నా ఉగాది అనుభవాలు (క్లయింటు తో) !
Telugu April 8th, 2008ఉగాది పచ్చడి లో ఏ రుచి మొదటగా తగిలితే, ఆ సంవత్సరమంతా అలానే వుంటుంది అని మన పెద్దల ఉవాచ. నాకు మాత్రం ఉగాది పచ్చడి తినకుండానే ఈ సంవత్సరం ఎలా వుండబోతుందో తెలుస్తా వుంది, ఇప్పుడే.
ఆఫీసు పని రీత్యా ఓ నెల క్రితమే ఈ యెమెన్ దేశానికి రావలసి వచ్చింది. మామూలుగా మృదులాంత్రం లో పని చేసే వాళ్ళు యే అమెరికా నో జర్మనీ నో తిరుగుతుంటారనుకుంటా. ఐతే మా ముదనష్టపు కంపనీకి, సూడాన్, కెన్యా, నైజీరియా, మారిటానియా వంటి విపరీతమైన అభివృద్ది చెందిన దేశాల లోనే బిగినెస్సు.
(కష్టము + కష్టము = అష్టకష్టము
కష్టము + నష్టము = ముదనష్టము...అని ఓ పాత సినిమాలో డవిలాగు.)
ఇక్కడ మా క్లయింటు ని చూసినప్పుడల్లా ఈ పాట వినిపిస్తుంది బాక్ గ్రవుండ్ లో.
" అగ్ని స్ఖలన సందగ్ధ రిపు వర్గ ప్రళయ రథ చత్రపతి
మధ్యందిన సముద్యుత్కిరణ ......."
(మిగతాది గుర్తు లేదు)
వీడికి అరబిక్, ఇంగ్లీషు భాషల్లో నచ్చని యేకైక పదం 'తృప్తి '.
నిజానికి మా ప్రాజెక్టు ముగింపు 4 వతేదీ. తిరుగు ప్రయాణం 6, సరిగ్గా పండగ 7 కి ఇంట్లో వుండచ్చు అని మా ఆలోచన. అంతా అనుకున్నట్లే జరిగింది.
ఏప్రిల్ 2 వతేదీ రాత్రి.
ఆ రోజు వాడన్నాడు. "మీ ప్రాజెక్టు ని తీవ్రంగా పరిశీలించిన మీదట మీకు అప్రూవల్ రేపే ఇచ్చేద్దామని అనుకుంటున్నాను" అని.
ఆ రోజు పగలు బాగా నిద్రపోయాము.
ఇక్కడ రాత్రి పని,పగలు నిద్ర,సాయంత్రం స్నానం.
అదే ఇక్కడ వాళ్ళయితే...
రాత్రి పని, పగలు నిద్ర, మధ్యాహ్నం తిండి, శుక్రవారం స్నానం.
అలానే కాలకృత్యాలలో కూడా కాసింత తేడా.
లేవగానే "ఈ మైల్ " తర్వాత ఇరానీ టీ, తరువాత మన కాలకృత్యాలు.
3 వతేదీ ఉదయం 10:00 గంటలు. ఎందుకో తొందరగా లేవాలనిపించి, లేచి, ఈ మైల్ చూసుకున్నా. ఓ భయంకరమైన ఈ మైల్. దాని సారాంశం ఇది.
" ఇందు మూలంగా తెలియజేయడమేమనగా, మీ ప్రాజెక్ట్ ముగించి, మీరు టెస్టింగు కి గాను ఇచ్చిన ప్రాడక్టు నమూనాలలో 9 బొక్కలు గుర్తించబడినవి. ఇందులో 3 బొక్కలు అతి దారుణమైనవి గా గుర్తించాము. అందువలన మీరీ బొక్కలను పూడ్చని యెడల మీకు అప్రూవల్ ఇవ్వబడదు. "
విధి బలీయమైనది. తానొకటి తలుస్తే క్లయింటొకటి తలిచాడు.
ఆ తర్వాత కాసేపటికి మా డామేజరు దగ్గర నుండీ ఫోను, గద్గద కంఠం తో అడిగాడు "ఇది ఎలా జరిగింది " అని.
మాకు మాత్రమేం తెలుసు ??
సరే, ఇంక ఇక్కడ పని మొత్తం ముగిసే వరకూ మేము ఈ దేశం లోనే పడుండవలసిందని ఆర్డరు జారీ చేయబడింది.
ఈ నేపథ్యం లో 7వ తేదీ సర్వ ధారి నామ సంవత్సర ఉగాది వచ్చింది. కనీసం ఉగాది రోజైనా పగలు ఒంటి గంటకు లేచి సాయంత్రానికల్లా స్నానం చేసి కొద్దిగ మృదులాంత్రం లో గూగిలించి పంచాంగ శ్రవణం చేయండీ అని మా ఆవిడ కోరింది.
నేనావిడకు సర్ది చెప్పాను. క్లయింటు దగ్గర పని చేసేప్పుడు "మధ్యాహ్నం 3 గంటలకు నిద్ర లేచినా దోషం లేదు. అలానే ఇంటర్నెట్ లో పంచాంగ శ్రవణం చేయడం మహా పాపం. కేవలం పుస్తకం లో చదివే చేయాల్సిన పని ఇది " అని.
7 వతేదీ సాయంత్రం దాదాపు 4,4:30 గంటలకు బయట మసీదు లో అల్లా ప్రార్థనలకు మెలకువ వచ్చింది.
విసుక్కుంటూ లేచాను, "ఇంత పొద్దునే యేంటీ గోల " అని.
తర్వాత కాసేపటికి క్లయింటు దగ్గర నుండీ ఫోను. మీకు అప్రూవలు ఎప్పుడు ఇవ్వాలి అని.
తలంతా గిర్రున తిరుగుతున్నట్లనిపించింది.
జరిగిందిదీ.
2 రోజుల క్రితం రాత్రి మా క్లయింటు బొక్కలను ఎత్తి చూపగానే నేనూ, మా టీం (టీం అంటే ఓ పది మంది అనుకునేరు., నేను ఇంకొకతను , ఇంకో టెస్టరు అంతే) తో కలిసి వీరావేశం తో టెస్ట్ చేసి, వెంట వెంటనే మూడు పెద్ద బొక్కల్లో ఒక్క దాన్ని పూడ్చేసేము. 6 చిన్న బొక్కల్లో మూడిటిని పూడ్చగానే, మిగిలిన బొక్కలూ పూడి పొయాయి. ఇక మిగిలిన 2 బొక్కలు, మాకు బొక్కల్లా అనిపించలేదు. ఈ విషయాలన్నీ పూస గుచ్చినట్టు ఈ మైల్ రాసి సమాధనం కోసం ఎదురు చూస్తున్నాం.
వెనుక బాక్ గ్రవుండ్ లో మా డామేజరు, క్లయింటు కంపనీ తో చర్చలు జరిపి, మల్ల గుల్లాలు పడి ఎలానో చెప్పగలిగాడు, పని ముగిసింది, అని.
ఐతే తృప్తి లేని క్లయింటు మాత్రం మొండి గా కూర్చున్నాడు ఒప్పనని. వాడిని వాడి బాసు తిట్టేడట, " పని ముగిసింది కదా , వీళ్ళని ఇక్కడ పెట్టుకుంటే, మనకూ నష్టమే, పంపించేసేయ్, వెధవది" అని.
వాడికి మా మీద పీకల వరకూ కోపం.
ఇక్కడ మా వీసా ముగిసింది 8 వతేదీకి. ఐతే మేమిక్కడ ఇంకా వుండాలి కాబట్టి, మా పాస్పోర్ట్ లు తీసుకుని, మళ్ళీ ప్రాసెస్ చేయడానికి వెళ్ళాడు వాడు. మా మీద కోపం తో, మా వీసాలను కాలరాస్తాడెమో అన్న భయం, అప్రూవల్ కు ఇంకా ఏమి లిటిగేషన్లు పెడతాడో ఏమో అని భయం భయం తో వున్నామిక్కడ, నేనూ మా మిత్రులం. (రవి, శశి, పృథ్వి మా పేర్లు).
రవి అస్తమించని రాజ్యం బ్రిటిష్ రాజ్యం (అట).
రవి, శశి, పృథ్వి (సూర్యుడు, చంద్రుడు, భూమి) ముగ్గురినీ అస్తమింపచేయని (నిద్ర లేకుండా చేసే) రాజ్యం యెమెన్ యేమో మరి.
పండుగ రోజు కూడలి లో తిరుగుతుంటే, జ్యోతి గారి పంచాంగ శ్రవణం కనిపించింది. అలానే వాళ్ళ ఇంటి పిండి వంటలూ, తోరణాలు అవీ. పండుగ వాటితో, జరుపుకున్నాం. ఆవిడకి ధన్యవాదాలు కూడా చెప్పాను.
సంవత్సరం మొదట్రోజు ఎలా జరిగితే, మిగిలిన రోజులన్నీ అలానే వుంటాయి అని నానుడి. నేనివన్నీ నమ్మననుకోండి (ప్రస్తుతానికి ఇలా కంటిన్యూ అయిపోతున్నా) .
నాకు ఏ యన్నారు అంతగా నచ్చడు, కానీ నిన్న రాత్రి (సారీ, ఈ రోజు పగలు) పడుకోబోయే ముందు ఓ పాత ఏయన్నారు పాట ఎందుకో పదే పదే గుర్తొచ్చింది.
" అనుకున్నామని జరగవు అన్నీ.
అనుకోలేదని ఆగవు కొన్ని.
జరిగేవన్నీ మంచికనీ,
అనుకోవడమే మనిషి పని....
నీ సుఖమే నే కోరుకున్నా..."
పూర్తిగా చదవండి