పదో తరగతిలో మాకు చరిత్ర మొత్తం "భారత స్వతంత్ర" పోరాటం గురించే పాఠాలు. ఎంతో ఆసక్తిగా ఉండేది చరిత్రంటే నాకు. చదివి ఊరుకునేది లేదు, దానిగురించి సమగ్ర చర్చలు జరిపేవాళ్ళం నేను నా మిత్రులు. అలా ఒకనాడు "గాంధీ వళ్ళ మనకు స్వాతంత్ర్యం రాలేదు. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధంలో దారుణంగా నష్టపోయిన బ్రిటీషువాళ్ళు ఇంత సామ్రాజ్యాని పరిపాలించలేమేమో అన్న భయంతో కొంత, కొల్లగట్టడానికి భారత్ దగ్గర ఏమీ లేకపోవటం వల్ల మనకు స్వరాజ్యం వచ్చింది" అని ఒక అమ్మాయి అంది. ఆ వాదంలో నాకు ఏ మాత్రం నిజం కనిపించలేదు. అసలైతే నేను ఎందుకు ఒప్పుకోవటంలేదో చెప్పే దానను. కానీ ఆవేళ ఆ అమ్మాయి మీద భరించరాని కోపం వచ్చింది. "గాంధీ మహాత్మున్నే ప్రశ్నించే" తనతో ప్రతివాదన అనవసరమనిపించింది. జాతిపితను గౌరవించలేని తనను చూసి "అయ్యో!!" అనుకున్నా. ౩౦ కోట్ల భారతీయులను ఒక్క తాటిపై నిలబెట్టిన అవతారపురుషునిపైనా ఈ నెపం అని మధనపడ్డా!!


ఇంజనీరీంగు చేస్తున్న సమయంలో గాంధీజీ ఆత్మకథ "My experiments with Truth" చదివా. చదివే కొద్దీ గాంధీ మహాత్ముడన్న భావన సన్నగిల్లుతుందో, బలపడుతుందో అర్ధం కాలేదు. అవతారమూర్తి కాదని తెలిసింది. మనలా మామూలు మనిషే, నమ్ముకున్న సిద్ధాంతలను ఆమరణం చిత్తసుద్ధితో పాటించారు కాబట్టి, మహాత్మునిగా ఎదిగారు. నిజమేనేమో.. కేవలం అహింసావాదంతో మనకు స్వేఛ్చరాలేదేమో.. ఇంకా ఎన్నో త్యాగాలఫలం అది. ఎవరి దారీ తప్పు అనటానికి లేదు, ఎవరి సేవను విస్మరించడానికి లేదు. గాంధీ విధివిధానలను ఎవరైనా వ్యతిరేకిస్తే ఇప్పుడు ఆశక్తిగా వింటా.. వింటే పాపం అనే భ్రమపోయింది. ప్రశ్నించడం తప్పు కాదు, సరైన సమాధానం ఇవ్వక అసలు ప్రశ్నించడమే తప్పు అనడం అసమంజసంగా అని అవగతమైంది.


ప్రశ్న ఓ వింత ప్రహసనం. ప్రశ్నలేనిదే మానవ మనుగడే ప్రశ్నార్ధకం, ప్రశ్న అడగలేనప్పుడు ఎంత అస్సహాయతో!! ప్రశ్నకు జవాబు రానప్పుడు ఎంత నిరుత్సాహామో!! "అది ఏమిటి?", "దీన్ని ఏమంటారు??" అన్న అమాయక ప్రశ్నలతో మొదలయ్యే జీవన ప్రయాణం, "నేను ఎవరు?" అన్న ప్రశ్నకు జవాబు కోసం అన్వేషిస్తుంది. ఆద్యంతాలకు నడుమ ఇంకెన్నో ప్రశ్నావళికి జవాబులు వెతకడమే జీవితం. ఇంత ముఖ్యమైన పాత్ర పోషించే ప్రశ్నకు ఏమి అడ్డంకులు ఉన్నవన్న ప్రశ్నే.. నన్ను నిలువనివ్వడంలేదు. "దేవుడే ఇవ్వన్నీ చేయమన్నాడా??" అంటూ నైవేద్యాలవంక చూపిస్తే లెంపలు వేసుకోమంటుంది. సినిమాలో సెన్స్ ఉందా అంటే ఫాన్స్ కి కోపం. రాముడున్నాడా అసలు అంటే మమల్ని అగౌరవిస్తున్నారు అంటారు. ఎక్కువ ప్రశ్నలు వేసే విద్యార్ది అంటే టీచరుకు మింగుడుపడదు. సీత స్థానంలో నువ్వుంటే రామున్ని ఇష్టపడేదానివా అనేది ఊహాజనితమైనా మనం ఆదరించలేము. కొన్ని ప్రశ్నలను ఎందుకు దాటవేస్తాము? ఎందుకు వాటిని ప్రశ్నలుగా భరించలేము? సమాధానం ఇవ్వకుండా ఎవేవో కారణాలు చెప్పి మనల్ని మనం సమాధానపరుచుకుంటాము? ప్రశ్నను అర్ధంచేసుకోకుండా.. అడిగినవాళ్ళను బద్ధ శత్రువులుగా భావిస్తారు.

"నువ్వు ఉన్నావా అసలు?" అని అడిగితే నిజంగా దేవుడుంటే ఆ ప్రశ్నకు ఆనందించాలి, తననే ప్రశ్నించే ధైర్యం, మేధస్సు ఉన్నందుకు సంతసించాలి గాని, నన్నే ప్రశ్నిస్తావా అంటూ శపించకూడదు కదా?? వీరిని ప్రశ్నించరాదు, ఇవ్వన్నీ ప్రశ్నలకు అతీతం అంటూ ఒక విభజన ఉందా?? మనకు నచ్చనవ్వన్నీ వ్యర్ధప్రశ్నలే అంటే మన పయనం కష్టమవదూ??


పూర్తిగా చదవండి