సాధారణంగా ఏదైనా నవలని వెండి తెరపై ఎక్కించడం అనుకున్నంత సులభం కాదు.ఒకరకంగా చెప్పాలంటే దర్శకుడికే కాదు, చూసే ప్రేక్షకులకి కూడా ఒక రకమైన ఛాలెంజే! నవలలోని పాత్రల్నీ, సన్నివేశాల్నీ తెరపై చూపించే వాటితో పోల్చకుండా సినిమా చూడడం ఒకరకంగా అసాధ్యం! అసలు దర్శకుడు నవలనీ నవలలోని పాత్రలనీ అర్థం చేసుకున్నాడా, రచయిత చెప్పదల్చుకున్న విషయం సక్రమంగా తెరపైకెక్కించాడా లేదా అన్న సందేహం కలగడం సహజమే! కానీ దర్శకుడు ఒక నవలని యథాతధంగా తెరపై చిత్రీకరిస్తే అప్పుడు ప్రేక్షకులకి కలిగే అనుభూతి అనిర్వచనీయం!

ప్రముఖ అమెరికన్ రచయిత్రి ఝుంపా లహరి రాసిన ’ది నేం సేక్’ అనే నవలని అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ దర్శకత్వం వహించి, అదే పేరుతో తీసిన సినిమా చూస్తే అటువంటి అనుభవమే కలుగుతుంది.

దాదాపు ముఫై ఏళ్ళ ప్రవాస భారతీయ కుటుంబం జీవితాన్ని కేవలం రెండు గంటల నిడివితో సినిమాగా మలచడం అనుకున్నంత సులభం కాదు. నవలలోని ప్రతీ పాత్రనీ, ప్రతీ సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తదనుగుణంగా స్క్రీన్ ప్లే రాయడంలోనే రచయిత లేదా దర్శకుడి ప్రతిభ తెలుస్తుంది. ఈ మొట్టమొదటి పని సక్రమంగా నిర్వహించి తరువాత తగిన నటుల ఎంపిక చేసుకుంటే సగం పని పూర్తయినట్లే! అటువంటి దానికి మంచి నటీనటుల నుండి అద్భుతమైన సహకారం లభిస్టే పాత్రలు సజీవంగా నిలుస్తాయి.

రెండు విభిన్న సంస్కృతుల, రెండు ఖండాంతర దేశాల మధ్య గడిచిన దాదాపు ముఫై ఏళ్ళ జీవితాన్ని తెరపై ఎక్కించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అదీకాక ఆ భిన్న సంస్కృతుల మధ్యనున్న వత్యాసాలే కాదు, జీవన విధానం కూడా సరైన రీతిలో ప్రతిబింబించేలా తెరపై చూపడం ఒక రకంగా దుస్సాహసమే! అటువంటి దుస్సాహసాన్ని అవలీలగా చేసి స్క్రీన్ ప్లే రాసిన సూనీ తర్పూరీవాలా అభినందనీయురాలు. ఈ ప్రశంసలో కొంత భాగం దర్శకురాలు మీరా నాయర్ కీ దక్కుతుంది. చాలా సార్లు మంచి కథను ఎన్నుకున్న దర్శకులు, నటినాటుల పాత్రల ఎంపిక విషయంలో పప్పులో కాలేస్తారు. లేదా మంచి నటులు దొరికినా సరిగ్గా వినియోగించుకోలేక పోతారు. ’ది నేం సేక్’ సినిమాలో ముఖ్య తారాగణం ఇర్ఫాన్ ఖాన్, టాబు మరియు కాల్ పెన్ నటనా ప్రతిభ చూసాక మీరా నాయర్ ఆ విషయంలో తప్పుచేయలేదనిపిస్తుంది, ఒక రకంగా చెప్పాలంటే, ఈ ముగ్గురూ ఈ సినిమాని మరో మెట్టు పైకి తీసుకెళ్ళారు. నవలలోని ప్రతీ పాత్రకీ తెరపై ప్రాణ ప్రతిష్ట చేసి ప్రేక్షకులకి ఒక అద్భుతమైన్ అనుభూతి కలిగించేలా నటించారు.

అసలు కథ, 1971 సంవత్సరంలో అశోక్ గంగూళీ అనే ఒక బెంగాళీ యువకుడు ఒకసారి తన మావయ్యతో కలిసి రైలు ప్రయాణం చేయడంతో ప్రారంభం అవుతుంది. ప్రపంచం ఒక అధ్భుతమైనదాణీ, దానీ చూడమనీ అశోక్ ని ఉత్తేజపరుస్తాడు అతని మావయ్య. కానీ దురదృష్టవశాత్తూ వారెక్కిన రైలు ప్రమాదానికి గురి అవుతుంది. అశోక్ మావయ్య మరణిస్తాడు. కానీ అశోక్ మాత్రం బ్రతికి బయటపడి, కొత్త జీవిత ప్రయాణం మొదలుపెడతాడు. ఆ పయనంలో భాగంగా అమెరికా వెళతాడు. అక్కడ కొంతకాలం గడిపి, పెళ్ళి చూపుల కోశం స్వదేశం వస్తాడు. అతనికి అషీమా(టాబు) తో వివాహం అవుతుంది. అత్మీయుల్ని మాతృదేశాన్నీ వదిలి, అషీమా కొత్త జీవితం ప్రారంభిస్తుంది అమెరికాలో!

కొత్త ప్రదేశం, కొత్త జీవితం అలవాటు పడుతూండగానే ఒక మగబిడ్డ (కాల్ పెన్) కి జన్మనిస్తుంది. అమెరికాలో ఆసుపత్రి నియమానుసారం ఆ బిడ్డకి తను అత్యంతంగా అభిమానించే రష్యన్ రచయిత గోగోల్ పేరు పెడతాడు అశోక్. తరువాత బారసాల చేసి మార్చుకోవచ్చులే అనుకుంటాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతాడు. ఒక రోజు రష్యన్ సాహిత్యం క్లాసులో ’ఓవర్ కోట్ ’ అనే నవల రాసిన ప్రముఖ రచయిత గోగోల్ ప్రస్తావన వస్తుంది. గోగోల్ అత్యంత ప్రతిభాశాలి అయిన రచయితే కాదు, మతిస్థిమితం లేని వాడనీ, తన పిచ్చి చేష్టల కారణంగా అత్యంత దుర్భరమైన జీవితం గడిపాడనీ తన లెక్చరర్ చెప్పగా, తన తోటి సహచరులు, స్నేహితులూ అందరూ గోగోల్ పేరుని - ఆట పట్టిస్తుంటే భరించలేకపోతాడు. తన పేరుని అసహ్యించుకోవడం మొదలుపెడతాడు.తనకా పేరు పెట్టిన తండ్రిని తిట్టుకుంటాడు. ప్రపంచంలో ఏ పేరూ లేనట్టు ఆ గోగోల్ పేరు ఎక్కడ దొరికిందని తండ్రిని నిలదీస్తాడు. అశోక్ తన రైలు ప్రమాదం సంఘటన చెబుతూ ’నిన్ను చూసినప్పుడల్లా ఆ ప్రమాదమే గుర్తికొస్తుంది. అప్పటి నుండీ ఈ రోజు వరకూ ప్రతిరోజూ ఒక వరమే!’ అని చెబుతాడు. ఆ మాటల అర్థం తెలుసుకోలేని గోగోల్ మెల్ల మెల్లగా అమెరికా సంస్కృతిలో ఒదిగిపోతాడు. తన పేరు నిఖిల్ గా మార్చుకుని ఒక అమెరికన్ యువతితో ప్రేమలో (డేటింగ్) పడతాడు. కొంత కాలం గడిచాక, తన తండ్రి మరణానంతరం గోగోల్ తన పేరు వెనుకనున్న అసలు అర్థం, విలువ తెలుసుకుంటాడు. తన సంస్కృతి మూలాలు వెతుక్కోవడం మొదలు పెడతాడు. మెల్ల మెల్లగా రెండు సంస్కృతుల మధ్య నలిగి పోయే సంఘర్షణల వైపు మళ్ళుతుంది చిత్రం. ఈ సంఘర్షణలకి ముగింపు ఏమిటి అన్నది తెరపై చూడాల్సిందే!

ఈ సినిమాలో పిల్లల మానసిక అనిశ్చితే కాదు, తన మాతృదేశపు సంస్కృతిని వదులుకోలేక, కొత్త సంస్కృతిలో ఇమడలేక వాటి రెంటి మధ్యా కొట్టుమిట్టాడే పెద్దల మానసిక స్థితీ ఈ చిత్రంలో అద్భుతంగా చిత్రీకరించబడింది.

అశోక్ గంగూలీ గా ఇర్ఫాన్ ఖాన్ ప్రత్యేకమైన బెంగాలీ యాసతో అత్యద్భుతమైన నటన ప్రదర్శించాడు. ఇహ టాబు సరే సరి.అషిమాగా తన పాత్రకి జీవం పోసింది. కొన్ని సన్నివేశాల్లో ఆస్కారు అవార్డు అర్హత కలిగిన అద్వితీయమైన నటనని ప్రదర్శించింది. అషిమా పాత్రలో టాబూని తప్ప వేరొకర్ని ఊహించుకోలేము. అంత సున్నితంగా ప్రేక్షకుల హృదయాలని తాకుతుంది. గోగోల్ గా కాల్ పెన్ పదికాలాలు నిలిచేటట్లుగా ఆ పాత్రలో కలిసిపోయాడు.ఒక అమెరికన్ పిల్లాడిలా ప్రత్యేకమైన మేనరిజంస్, మాటల పద్ధతినీ పాటిస్తూ, అమెరికఆలో పెరీగే ప్రవాస భారతీయుల పిల్లలు ఇలాగే ఉంటారా అన్నట్లుగా నటించాడు, కాదు జీవించాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ముగ్గురూ ఈ సినిమా స్థాయిని మరింత పెంచారనడంలో సందేహంలేదు.

సహజమైన సెట్టింగులు,తమ తమ సంస్కృతిని ప్రతిబింబించే రంగురంగుల దుస్తులతో, అద్భుతమైన ఆహార్యంతో మీరానాయర్ ప్రతిభ ప్రతీ సన్నివేశంలో కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

తన భర్త మరణాన్ని పంచుకోవడానికి దగ్గరలో ఒక్క వ్యక్తీ కనబదక అషిమా తన ఒంటరితనాన్ని చూపించే సన్నివేశం, తన తండ్రి మరణాంతరం గోగోల్ తన పేరులో విలువని గుర్తించే సన్నివేశం, తన అమెరికన్ స్నేహితులకీ, బంధువులకీ ఇచ్చే వీడ్కోలు ప్రసంగ సన్నివేశం ప్రతీ ప్రేక్షకుడ్నీ కదిలిస్తాయి, కంట తడి పెట్టిస్తాయి.

సాధారణంగా పలకడం కష్టమవుతుందనీ, ఎంతో నూన్యతా భావంతో చాలామంది ప్రవాస భారతీయులు తమ పేర్లు మార్చుకోవడం కద్దు.అలా చేసే ప్రతీ ప్రవాస భారతీయుణ్ణి ఈ సినిమా కాస్తంతైనా ఆలోచింపచేస్తుందనడంలో సందేహం లేదు.

ప్రవాస జీవితంలో ఒడిదుడుకులనీ, సంఘర్షణలనీ అద్దం పట్టేలా చూపిస్తుందీ చిత్రం. అమెరికా జీవతం అంటే డాలర్ల మయమే కాదు, ఆ డాలర్ల గుట్ట క్రింద ఎన్ని కుటుంబాల మానసిక వేదనలూ సంఘర్షణలూ, అనుభవాలూ కష్టాలూ ఉన్నాయో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ప్రతీ ప్రవాస భారతీయుడే కాదు, ప్రవాసంలో తమ తమ బంధువులు ఉన్న ప్రతీ భారతీయుడూ చూడాల్సిన ఈ మంచి చిత్రం ఇది.

ముఖ్యంగా భావ దారిద్ర్యంతో కథలు లేక పాత చింతకాయ పచ్చడి కథలతో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినిమా తీసే ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం. కరువవుతున్నది కథలు కాదు.కదిలించే కథలని చూడలేని అజ్ఞానపు తెలుగు సినీ రంగం దృష్టి లోపానిది. ఒక మంచి సినిమా తీయాలంటే ఎంత కృషి అవసరమో తెలియచెప్పే సినిమా ఇది. మూడు వారాల్లో మూడు మైళ్ళ రీళ్ళని ప్రేక్షకుల మెడకి చుట్టడం కాదు సినిమా అంటే అని చాటి చెప్పే సినిమా! ఇలాంటి సినిమాలు చూసయినా సగటు తెలుగు రచయితలు స్ఫూర్తి పొందితే మంచిదే!

ఒక్క నవలని సినిమాగా మలిస్తే, సినిమా గొప్పదా, నవల గొప్పదా అని చెప్పడం ఎవరికైనా కష్టమే! కానీ నా ఓటు రెండింటికీ.


పూర్తిగా చదవండి