కదలి వచ్చినాడె కళ్యాణమునకు
సుందరేశ్వరుడు సొగసుల రాయుడు కదలి వచ్చినాడె (పల్లవి)

1. జటాజూటమే కనక కిరీటము - చంద్రరేఖయే ముత్యాలసరము |
ఫాలనేత్రమే అరుణతిలకమై - సంకల్పించగ వేషము మారెను ||

2. ఉరగములయ్యెను స్వర్ణహారములు - పడగల మణులవి మార్పును చెందక |
తనువున తెల్లని భస్మము మారెను - సుగంధ కరమౌ అంగరాగముగ ||

3. గజాజినమయ్యె పట్టు వస్త్రముగ - గంగాధారయె మల్లెలమాలగ |
చరణోరగములు మణినూపురములు - కంఠ నైల్యమే కలువపూవుగ ||

4. ప్రమధగణంబులు రాజవేషముల - మేళములూదుచు వాద్యనాదముల |
బయలుదేరగా బయలుదేరెనే - పెండ్లి కొడుకై పరమేశ్వరుడు ||

5. మదవృషభంబదె నందీశ్వరుడు - సాలంకృతుడై చిరుమువ్వలతో |
స్వామిని మోయుచు సుందరగతితో - ఝలఝల ఝలఝల రవముల నడచెను ||

6. వేదమంత్రముల చదువుచుముందుగ - వాణితో నడచె బ్రహ్మ దేవుడట |
పద్మ గోవిందులిరుపక్కలలో - నడచిరి నవ్వుల కళకళలాడుచు ||

7. వాణి రచించిన మంగళ గీతుల - మధుర కంఠమున పద్మ పాడినది |
మురహరుడంతట మురళినూదెను - తలనాడించెను స్మితముఖుడీశుడు ||

8. ముక్కోటి సురలు ముందుగ పక్కల - వెనుకను నడచిరి శంఖములూదుచు |
స్వస్తి వాచనము లొప్పగ చెప్పుచు - సప్త మహర్షులు సరసనె నడచిరి ||

9. గంధర్వగణము గళమెత్తిపాడె - జయజయ శంభో జయశంభో! యని |
కిన్నరు లందరు వీణల మీటిరి - అప్సరసలంత నృత్యమునాడిరి ||

Download this bhajan sung by Shri Dattaswami here
-------------

(త్రిపుర సుందరి యైన పార్వతిని వాణి, పద్మలు దేవకాంతలే సువాసినులుగా అలంకరిచిన ఘట్టము).
గౌరీ కళ్యాణ వైభవమే | దేవ కాంతలే సువాసినులే || (పల్లవి)
1. ఉత్తర తారను చంద్రుడుండగ - సింహాలగ్నమున పార్వతి పెండ్లి |
బంగారు బొమ్మ గౌరిని వధువుగ - చేయుచుండిరదె సువాసినులార! ||

2. గంగయె స్వయముగ తరలివచ్చెనే - మంగళస్నాన విధినొనరించగ |
ఆస్నాన నెపముతోడ గంగక్క - కౌగలించెనే ముద్దుల చెల్లిని ||

3. పసుపును కలిపిన సున్నిపిండినే - నలుగును పెట్టగ వచ్చిరి స్వయముగ |
వాణియు లక్ష్మియు విసిరివేసిరే - దానిని గౌరీ తను కాంతిఁజూచి ||

4. పన్నిరుఁజల్ల పరుగున వచ్చిరి - దేవకాంతలట పార్వతి మీదను |
గౌరితనువున పద్మగంధమదె - సహజముగరాగ విరమించిరదియు ||

5. బంగారురంగు ఎర్రని అంచుల- పట్టు చీరెనే శివుని కిష్టమని |
ధరింపఁజేసిరి బంగారు కాంతి - దేహమందునది కలిసిపోయెనే ||

6. బంగారు సొమ్ములన్నియు పెట్టిరి - గౌరికితనువున వెలవెల బోయెను |
అగ్నిలో కాలి మరింత మెరుపున - వచ్చిన తనువది పూర్వజన్మఁ బడి ||

7. పూలహారములు నంగములందున - శోభిల్లు చుండ వనదేవతలా |
పద్మవేసినది పద్మహారమును - కోత్త శోభతో వెలుగుచుండెనది ||

8. మొగలి పూవులే రేకుల ముడిచి - గులాబిపూవుల తురుముచు కట్టిన |
పూలమాలతో మేళవించిరే - పెండ్లి కూతురికి జడనువేసిరే ||

9. కళ్యాణతిలకమప్పుడు దిద్దిరి - గౌరి ఫాలమున పద్మయు వాణియు |
అరుంధతి పెట్టె కన్నులకాటుక - కాటుక చుక్కను బుగ్గపై చివర ||

10. హంసయానమున బయలుదేరెనే - మేళతాళములు మిన్నుముట్టగా |
బంగారు గాజులవె కదులుచుండ - పదములనందెలు ఘల్లు ఘల్లుమన ||

11. పారాణి పాదపద్ములవియే - జగదంబవియట కదులుచున్నవే |
అడుగు అడుగునకు కొత్త అందములు - అప్సరసలెమరి మురిసిపోయిరే ||

12. వాణియు పద్మయు కౌగిలించిరే - మోహభావమున తాళజాలకే |
త్రిపురసుందరియె పెండ్లి కూతురై - సొగసుల దేవత నడుచుచున్నదే ||

13. కండ్లుమూసుకొని తపమును చేయును - శివుడెందులకో ఇపుడర్ధమాయె |
అందాలరాశి నీ గౌరమ్మను - పొందుతకేలే అన హరి నవ్విరి ||

14. తత్తరలాడెను శివుని నేత్రములు - గౌరినిఁ జూడగ బ్రహ్మ మంత్రముల |
నాలుగు ముఖముల నొకసారిచదువ - వేరువేరుగా బాగుండుననుకొనె ||

15. ముక్కొటి డెవత లొక్క దృష్టితో - చూచుచుండిరే కన్నులు చెమరింప |
మంగళ సూత్రము కట్టునమ్మా - గౌరికి మెడలో శంకరుడు ||

16. భగవంతుడే వరుండనగా - భక్త జీవుడె పెండ్లి కూతురు |
మంగళసూత్రమె భక్తి బంధము - అంతరార్ధమును తెలియండీ ||

17. భరించువాడే భర్తయగును - సర్వ భర్తయె పరమాత్మ |
భరింపబడె జీవుడు భార్య - సహస్రార బంధమె కళ్యాణము ||

శివాయ మంగళం - సర్వ మంగళం - సర్వ మంగళా ధవాయ మంగళం |
భవాయ మంగళం - దత్త మంగళం - అనఘా ప్రియాయ నిత్య మంగళం ||

Download this bhajan sung by Shri Dattaswami here
-----------------------

గౌరి పరీక్షకు బ్రహ్మచారిగా వచ్చుచున్నడు వామదేవుడు (పల్లవి)

సుందర తాపస తరుణ వేషమున - బ్రహ్మతేజమే ప్రజ్వరిల్లగా |
కరముల దండ కమండలు ధారిగ- పండితోత్తముడు హుటాహుటి నడచి ||

చరణ పాదుకలు ధ్వనులను చేయగ - బ్రహ్మ వర్చస్సు ముఖమున చిందగ |
తేజోమయ ననయంబుల చూచుచు - సన్న నవ్వు అధరంబున వెలయగ ||

విభూతి రేఖలు మధ్య కుంకుమము - ఎర్ర కాశ్మీర శాలువ భుజముల |
వేదమంత్రముల తియ్యగ పలుకుచు - బ్రాహ్మణ నైష్టిక గాంభీర్యముతో ||
పూర్తిగా చదవండి