(దక్ష ప్రజాపతి కుమార్తె శ్రీ శివ దేవుని రాణి సతీదేవి. తండ్రియగు దక్ష ప్రజాపతి శివుని ఆహ్వానించక శివ రహితమైన యజ్ఞము తలపెట్టి కుమార్తె సతిని అల్లుడు శివుని ఆహ్వానించలేదు. తన చెల్లెళ్ళు ఆ యజ్ఞమునకు వెళ్ళుచుండగా జూచిన సతి, భర్తను బ్రతిమాలి శివుడు వద్దన్ననూ వినక స్వామీ అనుజ్ఞ ఇవ్వండి అని బ్రతిమలి ఆ యజ్ఞమునకు వెళ్ళింది. అక్కడ తండ్రి దక్షుడు శివనిందచేసి ఆమెను అవమానించాడు. భగవంతుడైన శివుని అవమానమును భరించలేక సతీదేవి సతీత్వమును చెందు ఘట్టము.)

1. దక్షాయనుచును ఏకవచనమున - సంబోధించెను తండ్రిని శివసతి
దాక్షాయణియె మొట్టమొదటిగా - స్వామి దూషణము నోర్వగలేకయె

2. ఓరీ! దక్షా ! నోరుమూయుమిక - నా తండ్రిగాన బ్రతికి పోతివిట
వేరొకరైతే నా శాపాగ్నికి - భస్మమయ్యెదరు శివదూషణకై

3. నీకు పుత్రికగ జన్మించుటయే - నేను చేసినది మహాపాపమే
తత్ఫలమిప్పుడు శివదూషణమును - వినవలసెను నేనేల బ్రతుక?

4. స్వామి దూషణము నాకర్ణించియు - బ్రతికి యుంటినే పాపిష్టిదాన
కావున పాపికి నీకు పుట్టితిని - మరణించుటయే ప్రాయశ్చిత్తము

5. శివుడన నెవరని తలచుచుంటివో - మూఢాగ్రేసర రాజాధిరాజ !
శివుడే దత్తుడు పరమబ్రహ్మము - త్రిమూర్తులాయన వేషములేగద

6. జగదుత్పత్తిని జగత్పాలనను - జగదంతమునే చేసెడి వాడే
పరమేష్ఠియనగ పురుషోత్తముడన - పరమేశ్వరుడన నతడే దత్తుడు

7. ఓరీ దక్షా ! జ్ఞానాంధుండవు - నే కేమి తెలియు శివమహాత్మ్యము
కరుణరూపుడా పరమేశ్వరుడే - కావున తిట్టియు బ్రతికి యున్నావు

8. శివదూషణమే మహాపాపము - దానిని మించిన పాపము లేదట
దానికి ప్రాయశ్చిత్తము లేదుర - సర్వ పాపహరమగు శివనామము

9. అర్ధము తెలుయునే ? సర్వమంగళుడు - అని శివశబ్దము తాత్పర్యంబని
శివరహితంబగు కర్మయేదైన - అమంగళంబగు నశుభము తుచ్ఛము

10. శ్మశానవాసిని శివునర్పించిన - శ్మశానగమనము తప్పును దక్షా!
అపమృత్యుహరము మృత్యుంజయుడని - తలచుటయని మునిగణములు చెప్పవె

11. దిగంబరుండే కృత్తివాసుడే - పట్టు వస్త్రముల దాల్చనివాడే
కానీతత్పద నతుడు ప్రతిదినము - స్వర్గసంపదల రక్షకునింద్రుడు

12. శివపద ధూళిని శిరమునఁదాల్చును - ప్రతి సూర్యోదయమందున సురపతి
ఆరోజు వరకు అతడికి స్వర్గము - సురక్షితంబగు దక్షా! వినరా !

13. సర్వసంపదల నతడే యిచ్చును - సృష్టి యంతయును అతడి సొత్తే
బిడ్డలు దీనిని భోగించచూచి - సంతుష్టుండగు ఆ మహేశ్వరుడు

14. ఓ పిచ్చి వెధవ ! దరిద్రుడనగా - అమంగళుండన నోరెట్ల వచ్చె
నేత్ర పద్మమును అతడికర్పించి - సర్వ లోకపతి పదవిఁ బొందె హరి

15. శిశుపాలుతిట్లు విని గోపాలుడు - సభలో వక్కల లెక్కించినట్లు
నీ దూషణములు లెక్కపెట్టబడు - మహాకాలుడగు పరమేశునిచే

16. బ్రహ్మయు హరియును యత్నింపలేదె ? కనుగొననీశ్వరు మొదలును తుదినట
హంసవరాహము రూపము లెత్తియు - చేతగాక శివ శరణముఁ జొచ్చిరి

17. వారికె తెలియనసాధ్యుడు శివుడు - నీకేమి తెలియు వాగబోకురా
హరివిధులముందు నీవొక చీమవు - ఆతత్త్వ మెరుగ నీతరమగునే !

18. నీ బోడి యజ్ఞమెంతర దక్షా ! - యజ్ఞపురుషుడగు నారాయణుడే
మేరు శైలమున ప్రతి దినమాయనను - పూజించె కమల సహస్రార్చనల

19. నారాయణునే పరీక్షఁ జేసెను - మాయజేసెనొక కమలము నొకపరి
నేత్ర కమలమును పెరికి అర్పించె - ప్రసన్నుడై శివుడెదురుగ నిలచెను

20. కౌగలించె శివుడబ్జలోచనుని - మోహిని భావము నందుచు హరియును
పతిగా తలచెను పరమేశ్వరునే - పురుషోత్తముడే స్త్రీ భావమందె

21. నాటినుండియును సర్వ జగత్పతి - పదవిని మురారి కిచ్చెను భార్యకు
మోహినిరూపము దాల్చి భార్యగా - పురుషోత్తముడే మారెను దక్షా!

22. నీవొక పురుషుడ వైతివీనాడు - పురుషోత్తమునకు పురుషుడగువాని
అల్పుడిగఁ దలచి నాడవు మూర్ఖా ! - నీ అజ్ఞానపు జలధి అపారము

23. శివ నామమును ఉచ్చరింపగనె - శాంతించుమనము పవిత్రతఁ గలుగు
ఒక్కసారి శివ నామము పలుకుచు - అనుభవమందుము మూర్ఖత్వమేల ?

24. మహాప్రళయమున సర్వ జగత్తును - భస్మముఁ జేయును కాలాంతకుడై
సర్వమీశ్వరుని వశమునుండును - విభూతికర్ధము ఇదె భస్మమునకు

25. తాండవగళితము భస్మమును సురలు - సంగ్రహించి తిలకంబు ధరింతురు
శివతనువునుండి రాలినదానిని - చూచి దరిఁజేర భీతుడగు యముడు

26. హాలహలమట జగములదహింప - మగవాడెవడు ముందుకు వచ్చెను ?
పురుషుడొక్కడే పరమేశ్వరుడే - దానిని మింగెను నీలకంఠుడై

27. భస్మమైతిరే నీకు తెలియదా - అట్టహాసమున త్రిపురాసురులే
శరభావతారమెత్తి రుద్రుడే - నరసింహుని శాంతింప చేసెనే

28. ఆదిదేవుడా ! దేవ దేవుడా ! మహాదేవుడా ! నా ప్రాణనాధ !
నా ప్రాణ దీపమారిపోనిమ్ము - నీ నిందవిన్న బ్రతుకు నాకేల ?

29. నా ప్రాణనాధ ! నీ చరణమందు - నా ప్రాణ దీప మారిపోవగా
నాకాభాగ్యము లేదాయెనాధ ! - వీడి కడుపునకు పుట్టినందులకు

30. నీ ప్రేమలోన జీవించియున్న - నిజమైన భక్తురాలనైనచో
నా పాదాంగుళి నిదిగోరుద్దితి - భూమిపై అగ్ని పుట్టిననుగాల్చు

31. అపుడు యోగాగ్ని పుట్టెను దహించె - సతీదేవినే హాహారవములు
మిన్నుముట్టెనే మునిసుర కృతములు - ఎంత భక్తియని అచ్చెరువొందిరి

32. స్వామి దూషణము విన్నమాత్రమున - ప్రాణత్యాగము చేసిన సతినే
మూడుచూపులును ఏకముకాగా - చూచెవిస్మితుడు పరమేశ్వరుడును

33. మూడు నేత్రముల బాష్పధారలే - త్రిమార్గగంగా వాహినిఁ బోలుచు
కురియగ పల్కెను స్వామి 'ఓ ప్రియా-నీ ప్రేమ నెరుగ నాకునసాధ్యము'

34. భగవద్దూషణ శ్రవణమాత్రమున - ప్రాణము విడచిన సతీమాతరో
సాష్టాంగమిదియె ప్రణతులు తల్లీ ! - మాకిమ్ము నీదు భక్తి లేశమును
Download this bhajan sung by Shri Dattaswami here

పూర్తిగా చదవండి