(భారతీయ సినిమాలోనే కాక, ప్రపంచ సినిమాలో అగ్రశ్రేణి దర్శకుల్లో ప్రత్యేక స్థానం బెంగాలీ సినిమా దర్శకుడు సత్యజిత్ రాయ్ ది. రాయ్ దాదాపు 26 సినిమాలు, 10 డాక్యుమెంటరీలకి దర్శకత్వం చెయ్యటమే కాక మరెన్నో సినిమాలకి తన సహాయం అందించాడు. ఆయన తీసిన సినిమాలు కొన్ని నవతరంగం పాఠకులకు పరిచయం చేద్దామని నా ప్రయత్నం. ఈ శీర్షిక కింద, “చారులత” సినిమా ముందు పరిచయం చేస్తున్నా.)

charulata-i.jpgప్రపంచ సినిమాలో అతి ప్రముఖుడైన బెంగాలీ సినిమా దర్శకుడు సత్యజిత్ రాయ్ ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకి సమాధానంగా,”నేను చారులత సినిమా మళ్ళీ తియ్యాల్సి వస్తే, సరిగ్గా మళ్ళీ అలాగే తీస్తాను” అన్నాడు. ఠాగోర్ 1901 సంవత్సరంలో రాసిన ప్రఖ్యాత బెంగాలీ నవల “నష్టనీర్” (చెదిరిన గూడు) ఆధారంగా 1964 సంవత్సరంలో సత్యజిత్ రాయ్ తీసిన బెంగాలీ సినిమా “చారులత”. ఈ సినిమా కథ వదిన చారులత పాత్ర (మాధవి ముఖర్జీ), మరది అమల్ పాత్ర (సౌమిత్ర ఛటర్జీ) ల మధ్య ఉండే అభిమానం, ప్రేమ పరిధి దాటి వెళ్ళటం వల్ల కలిగే ఉద్వేగాల గురించి వివరిస్తుంది. హద్దు మీరిన అనురాగంతో చారులత పాత్ర (వదిన) పొందే అంతర్మధనం ఈ కథకు కేంద్రబిందువు.

ముఖ్య పాత్రల పరిచయం

ఈ సినిమా కథ చాలా సున్నితమైన మానవ సంబంధాలను, విలువలను ఎత్తి చూపిస్తుంది. భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా కథా కాలమైన 1880 సంవత్సర ప్రాంతాల్లో బెంగాల్ రాష్ట్రంలో ఒక కుటుంబంలోని వదిన, మరదిల మధ్య ఉన్న పవిత్రమైన అనుబంధం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. చారులత భర్త భూపతి పాత్ర (శైలేన్ ముఖర్జీ), ఎప్పుడూ తనకి నచ్చిన వ్యాపకమైన ప్రింటింగ్ ప్రెస్ నడపటంలో, క్షణం ఖాళీ లేకుండా ఉంటాడు. ఆ ప్రెస్‌కి అతడే యజమాని, సంపాదకుడు కూడా! తన భార్యను నిర్లక్ష్యం చెయ్యటానికి కారణం పత్రిక, దాన్ని నడపటం తప్ప, తన కాలమంతా తాగుబోతుగా లేక పచ్చి వ్యభిచారిగా తిరుగుతూ కాలం గడిపే వ్యక్తి కాదు భూపతి. స్వతహాగా తెలివైన చారులత పాత్ర, తన ఇంట్లోనే తాను బందీగా ఉండటం గమనిస్తుంది. ఈ ఒంటరితనాన్ని, రాయ్, సినిమా మొట్టమొదటి సీన్ దగ్గరనుంచి దాదాపు ఏడు నిమషాల పాటు అత్యత్భుతంగా, రకరకాలైన కేమెరా భంగిమల ద్వారా, చారులత పాత్ర ప్రవర్తనల ద్వారా నిర్ధారిస్తాడు. ఈ ఏడు నిమషాల్లో ఒక్క చిన్న సంభాషణ మాత్రమే ఉంటుంది. సినిమాలో ముందు ముందు జరగబోయే సంఘటనలకి ఈ పాత్ర పరిచయం ఈ రకంగా చూపించడంలో సినిమా కథ ఎంతగా ఈ పాత్ర వల్ల ప్రభావితం అవుతుందో తెలుసుకున్న తరవాత, రాయ్, సినిమా దర్శకత్వం మాత్రమే కాకుండా, గొప్ప స్క్రీన్ ప్లే రచయితగా అందరూ అంగీకరిస్తారు.

చారులత పాత్ర ఇలా ఒంటరితనం అనుభవిస్తున్న కాలంలో (చారులత పాత్రకి పిల్లలు లేకపోడం ఈ ఒంటరితనాన్ని తీవ్రతరం చేస్తుంది), వేసవిలో కాలేజీ శలవలకి మరిది అమల్ పాత్ర ఇంటికి రావటంతో, సినిమా కథ ముందుకు నడుస్తుంది. అమాయకంగా ఉండే అమల్ పాత్రధారి, చనువుగా వదినతో మసలటం, అమల్ పాత్రకి ఉన్న సాహిత్యపు అభిరుచులకి, పాండిత్యానికి చారులత పాత్ర సహజంగానే అమల్ పాత్ర వైపుకి ఆకర్షింపబడటం - రాయ్ చాలా తెలివిగా, వీరిద్దరి మధ్య అతి తక్కువ సంభాషణలతో, చూపిస్తాడు. చారులత పాత్రలో వచ్చే మార్పులను, ఆ మార్పులను అర్ధం చేసుకోటంలో అమల్ పాత్ర స్పందనల్ని ఈ సినిమాలో రాయ్ చాలా నేర్పుతో తీసాడు. ఈ కథలో ప్రేమ కేవలం విరిసీ విరియని మొగ్గలాంటి భావన మాత్రమే. ఇది తెలుసుకున్న మరిది తప్పు చేసిన భావనతో ఇల్లు వదలి వెళ్ళిపోతాడు. భర్త ఖిన్నుడౌతాడు.


పూర్తిగా చదవండి