ఈ టపా మొదటి భాగంలో రాసిన మాటల్లో రామోజీరావు వ్యాపార వ్యవహార సరళి గురించి ప్రస్తావించినప్పుడు ‘పచ్చళ్లు అమ్ముకోవడం’ అని రాసినందుకు పాఠక మిత్రులు బాధపడ్డారు. నిజమే. అది నా తప్పిదం. అలా రాసి పచ్చళ్లు అమ్ముకున్న వాళ్లను అవమానించడం డీఫాల్ట్ మిస్టేక్ గా జరిగింది. దానికి పచ్చళ్లతో సహా, పేపర్లు అమ్ముకుంటూ జీవిక పొందుతున్న నా దేశ సోదరులందరికీ క్షమాపణలను కోరుతున్నాను. అదేం చిత్రమో గాని, మా జిల్లాలో పచ్చళ్లు మా జిల్లావాసులెవరూ అమ్ముకోరు. ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలనుంచే సైకిళ్లమీద వచ్చి అమ్ముకుంటారు. ఒకసారి నా మిత్రుడు ప్రసాద్ వీరిగురించే ప్రస్తావించారు. పచ్చళ్లు, మామిడి తాండ్ర, లేదంటే ఒక నలభై వేల రూపాయలు తెచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకునే కోస్తా బీద ప్రజల జీవనతెరువు గురించి చెప్పినప్పుడు నేను మూడొందలు సంవత్సరాల వెనక్కి చరిత్ర పేజీలు తిప్పవలసివచ్చింది — నిజానికి అదే కలొనియల్ రూల్ ఎస్టాబ్లిష్ చేసే విధానమని. ఇంగిలీషు దొరలకు ముందరే బుడతకీచులు, పోర్చుగీసులు, కిరస్తానీలు మనదేశానికి ఇలానే వచ్చారు. వ్యాపారం పేరుతో మొదలైన వ్యవహారం ఎక్కడిదాకా వెళ్లిందో మళ్లీ ఇక్కడ విడమరచక్కరలేదు.

నాలుగేళ్ల కిందట పొట్టచేత పట్టుకుని వచ్చిన ఏ కోస్తా సోదరుని పరిస్థితి అయినా శ్రీకాకుళమ్ జిల్లాలో వచ్చి చూడండి. వచ్చిన పని మొదటి సంవత్సరానికే మానుకుని, మరో పని, మరో పని మారుస్తూ నాలుగు రాళ్లు వెనక వేసుకోవడం గమనించవచ్చు. ఇంకా మరొక నమ్మలేని నిజం చెప్పమంటారా! శ్రీకాకుళం జిల్లాలో ఆపరేట్ చేస్తున్న మొత్తం మైక్రో ఫైనాన్స్ కంపెనీలన్నీ కోస్తా ప్రాంతపు సోదర వ్యాపారస్తులవే. ఇక్కడి గ్రానైట్ తరలించుకు పోతున్నమొత్తం ట్రాన్స్ పోర్ట్ వ్యాపారాలన్నీ కోస్తా జిల్లాల వ్యాపార సోదరులవే. ఇంకా ఈ మూడు జిల్లాలను ఆనుకునివున్న సముద్ర తీరప్రాంతపు మత్స్య సంపదనంతటినీ తరలించుకుపోతున్నదెవరో నేను చెప్పను. మీరెప్పుడైనా విశాఖపట్నం వచ్చినపుడు ఆర్ కె బీచ్ నుంచి భీమిలి వెళ్లే రోడ్డులో మీకూ సముద్రానికి మధ్యన కనిపించే సుమారు ఐదు వందల ఫిషరీస్ యూనిట్ల దగ్గర ఆగిఆగి దాని ఓనరెవరని అడిగి చూడండి. కనీసం ఒక్కటి అంటే ఒక్కటి ఈ మూడు జిల్లాలవారివి వుంటే వేరే వారిది వద్దు, నా చెప్పే తీసుకుని ఇలాంటి అర్థంపర్థం లేని విద్వేషపు మాటలాడి జనాన్ని చెడగొడుతున్న నా రెండు దవడలు వాయించేయండి. తన్నులు తినడానికి నేను సిద్ధం. నిజం చేదుగా వుంటుంది. కానీ అది నిజమని మర్చిపోకూడదు.

ఇట్లా బతుకుతెరువుకోసం వలసవచ్చిన వారు వచ్చినట్టు ఊరుకోకుండా వారు ‘ఒక రకమైన’ భావజాలాన్ని అక్కడి ప్రజలమీద రుద్దుతారు. అమెరికాలో రెడ్ ఇండియన్లపైన దారుణాలకు తెగబడినవారూ, ఆస్ట్రేలియా అబారిజన్ల గొంతుపైన కూర్చున్నవారూ, ఆఫ్రికాలో నీగ్రోలను దోచుకున్నవారూ, మనదేశంలో ద్రావిడులమీద దండెత్తిన ఆర్యులూ, నిన్నకాక మొన్న మనల్ని నిలువుదోపిడీ చేసిన బ్రిటిషువాడూ…ప్రదేశాలు వేరైనా పద్ధతి ఒకటే….విధానం ఎక్కడైనా కథనం ఒక్కటే…. వలసవాద ఆధిక్యతా భావనతో “నువ్వు సంస్కారం తెలియని అనాగరికుడివి. నేను నిన్ను ఉద్ధరిస్తున్నాను తెలుసా!” అనే భావన వారి నరనరాల్లో జీర్ణించుకుపోయుంటుంది. అది అక్కడి ప్రజలమీద రుద్దితే.. రుద్దితే.. రుద్దితే అక్కడ సీన్ కట్ చేసి ఇప్పటి మనల్ని చూసుకుంటే మనమెలా తయారయ్యామో తెలుస్తుంది. శ్రీకాకుళంలో ‘ఏమిటి’ అన్న పదం వాడం. ‘ఏటి’ అన్న పదమే వాడుతాం. పీజీలు చదువుకున్న మిత్రులు కూడా చిన్నపిల్లలు ఏటిరా అంటే అది తప్పని ఏంటిరా అని పలకమని జ్ఞానబోధ చేస్తుంటారు. అన్నట్టు ఈ ఏమిటి పదం శిష్టజన వ్యవహారం ఎలా అయింది? మళ్లీ మనం ఫ్రెంచ్ భాషా తత్వవేత్త ఫెర్డినాండ్ ససూరే మాటల్ని గుర్తు తెచ్చుకోవాలి.

ఒక భాషలో వివిధ మాండలికాల్లో బాగా నాగరకత ప్రబలిన ప్రాంతపు మాండలికంగాని, రాజకీయంగా ఆధిక్యతను పొందిన ప్రాంతపు మాండలికంగాని ప్రమాణ భాషగా ఆ భాషాప్రదేశమంతా చెలామణి అవుతుంది.”

భాష విషయంలో, ఆహారం విషయంలో, ఆహార్యం విషయంలో అందరికీ మన రాష్ట్రంలో ఒక భౌగోళిక ప్రాంతంవారే ఆదర్శం కావడం విడ్డూరం వరకే అయితే విచారించక్కర్లేక పోయేది. కానీ మిగిలిన భౌగోళిక ప్రాంతాలయిన తెలంగాణ, రాయలసీమ, కళింగాంధ్ర ప్రాంతాల వాడుకలు తక్కువ రకమైనవనే న్యూనత కోస్తా ప్రాంతవాసుల్లోనే కాక రాష్ట్రమంతటా రాజ్యమేలడానికి కారణాలు తేల్చడం ఎవరి వల్ల సాధ్యం! అందులోనూ ప్రస్తుతం ఎమోషనల్ గా బాగా డిస్టర్బ్ గా వున్నాం కూడా.

కాస్తా మన ఆవేశకావేశాలను కాసేపు పక్కనపెడదాం. అందుకని మన దేశంలోనో… మన రాష్ట్రంలోనో అంటే … మన అహాలు మనకు అడ్డువస్తాయి. అందుచేత పేర్లు మార్చి మాట్లాడుకుందాం. ఒక దేశంలో నాలుగు రాష్ట్రాలున్నాయి. ఒక రాష్ట్రంలో దగ్గర దగ్గర తొమ్మిది నదులు పారుతున్నాయి. మరో రాష్ట్రంలో దగ్గరదగ్గర పంతొమ్మిది నదులు పారుతున్నాయి. మొదటి రాష్ట్రం ఈరోజో రేపో ఎడారిగా మారనుండగా, రెండో రాష్ట్రంలో పంటలు పండక ప్రజలంతా వలసలు పోయి నిర్మానుష్యంగా తయారవుతోంది. మూడో రాష్ట్రం గుండా పారుతున్న నాలుగు చిన్నాపెద్దా నదులు నాలుగో రాష్ట్రం గుండా వెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి. అయితే ఈ భూప్రపంచం మీద నరమానవుడికి అర్థంకాని సంగతి ఏమిటంటే నదినీరు మూడో రాష్ట్రంగుండా పారుతున్నా అక్కడి ప్రజలకు పంటలు పండకో, పండించడం చేతకాకో గత ఆరు దశాబ్దాలుగా దరిద్రులుగా మిగిలిపోతుంటే, నాలుగో ప్రాంతం మాత్రం దేశంలోనే సంపన్నమైన ప్రాంతం కావడం. ఇది ఆఫ్రికాలోనో అరేబియాలోనో జరిగిందనుకుని తీర్పులు చెప్పండి సభ్యసామాజికుల్లారా!

నీరు నిలుపుకొని పంట పండించకపోవడం వారి చేతకానితనమనుకుని వారి మానాన వారిని వదిలేద్దామా? గడసరిగా నీరు వాడుకుంటున్న వీరి తెలివితేటల్ని చూసి ఉప్పొంగిపోదామా? ముందే చెప్పినట్టు, మొదటి, రెండు ప్రాంతాల ప్రజలకు అక్కడి నుంచి నీరే కాదు, గాలి కూడా రాదు. ఇది దోపిడీ చేస్తున్నవారికీ దోపిడీ కాబడుతున్నవారికీ మధ్య జరుగుతున్న రగడ. నువ్వూ నేనూ చేయాల్సింది ఒకటి – వారికి రెండు మూడు రెట్లు నదీప్రవాహాలున్నా ఎందుకిలా పంటలు పండక డొక్కలు మాడుతున్నాయని ఆలోచించడం. రెండు — న్యాయం వైపు నిలబడడం. అంతేగాని, ఎవడో వాయిస్తున్న నాదస్వరాలకు తలలూపడం కాదు. మన మనసులు ఇవ్వాళ కండిషన్డ్ అయిపోయాయి. అసలు మన మాటల్లోనే అది బోధపడుతుంది. నీ తిండిని ఎగతాళి చేసేవాడిని, నీ బట్టను ఎగతాళి చేసేవాడిని, నీ భాషను ఎగతాళి చేసేవాడిని, నీ పద్ధతులను ఎగతాళి చేసేవాడిని నీతో కలిపేసుకుని మురిసిపోతుంటే… నాకు గుంటూరు శేషేంద్రశర్మ మాటలే గుర్తుకొస్తున్నాయి. “ఒరేయ్, రూపాయి నలిపి వాసన చూపిస్తేనే అలా మూర్ఛపోతే ఎలారా!”

ఈ కండిషనింగ్ ఆరు దశాబ్దాల్లోనే ఎలా సాధ్యమైందని మరీ ఆశ్చర్యపోకండి. మినహాయింపులు లేకుండా మనకున్న తెలుగు దినపత్రికలన్నీ ఎవరివి? టీవీ ఛానెళ్లన్నీ ఎవరివి? మిగిలిన వార, మాస, సాహిత్య పత్రికలన్నీ ఎవరివి? మన సినిమా దర్శకులు ఏ ప్రాంతంవారు? నిర్మాతలు ఏ ప్రాంతంవారు? అగ్ర నటులు, రచయితలు, ఇతల విభాగాల నిపుణులు ఏ ప్రాంతం వారు? అందుకే ప్రజాకవి కాళోజీ ఇలా అంటారు: ”కళారాధకులు ఒకచోట – కళాపోషణమొకచోట, వాసననూనెలొక చోట – మాసిన తలలింకొకచోట” అని. కండిషనింగ్ అవ్వదంటే అవ్వదా మరి. అసలు పత్రికలు, టీవీలు, సినిమాలు మనుషుల భావజాలాన్ని కండిషనింగ్ చేయగలవా అనుకునే అమాయకులంతా తాజా తెలుగు రాజకీయ చరిత్రలో ఈనాడు దినపత్రిక ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఎలాంటి ఫ్రిక్షన్ లేకుందా అధికార మార్పిడి జరపడంలో విజయం పొందడమూ, అదే పత్రిక వైఎస్ ను మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలవ్వాలని చెమ్చాలతో కాకుండా కడవలతో పాఠకుల బుర్రల్లో విషాన్ని పోసి తానే పరాజయం పాలవ్వడం ప్రత్యక్షంగా చూసిందే. సాహిత్య ఉదాహరణలివ్వాలంటే జార్జి ఆర్వెల్ తన “1984″ నవలలో ఈ ప్రక్రియ గురించి విపులంగానూ వర్ణించడం చూడొచ్చు.

నీళ్ల సంగతి ఒక్కటి రాసి దోపిడీ అంటే ఎవరికైనా కోపం వస్తుంది. రాష్ట్రంలోనే కాక దేశంలోకూడా చాలా థర్మల్ పవర్ ష్టేషన్లకు బొగ్గును సరఫరా చేసే తెలంగాణ మాత్రం తాను చీకట్లోనే ఎందుకు మగ్గాల్సివస్తోంది. దీని గురించి కోస్తావాళ్లను ఏమీ అనడానికి లేదు. మన పాలకుల మరగుజ్జు మనస్తత్వం వల్ల జరుగుతున్న అనేకానేక తతంగాలలో ఇదొకటి. రాష్ట్రప్రభుత్వానికి వచ్చే హైదారాబాదేతర తెలంగాణ ప్రాంతానిది అధిక వాటా అయినప్పటికీ తిరిగి వాటాల పంపిణీలో ఎవరికి దక్కుతుంది ఎంతెంతో తేల్చేముందర రాయలసీమ, కళింగాంధ్ర ప్రజలు ఆ లెక్కల జోలికి పోకపోవడమే మంచిది – కనీసం మనసన్నా ప్రశాంతంగా వుంటుంది. ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఆ రోజు మద్రాసు నుంచి ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడానికి ఏయే కారణాలు మూడుకోట్ల ఆంధ్రులు చెప్పారో, ఈ రోజు అవే డిమాండ్లతో నాలుగుకోట్ల మంది తెలంగాణ ప్రజలు స్వపరిపాలన కోసం నినదిస్తున్నారు.

…ఇంకా వుంది


Filed under: Uncategorized
పూర్తిగా చదవండి