శివరాత్రి పర్వదినం సందర్భంగా, (దాటిపోయిందనుకోండి, అయినా పరమేశ్వరుణ్ణి తలుచుకోటానికి వేళా పాళా అవసరమా ఏమిటి?) శివుణ్ణీ, పనిలో పనిగా శ్రీనాథుడినీ తలుచుకున్నారు ఇద్దరు బ్లాగ్మిత్రులు. ఉభయతారకంగా అటు పుణ్యము, పురుషార్థమూ. శుభం! ఇదే పని నేనూ చేద్దామని, తెలిసిన పద్యాలూ, వాటి గురించి ఆలోచిస్తే, చప్పున తోచిన పద్యం ఇదీ. తెనాలి రామకృష్ణ .... కాదు కాదు తెనాలి రామలింగకవిది.

తరుణ శశాంక శేఖర మరాళమునకు
సార గంభీర కాసారమగుచు
కైలాస గిరినాథ కలకంఠ భర్తకు
కొమరారు లేమావి కొమ్మయగుచు
సురలోక వాహినీధర షట్పదమునకు
ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు
రాజరాజప్రియ రాజకీరమునకు
మానిత పంజర స్థానమగుచు

ఉరగవల్లభ హార మయూరమునకు
చెన్ను మీఱిన భూధర శిఖరమగుచు
లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి
అద్రినందన బొల్చె విహారవేళ

నిండు యవ్వనంలో ఉన్నాడు మన రామలింగడు. చక్కని భార్య (కమల), ముచ్చటైన ఒక్కగానొక్క సంతానం, మాధవుడు. అప్పటికి తన కేరాఫ్ అడ్రెస్ తెనాలే. తెనాలి రామలింగేశ్వర స్వామి వరప్రసాదం కాబట్టి ఆయన పేరే కొడుక్కు పెట్టుకుని మురిసిపోయాడు గార్లపాటి రామన్న మంత్రి (తెనాలి రామలింగడి తండ్రి). స్వతహాగా శైవుడు. నందవరీకుల నియోగి బిడ్డ. చిన్నవయసు లోనే అపరిమిత పాండిత్యం సాధించేడు. కుమారభారతి అనిపించుకున్నాడు. సరే, అంతా బావుంది, అయితే అప్పటికి తన కష్టాలింకా గట్టెక్కలేదు. ఇంట్లో నూకలు నిండుకున్నాయి. తనేమో ఓ కావ్యం వ్రాయాలని పట్టుబట్టి అహోరాత్రాలు కృషి చేస్తున్నాడాయె. కావ్యం పూర్తయ్యే వరకూ ఎటూ కదలరాదని పంతం. అయితే సంసారం నడవాలిగా. ఇక తల్లి కలుగజేసుకుంది. "నాయనా, రామయ్య, తాటాకులు తేరగా వచ్చాయని ఎడతెరిపి లేకుండా అలా రాస్తూ కూర్చుంటే ఎలారా? పెద్ద పండుగ దగ్గరవుతుందిరా అబ్బాయ్. నీకు పట్టకపోతే మానె, కనీసం బిడ్డకైనా కొత్తబట్టలు పెట్టాలి కదరా. నీ కవిత్వాన్ని ఊరి పెద్ద రావూరి రంగారావు గారికి వినిపించి, సంసారం గట్టెక్కించరా" అంది. ఇక తప్పనిసరై, తన కావ్యం "ఉద్భటారాధ్య చరిత్రం" లో పై పద్యాన్ని ఏరి వినిపించాడు రంగారావు గారికి. రంగారావు గారేమో పాపం ఈ పద్యం లో వర్ణనలు జీర్ణించుకోలేకపోయాడేమో, " బాబూ నలుగురూ మెచ్చని రకంగా ఇలా వర్ణనలు గుప్పిస్తూ, సమాస భూయిష్టంగా రాస్తే వ్యర్థం" అని తేల్చేసేడు. అదే మంచిదయ్యింది రాముడికి. విద్యానగరానికి ప్రయాణం కట్టేడు. లింగడు కాస్తా కృష్ణుడయ్యేడు. రాయల వారి సభలో ఓ జటిలమైన సమస్యకు పరిష్కారం సూచించి, రాయల ప్రాపకం సంపాదించేడు. ఇన్ని వందల యేళ్ళ తర్వాత కూడా తెలుగు వాళ్ళ (తెలుగేమిటి, మొత్తం భారతదేశం అంతానూ) నోళ్ళలో నానుతున్నాడు.

ఆ పద్యం అర్థం ప్రయత్నిద్దామా?

శివపార్వతులిద్దరు హిమగిరి సానువులలో విహరిస్తున్నారు. ఆ విహార సమయంలో, లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి, పార్వతీ దేవి, పరమేశ్వరుడి పక్కన ఎలా (ఒప్పి) ఉన్నదంటే -పున్నమి చంద్రుని వంటి శేఖరమనే హంసకు మంచి నీటితో కూడిన లోతైన సరస్సు లాగా, కోకిల కూజితం లాంటి కంఠస్వరం ఉన్న భర్తకు, లేమావి కొమ్మ లాగా, సురలోకవాహిని - అంటే గంగ - గంగాధరమనే భ్రమరానికి, ప్రాతః కాలంలో పూచిన తామర లా (పొద్దున పూచిన పూలలో తేనె మెండుగా ఉంటుంది కదా), రాజరాజు (చంద్రుడికి రాజు) అనబడే రామచిలుకకు తనై తను ఒప్పుకుని చేరుకున్న పంజరంలా (మానిత పంజర స్థానము), ఉరగాన్నే హారంగా ధరించిన ఈశ్వరుడనే నెమలికి ఎత్తైన పర్వత సానువు లాగా (నెమళ్ళు పర్వత సానువులనే ఎక్కువ ఆశ్రయిస్తాయి కాబోలు).....ఇలా ఉందట.

(పైన అర్థం లో పొరబాట్లు విజ్ఞులు సవరించగలరు)

మామూలుగా మనం, ఔచిత్యం అనే పదం వాడుతుంటాం. ఆ ఔచిత్యం అంటే ఏమిటో బాగా అర్థం అవుతుంది ఈ పద్యం ద్వారా. మామూలుగా శివుడి రంగు తెలుపట, కాబట్టే తరుణ శశాంక శేఖర మరాళమయ్యాడు. ఆ తెలుపు రంగు శివయ్యకు కంఠం మాత్రం నలుపు. విషం మింగాడుగా. మరందుకే కైలాస గిరినాథ కలకంఠ భర్త అయ్యాడాయన. ఇక అమ్మవారో - లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి. భర్త కు తగిన ఇల్లాలు. అందుకే కాబోలు చిఱ్ఱు బుఱ్ఱులాడే ప్రియురాలిలాగా కాకుండా - అంటే - కలహంసకు కాసారంలా, కోకిలకు లేమావికొమ్మలా, తేనెటీగకు కంజాతంలా, రామచిలుకకు ఇష్టపడి బంధించుకున్న పంజరంలా ...ఇలా అందంగా, అనుకూలంగా ఉన్నది భర్త పక్కన.

ఆ శివయ్యా, లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి అమ్మవారు - బ్లాగ్లోకానికి శుభములు చేకూర్చు గాక!

(తెనాలి రామకృష్ణ సినిమాలో దృశ్యానికి, ముత్తేవి రవీంద్రనాథ్ గారు తెనాలి రామకృష్ణ కవి మీద వ్రాసిన సమగ్ర గ్రంథంలో కొన్ని అంశాలని జోడించి, కొంత ఊహతో రాసిన టపా ఇది)
పూర్తిగా చదవండి