పెదవిపై మాట రానివ్వక, మనసుతో పలకరించావు
మాంఛి కాఫీతో కమ్మని ఊసులు కలిపి అమితానందానిచావు

అద్భుతం, అత్యాద్బుతం అన్న విశేషణాలను మరిపించావు
సిన్ని సిన్ని పదాలలో సిత్రాలెన్నో చూపావు

జగతినే గోరు ముద్దలుగా చేసి తినిపించావు
చిలకలా విన్నదే పలికితే "మహా గట్టి బుర్ర నీది" అని మురిసావు

నేను మాట్లాడితే కర్ణ ఘోష అని ఏడిపించావు
నా మౌనాన్ని క్షణకాలంలో తిరస్కరించావు

అలిగానని బుజ్జగించడానికి "థ్రిల్లర్" కథ వినిపించావు
కోపాన్ని భయం పూర్తిగా ఆవహించేవరకు చంపావు

నేను కింద పడితే "నేలకేమయ్యిందా??" అని ఆత్రుత పడ్డావు
"బాధకు అట్టే సపర్యలు చేయక!!" అని తల నిమిరావు

నా ప్రతీ విజయాన్ని నువ్వు గర్వించావు
నీ గెలుపులన్నింటికీ నన్ను ప్రత్యక్ష సాక్షిగా నిలిపావు

ప్రపంచానికి నువ్వు హాయిగా గలగలమంటూ పారే సెలయేరుగా కనిపించావు
మరి నాకో?? ఎంతో అలజడిని దాచుకున్న సముద్రుడిలా అనిపించావు

స్నేహపు జడిలో తడిచి ముద్దై మురిసిపోతున్న వేళ నువ్వు తారసపడ్డావు
మిత్రునివా?? ఆప్తునివా?? ఆరాధ్యునివా?? అంటే ఏమి చెప్పగలను??
జాలువారింది "స్వాతి చినుకు" అని....
తనువుపై కాక దాన్ని గొంతు గుండెల్లో దాచుకోవాలనే ఆరాటం తప్ప !!

****************************************************************
జీవితంలో కొన్ని పరిచయాలను వర్గీకరించలేము. అవి పంచే అనుభూతులు, అనుభవాలు ఏ ఒక్క బంధానికో సంభందించినవి కావు. ఆగని కాలపు అలలో సైతం నిలిచిపోయే మైత్రీ గుర్తులకు ఇదే నా హృదయాంజలి.
పూర్తిగా చదవండి