ముప్పైరెండో వారం చదువు ముచ్చట్లు జ్ఞానప్రసూనగారితో…
చదువు ముచ్చట్లు June 29th, 2009
ప్రతి ఇంట్లో హడావిడీ జీవితం ఐపోయింది. చదువు, ఉద్యోగాలు అంటు పరుగులెత్తడం. ఉమ్మడి కుటుంబాలు కావు. మంచి మాటలు చెప్పే పెద్దవాళ్లు లేరు. మరి జీవిత ప్రయాణంలో తగిలే ఒడిదుడులు , ఆటుపోట్ల సమయంలో బామ్మ, అమ్మమ్మ తప్పక గుర్తొస్తుంది కదా. మరి ఆ బామ్మ కూడా మనతో సమానంగా కంప్యూటర్ ముందు కూర్చుని బ్లాగు రాస్తుంటే ?? ఈ ఆలోచన వింతగా ఉందా. కాని 70 ఏళ్లకు పైబడ్డ జ్ఞానప్రసూనగారు చురుగ్గా , క్రమం తప్పకుండా సురుచి అనే బ్లాగును నిర్వహిస్తున్నారు. ఆ బ్లాగు టైటిల్ తగ్గట్టే ఎప్పుడూ మంచి ఆలోచనలే చేయండి. ఎన్నో మంచి మాటలు చెప్తారు. అమెరికాలో ఉన్న పిల్లల దగ్గరకు వెళ్ల్నప్పుడు, అక్కడ వాళ్లందరు ఏదో చిన్న పెట్టి పట్టుకుని టక్కు టక్కుమంటూ ఉంటారు. బోర్ కొడుతుంది అంటే కొడుకు తెచ్చిచ్చిన లాప్ టాప్ తో కష్టపడి టైపింగ్ నేర్చుకుని పిల్లల సాయంతోనే బ్లాగు మొదలెట్టి , తనకు తెలిసిన ఎన్నో మంచి పద్యాలు, కథలు, పురాణా విశేషాలు చెప్తుంటారు. బ్లాగ్ అంటే ఆలోచనా తరంగం.ఇది ఇంత పరిధిలోనే వుండాలి, ఈవిషయం పైనే వ్రాయాలి అనే నియమం లేదు. ఒక్కొక్క తరంగానికి ఆలోచనా రూపం ఇవ్వడమే! ఒక వర్ణన, ఒకడైరీ, ఒక ఆశ్చర్యం, ఒక ఆనందం, ఒక పొగడ్త, ఒక వేదన. ఏదైనా కావచ్చు. దీనిలో అంతస్సూత్రంగా ఒక గొంతు వుంటుంది. అది స్వానుభవాలని, అభిప్రాయాలని, ఆశని వెలువరిస్తుందనే మాట ప్రతి బ్లాగరూ ఒప్పుకుంటారు. అమెరికా కనిపెట్టనేలా?పెట్టితిరిబో మనవాళ్ళు వెడలనేలా?వెడలితిరిబో వెనుకకు రాకపోనేలా? అడుగంటెన్ బామ్మల ముద్దుముచ్చటల్! అంటూ విదేశాలనుండి వచ్చిన మనవడు వెళ్లిపోయాక ఆవిడ పడ్డ బాధ అందరికీ బాధ కలిగిస్తుంది. ఉద్యోగాలు చదువుల వేటలో వెళ్లినవారి బామ్మలు, అమ్మమ్మలు అందరూ ఇలాగే బాధపడతారేమో…
ఇలా వివిధ అంశాలపై, మంచి మంచి మాటలు అందించే జ్ఞానప్రసూన గత ఏడవ, ఏనిమిదవ దశకంలో పత్రికా పాఠకులకు సుపరిచితుడైన రావూరి వెంకట సత్యనారాయణగారి కుమార్తె. మరి ఈ వారం ఈమె చదువు ముచ్చట్లు వినండి…
1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)
రెండు పేజీలు చదవగానే తెలిసిపోతుంది. తప్పుకుంటాను. రచయితా(త్రి) పేరు కూడా గుర్తుపెట్టుకోను.
2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?
పిలక గణపతి శాస్త్రి గారి “హేమపాత్ర”.
3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?
ఒకప్పుడు నాలుగు అలమరా నిండా పుస్తకాలు ఉండేవి. ఈ మధ్యే చాలా పుస్తకాలు ఇచ్చేశాను. ప్చ్.అలమరాలన్నీ బక్కచిక్కిపోయాయి..
4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?
వాజపేయిగారి 51 కథలు.
5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.
లత , రంగనాయకమ్మ, మునిమాణిక్యం, పురాణం సీత, వేదుల శకుంతల, మాలతి చందూర్, చలం, బుచ్చిబాబు, ముక్తేవి భారతి.
6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?
నా పుస్తకాలు, నాన్నగారివి ఇచ్చాను. అలాగే నాకు నేను రెండు పుస్తకాలు బహుమతిగా ఇచ్చుకున్నా.
7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?
నవ్య, ఋషి పీఠం, దివ్యధాత్రి, ఆంధ్రభూమి మాసపత్రిక, స్వాతి మాసపత్రిక, దైవం, ప్రమిద, కౌముది.
9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?
ఇప్పుడేమీ లేదు.
10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?
శరత్ సాహిత్యం.
11. ఆనాటి , నేటి రచనల మీద మీ అభిప్రాయం ?.
ఆనాటి రచనలు, సంప్రదాయ సిద్ధంగా, కొన్ని హద్దులలో, చక్కని భాషలో ఉండేవి. కొంత శాతం ప్రజలు చదివేవారు. రాను రాను సామాజికమైన మార్పులు జరిగాక, భాషాపరంగానూ, తీసుకునే అంశాలలోనూ మార్పులు వచ్చాయి. చదువు అందరికి అందుబాటులోకి వచ్చాక, స్వతంత్ర భావాలతో రచనలు ప్రజల దగ్గరకు నడిచాయి. రచన అనే వృక్షం కొమ్మలు , రెమ్మలు వేసి, కొత్త కొత్త పుంతలు తొక్కింది. పుస్తక సంపద పెరిగింది, రచన పల్చబడింది. రచయితకి కావలసిన సౌకర్యాలన్నీ ఇచ్చి,మీకిష్టమైనపుడు ఏదైనా రాయండి అనే పరిస్థితి రాజుల కాలంలో ఉండేదేమో. సాహిత్యంతో వ్యాపారం చేయడం, దానితోనే జీవితంలో డబ్బు సంపాదించుకోవాలి అనే వత్తిడి రావడంతో రాయక తప్పదు అని రచనలు చేస్తున్నారు. మనసులో భావాలు సుళ్ళు తిరిగి ఇక రాయకపోతే నిలువలేను రాయక తప్పదు అన్నప్పుడు చేసే రచనకి, ఈ టైముకి , ఈ పద్ధతిలో ఇన్ని పేజీలు రాయాలి అన్నపుడు చేసే రచనకి తేడా తెలుస్తుంది. ఒక ఆశయం కోసం, ఒక నీతి కోసం, ఒకే దారిలో భాషను పోషించుకుంటూ పటిష్టమైన అంశాలతో , వాకృనచాని భావాలతో చేసిన రచన ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. సామాన్య ప్రజకి తెలిసేలా రచన చేయాలంటే భావదారిద్యము, భాషా పఠనం కాకూడదు. అందుకే రాశిగా వస్తున్నా రచనలలో వాసి కెక్కేవి కొన్నే అనుకోవచ్చు.
12. మంచి రచన ఎలా ఉండాలి అంటారు ?
రచన చదివితే ఉత్సాహము, ఉద్వేగమూ కనిపించాలి. అది చదువుతుంటే కూర మాడిపోతున్నా గుర్తు రాకూడదు
. ఊహాలోకంలో ఉన్నా,కాస్త వాస్తవమూ ఉంది, ఓహో ఇది ఇలా జరిగే అవకాశమూ ఉంది అనిపించాలి. మనిషిని ఉన్నత స్థితికి చేర్చాలి కాని పతనానికి దారి వేయకూడదు. సాహిత్యమూ, సినిమాలూ, టీవీ లు మనుష్యులపై ముఖ్యంగా యువతరంపై ఎనలేని ప్రభావం చూపిస్తాయి. అది దృష్టిలో పెట్టుకుని రచనలు చేయాలి. బంధుత్వాలను, మానవతను, సేవను, లలితకళలను , శ్రమలోని విలువను తెలిపే రచనలు రావాలి.
.. .. .. .. .. .. .. .. .. .. .. ..
(ఈ ఇంటర్వ్యూ తీసుకున్నదీ, పరిచయం రాసిందీ జ్యోతి వలబోజు గారు. అక్కయ్యకు కృతజ్ఞతలు.)
Posted in చదువు ముచ్చట్లు
పూర్తిగా చదవండి