hidden-fortress.jpg“The hidden fortress” అకిరా కురోసవా తీసిన జాపనీస్ సినిమా. కురోసవా సినిమాలు ఎన్నిటిలోనో ప్రధాన పాత్రలు పోషించిన తొషిరో మిఫునె ఇందులో కూడా హీరో. పేరును బట్టి ఊహించగలిగినట్టే, ఇది రాజుల సినిమా. అయితే, సమురాయ్ ల కాన్సెప్టు, సమురాయ్ లు ఇందులో లేరు. ఆ విధంగా చూస్తే, దీన్ని కురోసవా తీసిన సమురాయ్ సినిమాల లెక్కన కట్టలేము. కథ పరంగా చూస్తే, మంచి బలమున్న సినిమా. కథనం పరంగా చూస్తే చాలా ఆసక్తికరంగా సాగిన సినిమా.

సినిమా మొదట్లో ఓ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం తదనంతర ప్రభావాన్ని తప్పించుకుంటూ వెళుతున్న ఇద్దరు సామాన్యులు - తాహీ, మటాషిచి సైనికుల చేతుల్లో నానా పాట్లూ పడుతూ ఉంటారు. అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకి జనరల్ రొకురుటా మకాబె తారసపడతాడు. ఈ పాత్ర పోషించింది మిఫునె. ఇక్కడ కథ ఏమిటీ అంటే, యుద్ధం లో ఓడిన అకిజుకి వంశపు ఏకైక వారసురాలినీ, వారి సంపద అయిన 200 కేజీల బంగారాన్నీ, శత్రువుల కంట బడకుండా సరిహద్దు దాటించడం. మకాబె, యువరాణులతో పాటు ఈ ఇద్దరు రైతులు కూడా బయలుదేరతారు. వీళ్ళ ఆలోచనేమో బంగారం కొట్టేద్దామని. మకాబే ఆలోచనేమో వీళ్ళ దురాశని ఉపయోగించే వాళ్ళ సాయాన్ని పొందుదాం అని. దారిలో ఓ బానిస యువతి కూడా కలుస్తుంది. ఇక్కడ్నుంచి వీళ్ళంతా ఎలా బయటపడ్డారు అన్నది కథ.

అసలీ కథ ని చెప్పడం కాదు - ఎలా వాళ్ళ గంయం చేరారు అన్నది చూసి తీరాలి. మలుపులు రావాల్సినప్పుడు మలుపులు, తప్పించుకునే మార్గాలు - రెండూ ఎలా తెప్పించాలో కథకుడికి బాగా తెలుసు. తాహీ, మటాషిచి మధ్య ఉండే హాస్యం సినిమాలో మనకు comic relief. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ టైమింగ్ అద్భుతం. చివరకు డైలాగులు లేనప్పుడు కూడా వాళ్ళ ముఖాలు చూస్తే నవ్వొచ్చేస్తుంది. వీళ్ళు కాక సినిమాలో మరో ముఖ్య పాత్ర యువరాణి యుకీ. సినిమా అంతా దాదాపు మూగమ్మాయి గానే నటించాల్సి వస్తుంది, మాటలొచ్చినా కూడా. ఈ అమ్మాయి కళ్ళతోనే కథంతా నడిపేసింది. చాలా బాగా చేసింది అనిపించింది. ఇన్నాళ్ళయ్యాక మిఫునె గురించి మళ్ళీ చెప్పడం… చెప్పిందే చెప్పినట్లు ఔతుంది… కనుక చెప్పను. He is simply amazing.

ఈ సినిమాలో కూడా పొగనీ,మంచునీ చాలా తెలివిగా వాడుకున్నారు. Hidden Fortress ఉన్న ప్రాంతాన్ని తీసిన విధానం కూడా చాలా బాగుంది. అసల్నాకు ప్రధానంగా ఈ సినిమాలో నచ్చింది ఆ కథ నడిచే విధానమూ, ఇంకా దాని వేగమే. మొదట గుర్రాలతో బయలుదేరడమూ, శత్రువులు గుర్రాల్లో తిరిగే ఆ నలుగురి కోసం వెదికే సమయానికి వీళ్ళు గుర్రాలొదిలేసి ఓ బండి తీసుకోడమూ, నలుగురు కాస్తా ఐదుగురు అవడమూ, ఎక్కడిక్కడ తప్పించుకుంటూ చివరికి గంయం చేరడమూ - ఇవన్నీ సినిమాని చాలా ఆసక్తికరంగా చేసాయి. ఇందాకే చెప్పినట్లు తాహే జంట హాస్యం సరే సరి. మిఫునె ఏమో మొహం లో నవ్వనేదే లేక వాళ్ళతో మాట్లాడ్డమూ, వాళ్ళ చూపులకీ, చేతలకీ మనకు నవ్వు రావడమూ - చూసి అనుభవించాలి అది. Fire Festival - సన్నివేశాలు బాగా తీసారు. అక్కడ పాడిన పాట :
The life of a man
Burn it with the fire
The life of an insect
Throw it into the fire
Ponder and you’ll see
The world is dark
And this floating world is a dream.

- ఈ పాట కూడా చాలా బాగా వాడుకున్నారు-సినిమాలో మూడు చోట్ల.

సినిమా ఆద్యంతమూ చాలా బాగా తీసినట్లు అనిపించింది నాకు. కురోసవా యొక్క better known movies తో పోలిస్తే ఇది ఎందులో తక్కువో మరి అర్థం కాలేదు. నా మటుకు నాకైతే, చాలా నచ్చింది సినిమా. కురోసవా అంటే ఎందుకు ప్రపంచమంతా తెలుసో… ఒక్కో సినిమా చూసే కొద్దీ అర్థమౌతోంది…


పూర్తిగా చదవండి