సత్యజిత్ రే-ఒక పరిచయం
bengali cinema, focus, satyajit ray, ప్రముఖులు, బెంగాలీ సినిమా, భారతీయ సినిమా, సత్యజిత్ రే May 2nd, 2008
ఆధునిక మానవుడి మేధో మథనం నుంచి వెల్లివిరిసిన సమిష్టి కళారూపం సినిమా! వందేళ్ళ చరిత్రను సంతరించుకున్న సినిమా సర్వకళా సమ్మిశ్రితమై విరాజిల్లుతోంది. సినీ ప్రపంచానికి భారతదేశం అందించిన ఆణిముత్యం సత్యజిత్ రే. అనేక కళల్ని ఆపోసనపెట్టి అత్యద్భుత చిత్రాల్ని అందించిన రే భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు ప్రతిరూపం. వ్యాపారమే లక్ష్యంగా డబ్బే ఊపిరి, ప్రాణాలుగా చేసుకుని ఊహా విహారాల్లో ఆకాశయానం చేస్తున్న భారతీయ సినిమాను నేలపైకి దించి సామాన్య ప్రజపవైపు ప్రజల జీవన విధానాల వైపు వాస్తవ పరిస్థితులవైపు అత్యంత కళాత్మకంగా మరల్చి భారతీయ సినిమాకే నవ్యత్వాన్ని అందించిన వాడు సత్యజిత్ రే. రే కృషి సినిమాకు మానవతీయతను నేర్పి నవ్య వాస్తవికతను సంతరింపజేసి నూతన పథాన్ని నిర్దేశించింది. భారతీయ చలనచిత్ర రంగంలో నవ్య సినిమా, సమాంతర సినిమా, ఆర్ట్ సినిమా తదితర పేర్లతో పిలువబడుతున్న సరికొత్త సినిమాకు ఊపిరి పోసింది.
తన ముప్పై ఎనిమిది సంవత్సరాల సినీరంగ జీవితంలో రే ’పథేర్ పాంచాలి’ నుంచి ’అగంతుక్’ వరకు 30 పూర్తి నిడివి చిత్రాలు అనేకానేక డాక్యుమెంటరీలు నిర్మించాడు. ఆయన తీసిన ప్రతి చిత్రం ఓ కళాఖండమై నిలిచింది. ప్రపంచంలో అనేకానేక ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు రివార్డులు అందుకోవడంతో పాటు ఆయన చిత్రాలు ఆ తర్వాతి తరం సినీ దర్శకులకు పాఠ్యాంశాలుగా మారాయి.
సినిమా నిర్మాణానికి జీవితమే ముడి పదార్థమని విశ్వసించిన రే భారతీయ సినిమా మరింత సమగ్రతని, ఊహాత్మకతని సంతరించుకోవాలని సూచించేవారు. అంతేకాదు మన సినిమా భారతీయతను ఇముడ్చుకున్న స్టెయిల్ ఈడియమ్ లను నేర్చుకోవాలని సూచించారు. సినిమా గురించిన ఆయన భావాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు, నిర్మించిన చిత్రాలన్నింటిని క్రోడీకరించి చూస్తే ఆయన చలనచిత విజ్ఞాన సర్వస్వం లాగా గోచరిస్తాడు. 1966 లోనే లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫిలిం ప్రొఫెసర్ థోరాల్డ్ డికిన్సన్ రే గురించి ఇలా అన్నాడు. “సినిమా పుట్టినప్పటి నుంచి బ్రిటన్ లో చిత్రాలు తీస్తూనే వున్నారు కానీ సత్యజిత్ రే లాంటి ఒక్క కళాకారుణ్ణి కూడా సృష్టించలేకపోయారు”. ఈ మాటలు చాలు రే లోని కళాత్మక పటిమను గుర్తించడానికి.
1921 లో మే 2 న జన్మించిన సత్యజిత్ రే తన జీవితంలోని అత్యధిక సమయం సినీరంగంలోనే గడిపినప్పటికీ ఆయన రచయితగా, చిత్రకారుడిగా, టైపోగ్రాఫర్ గా, బాల సాహిత్య సృష్టికర్తగా, సైన్స్ ఫిక్షన్ రచయితగా, తనదైన ముద్రగల సృజన చేశాడు. సినీ రంగంలో సైతం ఆయన దర్శకత్వానికి తోడు సంగీతం, సినిమాటోగ్రఫీ, స్క్రిప్ట్ రచన, మాటల రచన బాధ్యతల్ని స్వయంగా నిర్వహించాడు.
కథ స్క్రిప్ట్ రచనలతోపాటు సన్నివేశాలకు సంబంధిమ్చిన స్కెచెస్ వేసుకుని ఆయన తన చిత్రాలని రూపొందించేవారు. ’పథేర్ పాంచాలి’ చిత్ర విషయంలో కెమెరా మూవ్‍మెంట్ సైతం మొదట స్కెచెస్ గా రూపొందించుకుని మరీ తీశాడు. ఒక చిత్ర నిర్మాణం విషయంలో రే తీసుకున్న శ్రద్ధ, పడిన శ్రమ అపురూపమైంది, అరుదైంది. అంతటి మధనం నుంచి వెలువడ్డాయి కనుకనే ఆయన చిత్రాలు అంతటి మహత్తర కళాఖండాలుగా భాసిల్ల్లాయి.
మొదట సాహితీవెత్తగా మొదలైన రే చిత్ర రంగానికి వచ్చేసరికి ఆయా కథా రచయితల మనోభావాల్ని అందిపుచ్చుకుని తన ఊహాత్మకత రంగరించి ప్రతి సన్నివేశం మూల రచయిత భావాల్ని మరింత స్పష్టంగా కళాత్మకంగా చిత్రాల్లో చూపించగలిగాడు. చైతన్య స్రవంతి రీతిలో చెప్పిన పాత్రల మనోభావాల్ని సైతం రే తన కెమెరాతో పలికించాడు. అలా సాహిత్యానికి సినిమాకి వారధిగా నిలిచి సినిమాని పరిపుష్టం చేశాడు. రే, టాగూర్, విభూతిభూషన్ బందోపాధ్యాయ, తారాశంకర్ బందోపాధ్యాయ, ప్రేంచంద్, నరేంద్రనాథ్ గంగోపాధ్యాయ, మైత్ర, సునీల్ గంగోపాథ్యాయ తదితర భారతీయరచయితల రచనలే కాకుండా ఇబ్సెన్ లాంటి విదేశీ రచయితల రచనల్ని కూడా తెర పైకి ఎక్కించి రే చలనచిత్ర పరిభాషతో తన చిత్రాలను కళాఖండాలుగా తీర్చి దిద్దాడు.
రే తన ముప్పై ఫీచర్ ఫిల్ములతో ప్రపంచ ఖ్యాతినార్జించినప్పటికి ఆయన షార్ట్ ఫిల్మ్ ల నిర్మాణంలో సైతం విశేష ప్రతిభ కనబర్చారు.1961 లో రవీంద్రనాథ్ ఠాగోర్ జీవితంపై ఆయన నిర్మించిన డాక్యుమెంటరీ రాష్ట్రపతి గోల్డ్‍మెడల్ ని అమ్దుకోవడంతోపాటు లోకొర్నో ఫిలిం ఫెస్టివల్ లో గోల్డెన్ సీల్ బహుమతిని అందుకుంది. 1964 లో ఎస్సో వారి కోసం రే ’టూ’ అన్న డాక్యుమెంటరీ నిర్మించాడు.ఆ తర్వాత 1971లో సిక్కిం పై డాక్యుమెంతరీ నిర్మించాడు. అయితే ఆ చిత్రం ఇంతవరకూ భారతదేశంలో ప్రదర్శనకు నోచుకోలేదు. ఇకపోతే 1972 లో శాంతినికేతన్ కు చెందిన బినోద్ బిహారీ మిఖర్జీ జీవితంపై ’ది ఇన్నర్ ఐ’ అన్న డాక్యుమెంటరీ నిర్మించి ప్రశంసలు అందుకున్నాడు. 1976 లో బాలసరస్వతిపై ’బాల’అనే లఘు చిత్రాన్ని నిర్మించాడు. అలా భావస్ఫోరకంగా రే తీసిన డాక్యుమెంటరీలు సైతం విశ్వవిఖ్యాతి గడించాయి.
పూర్తిగా చదవండి