కొత్త చిగురు, చెరసాల కథల పై అంపిరాల సత్య ప్రసాద్ గారి రివ్యూ
కథలు, చలం, స్త్రీవాదం July 27th, 2009కొత్త చిగురు, చెరసాల కథల పై అంపిరాల సత్య ప్రసాద్ గారి రివ్యూ నాకు ఈమెయిల్ ద్వారా అందింది.
>>>>>
ప్రవీణ్‌గారు,
మీ కథలను పరిచయం చేసినందుకు నెనర్లు. మీరు వ్రాసిన చెరసాల, కొత్త చిగురు
చదివాను. వాటి గురించి నా అభిప్రాయం చెప్పమన్నారు కదూ.. అందుకే ఈ టపా..!!
నిజానికి మీ కథలలో వస్తువు కొంచెం రాడికల్‌గా వున్నాయి. (కొత్త చిగురులో
శాండిల్య చెప్పిన రచయితలు మీ ఫేవరెట్ రచయితలనుకుంటాను.. ముఖ్యంగా చలం.)
ఇలాంటి కథలు వ్రాయాలంటే ఎంతో దమ్ము ధైర్యం కావాలి.. అలాగే ఇలాంటి కథను
చదివిన వాళ్ళు మీరు చెప్తున్న దృష్టికోణంలో అర్థం చేసుకోవాలంటే కథ వ్రాసే
శైలి మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. లేకపోతే బ్యాక్‌ఫైర్ అయ్యే అవకాశం
వుంటుంది. మీరు వ్రాసిన వాటిలో కేవలం కథ చెప్పారు అంతే.. కథకుడిగా మనం
అవతలి వ్యక్తిని కథలోకి తీసుకెళ్ళాలి.. అది మీ కథలలో జరగలేదు.
అందుకు ముఖ్యంగా నాకు కనిపించిన లోపాలు:
1. నాటకీయత: కేవలం సినాప్సిస్ వ్రాసినట్టు కాకుండా కథలో సన్నివేశాలు,
డైలాగులతో నాటకీయత సృష్టంచడం చాలా అవసరం. (మీ కథలలో కొటేషన్స్ “..” చాలా
తక్కువగా వాడారు. ఇవెంత ఎక్కువగా వాడితే అంత నాటకీయత పెరుగుతుంది.)
వుదాహరణకి చరసాల కథలో ఆ అమ్మాయి తండ్రిపాత్ర సత్యప్రసాద్‌తొ పెళ్ళి
సంబంధం గురించి మాట్లాడుతూ – “అమ్మాయి కష్టం చేసి సంసారాన్ని
ఈదుకొస్తోంది.. ఇలాంటి ఆర్థిక స్థితిలో కూతురికి కట్నం ఇవ్వలేనని మీకు
వేరే చెప్పాలా.. ” అంటూ పగిలిపోయిన అద్దాలను తుడుచుకున్నాడు…. ఇలాంటి
డైలాగులు చెప్పిస్తూ వాళ్ళ ఆర్థిక స్థితి గురించి చెప్పచ్చు. మీరు నరేట్
చెయ్యాల్సిన పనిలేకుండా..
2. శైలి: ఇది బాగా రావాలంటే చాలా ప్రాక్టీస్ చెయ్యాలి. ఎంత ఎక్కువ
చదువగలిగితే అంత మంచిది. యండమూరి ” పాపులర్ రచనలు చెయ్యడం ఎలా?” చదవండి.
అంతర్జాలంలో నిడదవోలు మాలతిగారు, వసుంధరగారు, మురళీ కృష్ణగారు రచన
చెయ్యాల్సిన విధానం గురించి అప్పుడప్పుడు వ్రాస్తున్నారు. అలాంటివి
చదవండి. రచన, కౌముది, పొద్దు వంటి మంచి పత్రికలలో వచ్చే కథలు – అనేక
పత్రికలలో వచ్చే బహుమతి పొందిన కథలు చదవండి – ఒక పాఠకుడిలా కాకుండా ఒక
ఔత్సాహిక రచయితలా చదవండి.
3. పోగా పోగా పాత్రలు సృష్టించడంలో నేర్పు కూడా దానంతట అదే వస్తుందని
అనుకుంటున్నాను.
ఇవన్నీ ఒక రచయితగా నా రచనలలో కూడా వుండాలని అనుకుంటూ వుంటాను కాబట్టి
మీకూ చెప్పాను. అక్కడికి నా రచనలు ఏదో పర్ఫెక్ట్ అనికాదు..!! విజయీభవ..!!
అరిపిరాల సత్యప్రసాద్
>>>>>
సత్య ప్రసాద్ గారి విమర్శలో కొంత వరకు నిజం ఉంది అనిపిస్తోంది. ఎందుకంటే నేను పాత్రల చేత డైలాగులు ఎక్కువ చెప్పించి నరేషన్ తక్కువ చెప్పి ఉండాల్సింది. అలాగైతేనే పాత్రలలో జీవకళ ఎక్కువ కనిపిస్తుంది. సలహా ఇచ్చినందుకు అభినందనలు.
పూర్తిగా చదవండి