ఆమె చనిపోయిన విషయం గుర్తొచ్చి రామభద్రానికి తానిప్పుడు చూస్తున్నది భోజేశ్వరి ప్రేతాత్మనన్న విషయం స్పష్టంగా ఆకళింపైపోయింది. భయంతో కళ్ళు పెద్దవిచేసుకుని నోరు తెఱుచుకుని నిశ్చేష్టుడై ఆమెవంక చూస్తున్నాడు. "ఎందుకు భద్రం భయపడుతున్నావ్ ?" అని భోజేశ్వరి నవ్వుతూ గాలిలో కలిసిపోయి అంతర్ధానమైంది. అంతే ! పెరుగూ విరుగూ అన్నీ మర్చిపోయి రామభద్రం ఇంటికేసి పరుగో పరుగు. ఇంట్లోకి రాకముందే మెట్లదగ్గరే పడిపోయాడు. అసలు తాను ఇంటికెలా చేరుకున్నాడో తనకే తెలియదు. అందరూ ఆందోళనతో అతన్ని లేవదీసి లోపలికి మోసుకెళ్ళారు. ఎలా వచ్చిందో గాని అప్పటికప్పుడు 102 డిగ్రీల మాయదారి జ్వరం, రామభద్రం మూసిన కన్ను తెఱవకుండా మూడ్రోజులు పడుకున్నాడు.

ఒంట్లో కాస్త కులాసా చిక్కింతర్వాత తాను చూసినది ఉన్నదున్నట్లు చెబితే ఎవ్వరూ నమ్మలేదు. వాళ్ళ నాన్న అప్పారావు చాలా సంవత్సరాల్నుంచీ నైట్ డ్యూటీలకెళుతున్నాడు. ఆయనకెప్పుడూ ఏ దెయ్యాలూ ఎదురుకాలేదు. అందుకని ఆయన కలాంటి నమ్మకాలేమీ లేవు. "పిఱికి నా కొడకా ! ఏదో చూసి ఏదో అనుకుని బాగా జడుసుకున్నావులే గాని, ఇంక నోర్ముయ్యెహె !"అని కసిరాడు. తండ్రికి తగ్గ కొడుగ్గా రామభద్రానికీ పెద్దగా నమ్మకాల్లేవు. కాని తాను భోజేశ్వరి ప్రేతాత్మని చూసింది నిజమనీ, అందులో అబద్ధమేమీ లేదనీ, తానేమీ భ్రమపడలేదనీ అతను పలుమార్లు నొక్కివక్కాణించేవాడు. ఆమె ఇతనికెందుకు కనిపించిందో తెలియదు. ఏదేమైనా భోజేశ్వరి మరణానంతరం అతనిక్కనిపించడం అదే మొదటిసారి, అదే చివరిసారి కూడా !

జీవి శరీరంలో ఒక మెదడుందని మనమందరం అనుకుంటాం. వాస్తవానికి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క మెదడుంది. ఆ మెదళ్ళన్నీ ఒక కేంద్ర మెదటికి లోబడి పనిచెయ్యడం వేఱే విషయం. తద్ద్వారా కేంద్రమెదటికి (పరమాత్మస్వరూపమైన) జీవాత్మ అధిష్ఠానమైనట్లే ఆయా చిఱుమెదళ్ళక్కూడా వేఱువేఱు అధిష్ఠానదేవతలున్నారు. ఉదాహరణకు చేతులకు ఇంద్రతేజస్సు అధిష్ఠానదేవత. కుడిచెవికి పవిత్రనదులు అధిష్ఠానదేవతలు. మర్మాంగానికి ప్రజాపతులు అధిష్ఠానదేవతలు. వృషణాలకు పితృదేవతలు అధిష్ఠానం. ఆయా అధిష్ఠానదేవతలు ఆయా అవయవాల్లో నిత్యనివాసం చేస్తారు. వాళ్ళు మనిషి పుట్టకముందే దైవాదేశం మేఱకు అతని/ఆమె అవయవాల్లో తిష్ఠవేస్తారు. వాళ్ళని భౌతికశరీరంలో కాక అందులో ఉన్న సూక్ష్మశరీరంలో మాత్రమే దర్శించగలుగుతాం. ఆ కారణం చేతనే "దేహో దేవాలయ: ప్రోక్తో జీవో దేవస్సనాతన:" (ఈ దేహమే పవిత్రమైన దేవాలయం. ఇందులో నివసించే జీవుడే నిత్యుడూ, సత్యుడూ అయిన సనాతన భగవంతుడు) అని మన పూర్వీకులు మొత్తుకున్నది. అలాగే చావు సమీపించినప్పుడు దైవాదేశం మేఱకు ఆయా దేవతలు (జీవశక్తులు) తమంతట తాముగా శరీరాన్ని విడిచి వెళతారు. కాని వారు మృతశరీరంలోని పంచభూతాల్లాగా చెల్లాచెదఱు అవ్వరు. వారు సూక్ష్మశరీరాన్ని లోకాంతరాలకూ జన్మాంతరాలకూ తరలిస్తారు. దాన్తో పాటే ఉంటారు. అవి గతజన్మలకు చెందిన పాత కర్మఫలాల యొక్కా, జ్ఞాపకాల యొక్కా దస్తావేజుల్ని జన్మనుంచి జన్మాంతరానికి మోసుకెళతారు.

నిజానికి జన్మలెత్తేది ఆత్మ కాదు, సూక్ష్మశరీరమే. మనుషులు మేల్కొన్న స్థితిలో "నేను, నాది" అని వ్యవహరించేది కూడా దాన్నే. జనం దాన్ని ఆత్మ అని వ్యవహరించడం కేవలం భ్రమప్రమాదజనితం. శుద్ధపొఱపాటు మాత్రమే. ఆత్మస్థితిలో "నేను, నాది" ఉండవు. ఆత్మకు జన్మలూ, చావులూ, సుఖదు:ఖాలూ, ధర్మాధర్మాలూ, పాపపుణ్యాలూ, శుభాశుభాలూ, దేశకాలాలూ ఏమీ లేవు. అది ఒక దేహానికీ, ఒక మతానికీ, ఒక లోకానికీ పరిమితం కాదు. జీవులూ-జడాలూ, కుర్చీలూ-బల్లలూ, రాయీ-రప్పా, చెట్టూ-పుట్టా అన్నింట్లోను ఉండే సర్వాతీత సర్వాంతర్యామి ఆత్మ. అది అస్తిత్వానికే అస్తిత్వం. దానికే దేవుడని నామాంతరం.

ఎందుకు చెబుతున్నానంటే - ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు తమ శరీరంలోని అధిష్ఠాన దేవతల్ని అకాలంగా బలవంతంగా వెళ్ళగొడతారు. దైవాదేశం లేకపోవడం చేత ఆ దేవతలు వెళ్ళడానికి ఇష్టపడరు. కాని నశించిపోతున్న శరీరంలో ఉండడం సాధ్యపడదు. సదరు దేహం సహజంగా నిర్ణీత సమయానికి పతనమయ్యేటప్పుడు దాని పాత ఫైళ్ళని సజావుగా ప్రశాంతంగా ఇంకో జన్మకు బదిలీ చెయ్యడానికి వాళ్ళు నియమించబడ్డారు. ఆ ఫైళ్ళలో గతజన్మల పాపాలూ, పుణ్యాలూ, జ్ఞాపకాలూ, వాటికి నిర్ణయించబడ్డ ఫలితాలూ అన్నీ ఉంటాయి. దైవద్రోహియైన జీవుడితో కలిసి ఉండడానికి వాళ్ళకిష్టం లేకపోవడంతో ఆ ఫైళ్ళు పట్టుకుని వాళ్ళు తమ లోకాలకు తాము వెళ్ళిపోతారు. తిరిగి దైవాదేశం వచ్చేదాకా ఆ దైవద్రోహి శరీరంలో ప్రవేశించడానికి వాళ్ళు సాహసించరు. ఇంక మిగిలేది ఏమిటి ? అంటే ఏ అధిష్ఠానదేవతలూ లేనటువంటి పాడుపడ్డ దేవాలయంలాంటి దైవద్రోహపు సూక్ష్మశరీరం. దాన్ని సామాన్యులు దెయ్యం/పిశాచం అని వ్యవహరిస్తారు. అధిష్ఠాన దేవతలు గతం తాలూకు అన్ని ఆనవాళ్ళూ తమవెంట తీసుకెళ్ళిపోవడంతో జీవి తన సర్వస్వాన్నీ పోగొట్టుకుని రోడ్డన పడ్డ పరమబికారి దివాలాకోరులా మారిపోతాడు/మారిపోతుంది. దేవుడికి దూరమైపోవడం మాట సరేసరి. అంతకుముందు జన్మల్లో చేసిన అమూల్యమైన మహోజ్జ్వలమైన పుణ్యఫలాలు చాలావఱకు రద్దయిపోతాయి. అదొక భయంకరమైన పరిస్థితి. చచ్చీచెడీ ఏడాదిపాటు చేసిన ప్రాజెక్టు మొత్తం నిశ్శేషంగా క్ర్యాష్ అయిపోయే సంభావ్యతని ఊహించుకోండి. కోట్లల్లో మీరు డిపాజిట్లు పెట్టిన బ్యాంకు ఆకస్మికంగా మూతపడిపోయాక దాన్ని తిరిగి ఎప్పుడు తెఱుస్తారో మీ డబ్బు మీకెప్పుడు చేతికందుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడితే మీ అవస్థ ఎలా ఉంటుందో యోచించండి !

అనాథలైన వీథిపిల్లల్ని పోగేసి వాళ్ళతో భిక్షమెత్తించే నేరస్థ ముఠాలున్నట్లే - ఇలా ఆత్మహత్యలకు పాల్పడి దైవబలాన్ని కోల్పోయి పిశాచరూపాన్ని పొందిన మానవాత్మల్ని వెతికిపట్టుకుని క్షుద్రమంత్రాలతో బంధించి వాటికేవో భౌతికానుభవాల్ని ఎఱగా వేసి తమ యొక్క నీచకార్యకలాపాలకు వాటిని వాడుకునే దుర్మార్గులున్నారు. వాళ్ళు ఇప్పటికీ మన సమాజంలో రహస్యంగా సంచరిస్తున్నారని మర్చిపోవద్దు. వాళ్ళని తక్కువ అంచనా వెయ్యొద్దు. కొన్నికొన్ని పిశాచాల్ని తమకప్పగించవలసిందిగా వాళ్ళు పిశాచాలకు రాజైన బేతాళుణ్ణి ఆవాహన చేసి ప్రార్థిస్తారు. అలా...అలా... ఒకసారి ఆత్మహత్యచేసుకున్న జీవి పరిస్థితి రోజురోజుకీ దారుణంగా దిగజారిపోతూ ఉంటుంది. కనుచూపు మేఱలో దాన్నుంచి విముక్తే కనిపించదు. అలా గత 400 సంవత్సరాల నుంచి పిశాచాలుగానే మిగిలిపోయినవాళ్ళున్నారు. ఆ ప్రస్తావన ఇక్కడ సందర్భ సహితం కాదు. ఐతే పిశాచత్వం గుఱించిన నా పరిశోధన వివరాల్ని ఎప్పుడో ఒకప్పుడు ఈ బ్లాగులో ఇలాగే వరుస-టపాలుగా ప్రకటిస్తాను. (సమాప్తం)


పూర్తిగా చదవండి