బాబు మహానాడులో మళ్ళీ "నగదు బదిలి" పధకం ఆ విధంగ ముందుకి తీస్కెళ్ళాలి అని తెలియజేస్కున్నాడు.

మొన్న వోట్ల కౌంటింగ్ జరుగుతున్నప్పుడు, టివీ9లో జరిగిన డిస్కషన్స్లో పాల్గున్న ఒకడు ఇలా ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు పక్కనున్న తెదెపా ప్రతినిధిని -
నగదు బదిలి ఎలా సాధ్యం, 20000 కోట్లు కనీసం కావాలి ఆ పధకానికి అని.
ఒక్కసారి చూద్దాం. మన రాష్ట్ర జనాభా ఈ రోజున పది కోట్లు.
నాయుడు గారి ప్రకారం,
ప్రతీ నిరుపేద బడుగు కుటుంబానికి నెలకి పదిహేను వందలు.
ప్రతీ మధ్యతరగతి కుటుంబానికి వెయ్యి నెలకి.
సగటున, మన జనాభాలో పదిశాతం మంది అట్టడుగు నిరుపేదలు ఉన్నారు అనుకుందాం. అనగా, కోటి మంది. అనగా
10000000 * 1500 = 1500 కోట్లు, నెలకి. అనగా, సంవత్సరానికి, 18000 కోట్లు.
మిగిలిన తొమ్మిది కోట్లల్లో ఐదు శాతం మధ్యతరగతి కుటుంబాలు అనుకుందాం.
అనగా 45 లక్షల మంది. అనగా 4500000 * 1000 = 450 కోట్లు. అనగా సంవత్సరానికి 5400 కోట్లు.
మొత్తానికి 23400 కోట్లు కావాల్సొస్తుంది కేవలం నగదు బదిలీకి, సంవత్సరానికి. ఇంత కేటాయించాలంటే వార్షిక బడ్జెట్ ఎలా ఉండాలో?
ఇప్పటికే, గత నాలుగు బడ్జెట్లని తీస్కుంటె దాదాపు ప్రతీ ఏడాది లక్ష కోట్లు దాదాపు (ప్లాన్డ్ మరియూ నాన్ ప్లాన్డ్ కలిపి). మరి పైన 23400 కోట్లు దేంట్లోంచి కోస్తారు, ఎక్కడ సర్దుతారు? ఎలా సర్దుతారు?
నా ప్రశ్న బాబుని ఉద్దేశించి కాదు. నా ప్రశ్న బాబు కింద ఉన్న ఎం.ఎల్.యే లకి, ఆయన వెనకున్న బిజినెస్ వర్గానికి, ఆ ఎం.ఎల్.యే లని నమ్ముకుని ఎంతోకంత ఎనకేద్దాం అనుకునే జాతికి.
కారణం -
ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నా కళ్ళ ముందు జరిగిన కధ ఇది.
ఒకానొక సంవత్సరం, తుపాను వచ్చింది. కొన్ని గుడిసెలు కూలినై. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గుడిసెలు నీళ్ళల్లో మునిగినై. వెంటనే ప్రభుత్వం సహాయ ప్యాకేజీ ప్రకటించింది. గోడకూలితే ఇంత, ఇల్లే కూలితే ఇంత, నీళ్ళు మోకాళ్ళలోతు వస్తే ఇంత యాట యాట యాట.
ఒకడు ఒక నోటుబుక్కు తీస్కుని వచ్చాడు, ఓ కుర్చీ ఏస్కుని ఓ ఇంటో కూర్చున్నాడు. రూలింగ్ పార్టీ కార్యకర్తలు వచ్చారు. ఆళ్ళకి తెల్సినోళ్ళ పేర్లు చెప్పుకున్నారు. ఏ కేటగిరీకి ఎక్కువ మొత్తం వస్తుందో దాంట్లో వాళ్ళోళ్ళ పేర్లు రాయించుకున్నారు. బయట నిజంగా ఆస్తి నష్టం ఐనోళ్ళకి ఎంగిలి చెయ్యిని విదిల్చారు. కొందరు నిజంగా ఆస్తినష్టపోయినోళ్ళకి ఇలా ప్యాకేజీ ఇస్తున్నారు అని తెలియనుకూడా తెలియదు.
ఐతే, ఈ తంతు కొత్తేమీ కాదు, ఓ పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని కూడా లేదు ఈ వ్యవహారంలో. ఏ పార్టీ రూలింగులో ఉన్నా ఈ తంతు జరిగేదే. ఇప్పుడు ఈ నగదు బదిలీ పధకం గురించి దేనికయ్యా అంటే ఇది డైరెక్ట్ క్యాష్ ఫ్లో. అభ్యర్దిల్ని ఎవరు ఎంపిక చేస్తారూ? వాళ్ళ ఆదాయాన్ని ఎవరు కొలుస్తారూ? ఏ ప్రాతిపదికన? ఒక సర్టిఫికేట్ పెడితే సరిపోతుందా, అయ్యా నా ఆదాయం నెలకి ఇంత, కావున నేను పేద బడుగుని అని. ఆ సర్టిఫికేట్ సంపాదించటం ఎంతసేపు?
మనకి కావాల్సింది పేదోడికి నెలకి పదిహేనువందలు సంపాదించుకునే ఉద్యోగం చూపించగల ప్రభుత్వం, నాయకత్వం, దార్శనీకత. అంతే కానీ వందకే నెలకి సరిపడా సరుకులు, కిలో బియ్యం రెండు రూపాయలకే, ప్రతీ పేదోడికి టీవీ, ప్రతీ మధ్యతరగతి మహిళకు నెలకి వెయ్య కాదు.

ముగింపు -
రాబోయే తరాల్లో అయినా, రాజకీయనాయకులు, అధినాయకులు, కారకులు, నిర్మాతలు - ఎవ్వరైనా -
కిలో రెండుకే ఇస్తాం కాకుండా - మన ఆర్ధిక వనరుల్ని నియంత్రించుకుంటూ, రెండురూపాయల యొక్క విలువని అంత ఎత్తుకి తీస్కెళ్ళగలిగే విప్లవాత్మక నిర్ణయాలు తీస్కోవాలని కోరుకుంటా.
వందరూపాయలకే సరుకులొచ్చే విధంగా మన ఆర్ధిక వ్యవస్థ రూపొందించాలని కోరుకుంటా.

పూర్తిగా చదవండి