ కాలప్రవాహంలో మనకు ఆ విషయాలు అంత విశదంగా తెలిసే అవకాశం లేదు.ఒక క్రీడ (game) స్వాభావికంగా అమానుషమైనదని అనుకున్నప్పుడు దాని నియమాల్ని (rules of the game) కొద్దిగా మార్చి అదే క్రీడని ఇంకా అలాగే ఆడుతూనే ఉండాలని ఆశించడం అభ్యుదయవాదం కాదు.అది కొత్త సీసాలో పాత సారా పొయ్యడంలాంటి బహిరంగ వంచనాశిల్పం.దాని స్థపతులు ఆరాధనీయులు కారు.ఆ రకంగా మనువాదం అనేది కొన్నివర్గాల దృష్టిలో బూతుమాటైతే అంబేడ్కరిజం కూడా మరికొన్నివర్గాల దృష్టిలో అంతే బూతుమాట.ఇందులో తప్పొప్పులు నిర్ణయించే సామర్థ్యం ఎవరికుంది ?

"క" కులస్థుడు "గ" కులస్థుడికి దేవుడు కానప్పుడు "గ" కులస్థుడు "క" కులస్థుడికి మాత్రం ఎందుకు దేవుడవ్వాలి ? ఏ ప్రాతిపదిక మీద ? "గ" ఆరాధ్యదైవాన్ని "క" కూడా ఆరాధ్యదైవంగా భావించకపోతే చంపుతావా ? వెలేస్తావా ? ఇవేనా నువ్వు గొప్పలు చెబుతున్న మహోన్నత రాజ్యాంగ విలువలు ?

రాజ్యాంగం రాసినవాళ్ళల్లో అంబేడ్కరు కూడా ఒకడు గాని ఆయనొక్కడే తోటలో కూర్చుని ఆశువుగా దాన్ని రాయలేదు.రాజ్యాంగసభ అనేదొకటుండేది.ఆయనొక్కడే ఏకైక రాజ్యాంగనిర్మాత కాడు.మహాత్మాగాంధి వల్లనే స్వాతంత్ర్యం వచ్చిందనడంలో ఎంత నిజముందో రాజ్యాంగాన్ని అంబేడ్కరే ఒక్కచేతి మీదుగా రాశాడనడంలోనూ అంతే నిజముంది.

ఎవరికైనా దేవుడనో దేవత అనో పేరుపెట్టకుండా గౌరవించలేకపోవడం మన భారతీయ మనస్తత్త్వంలో అనాదిగా పాతుకుపోయిన బలహీనత.వ్యక్తిత్వపరంగా అనేక అవకరాలు గల మామూలు మనుషుల్ని దేవుళ్ళుగా పేర్కొనడం ద్వారా దేవుణ్ణి కించపఱుస్తున్నామనే స్పృహ ఇలాంటివాళ్ళకు ఏ కోశానా ఉండదు.ఎన్ని చేసినా ఏ మనిషీ దేవుడు కాడు.దేవుడికి సాటి ముమ్మాటికీ దేవుడే.మనుషుల్లో దేవుణ్ణి చూసే ప్రయత్నంలో అనవసరంగా అల్పమానవుల అహంకారాన్ని వృద్ధిచెయ్యడమే కాక తఱచుగా నిరాశకు లోనవుతున్నాం.అసలైన దేవుణ్ణి మిస్సవుతున్నాం.కనుక ఇకనుంచి మనుషుల్ని మనుషులుగానే చూద్దాం.వారి యొక్క యావత్తు బలాలూ బలహీనతలతో సహా వారిని స్వీకరిద్దాం.


పూర్తిగా చదవండి