సాయి భక్త శిఖామణులు - భగత్ మహల్సాపతి – 5

ఈ కలియుగంలో బాబా అంతటి దయామయుడు, కరుణా సముద్రుడూ అయిన యోగి మరొకరు లేరనే చెప్పాలి. ఆయనను ప్రత్యక్షంగా సేవించిన భక్తుల అనుభవాలను మరియు సాయి సచ్చరిత్ర గ్రంధాలలో ఇతర లీలలను శ్రవణం చేస్తే మనకు ఈ విషయం సుళువుగా అవగతమౌతుంది. శ్రీ సాయినాధులు తన మహా సమాధి అనంతరం కూడా అసంఖ్యాకమైన లీలలను చేస్తునే వున్నారు. సమయం, ప్రదేశం, కుల, మత, వర్గ, ప్రాంతీయ వైషమ్యాలు లేకుండా తనను నమ్మి శరణు జొచ్చిన భక్త జనావళి అందరిపైనా సమానంగా తన అనుగ్రహా, కటాక్షాలను కురిపిస్తునే వున్నారు. శ్రీ సాయి చేసిన అసంఖ్యాకమైన అద్భుత లీలలకు ప్రత్యక్ష సాక్షి అయిన శ్రీ మహల్సాపతి బాబాను సాక్షాత్తూ ఆ పరమేశ్వరుని అవతారం గా గుర్తించి, కీర్తించి తరించాడు.

ఒక నాడు ( సంవత్సరం- వివిధ గ్రంధాలలో ఈ తేదీ గురించి అభ్యంతరాలు వున్నాయి కానీ నేను శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి సాయి లీలామృతం గ్రంధం నుండి ఈ సంఘటన యొక్క తేదీని తీసుకోవడం జరుగుతోంది) బాబాకు తీవ్రంగా ఉబ్బసం వచ్చింది. భక్తుల కష్టాలను తనపై తీసుకొని వారికి విముక్తి కలిగించే ఆ దేవదేవుడు తాను ఎప్పుడు ఏ జబ్బుతో బాధపడినా మందు తీసుకునేవారు కాదు. పైగా ఆ అల్లాయే నన్ను బాగు చేస్తాడు అనేవారు. ఆ రోజు వ్యాధి తీవ్రత ఎక్కువగా వుండడంతో రాత్రి 10 00 గంటలకు బాబా మహల్సాపతిని పిలిచి “ నేను ఇప్పుడు అల్లాహ్ దగ్గరకు వెళ్తున్నాను. ఆయన దయ తలిస్తే మూడు రోజులలో వస్తాను లేకుంటే నా శరీరాన్ని మసీదు బయట పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలు పాతించు" అని చెప్పి అతని ఒడిలో ఒరిగిపోయారు. ఆ పరిస్థితి చూసి మహల్సాపతికి నోట మాట రాలేదు. దుఖం ఎగిసిపడింది. బాబా శరీరాన్ని జాగ్రత్తగా తన ఒళ్ళో పెట్టుకొని కదలకుండా కూర్చున్నాడు.

ఈ వార్త దావానలంలా ఊరంతా వ్యాపించి వేల సంఖ్యలో శిరిడీ గ్రామస్థులు మశీదులో గుమిగూడారు. గ్రామ కరణం అయిన భాటే పంచాయతీ కూడా జరిపించాడు. వైద్యుడు వచ్చి పరీక్షించగా ఊపిరి కొట్టుకోవడం లేదు, నాడి కూడా ఆగిపోయింది కనుక బాబా మరణించారని నిర్ధారణ చేసాడు. గ్రామం లో ప్లేగు వ్యాధి బలంగా వుండడం వలన తక్షణమే ఆ శరీరాన్ని ఖననం చేయాలని భాటే ఆధ్వర్యం లో కొందరు గ్రామ పెద్దలు పట్టుబట్టారు కానీ మహల్సాపతి బాబా మూడు రోజులలో తిరిగి వస్తానన్న విషయాన్ని వారికి చెప్పి శరీరాన్ని కదలనిచ్చేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. రామ చంద్ర పటిల్, శ్యామా, నానా చందోర్కర్,తాత్యా కోటే పాటిల్ వంటి వారందరూ మహల్సాపతి వాదనను బలపరిచి బాబా శరీరాన్ని కదిలిస్తే తామంతా ప్రాణ త్యాగం చేస్తామని బెదిరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వలన గ్రామ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా వారి అహ్మద్ నగర్ కలెక్టర్ కు ఈ సంగతి చేరవేసారు. సదరు కలెక్టర్ గారు మేము విదేశీయులము గావున మెమేం చేసినా ప్రజలు ఉద్రిక్తులౌతారు కావున మీరే ఏదో విధంగా పరిస్థితిని చక్కబెట్టండి అని నేర్పుగా తప్పించుకున్నాడు. అప్పుడు పోలీసులు వచ్చి బాబా మాటల ప్రకారం మూడో రోజు వరకు వేచి చూద్దామని చెప్పారు.

బాబా నామస్మరణ, భజనలతోనూ మశీదు మార్మోగిపోయింది. ఎవరికీ కంటి మీద కునుకు లేదు, అన్న పానీయాల సంగతే మరిచారు. తమ దేవదేవుడైన శ్రీ సాయి తప్పక తిరిగి రావాలని అక్కడున్న వారందరూ శోక తప్త హృదయాలతో ప్రార్ధించారు. మహల్సాపతి అయితే ఏ చలనం లేక బాబా శరీరాన్ని అట్లాగే ఒళ్ళో పెట్టూకొని కదలక అదలక కూర్చున్నాడు.

మూడవ రొజు అనగా వ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరం లో కదలికలు ప్రారంభమయ్యాయి. నడి కొట్టుకోవడం ప్రారంభమయ్యింది, శరీరం వెచ్చగా అయ్యింది. దీర్ఘంగా ఊపిరి తీసుకుంటూ బాబా లేచి కూర్చున్నారు. తమ కళ్ళ ఎదుట జరిగిన ఈ గొప్ప సంఘటనను చూసిన భక్త జనావళి నోట మాట రాలేదు. ఆశ్చర్యం,దుఖం, భక్తి, ప్రేమ వంటి భావాలు తన్నుకు రాగా శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ మహరాజ్ కి జై అంటూ నినాదాలు చేసుకుంటూ బాబా ముందు మోకిరిల్లారు.

మహల్సాపతి మాత్రం బాబాను “దేవా ఏం చేసావు, ఎక్కడికి వెళ్లావు? “ అని అడుగగా " అల్లా దగ్గరకు వెళ్ళాను, మొదత్లో తిరిగి రాదలచుకోలేదు. కాని అల్లా బెంగాల్ లోను గధాధరుడు అనే భక్తుడు నాలో కలవాలని ఆరాట పడుతున్నాడు. అతని అవతార కార్యం లో మిగిలిన వాటిని తీసుకొని అతనిని విడుదల చేసి తిరిగి నువ్వు వెళ్ళిపో అని అల్లా ఆజ్ఞాపించగా నేను తిరిగి వచ్చేసాను" అని బాబా అన్నారు.

చిత్రంగా ఆ రాత్రి ఒంటి గంటకే రామకృష్ణ పరమ హంస నిర్యాణం చెందారు, ఆయన అసలు పెరు గధాధరుడు.

ఈ సంగతి తెలిసి దేశం నలుమూలల నుండి లక్షల సంఖ్యలో భక్తులు శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ కూడా బాబా ముందు మోకిరిల్లి తనను అనుగ్రహించవల్సిందిగా కన్నీరు మున్నీరుగా ప్రార్ధించాడు. క్రీస్తు తప్ప నేటి వరకూ ఎవ్వరూ కూడా మరణీంచాక తిరిగి జీవించలేదు కాబట్టి బాబాయే క్రీస్తు అని అందరికీ అతను చెప్పాడు.

ఈ లీల కల్పితం కాదు, ప్రత్యక్షంగా జరిగింది. మహల్సాపతి మరియు వేలాది ఇతర భక్తులు ఇందుకు ప్రత్యక్ష సాక్షులు. బాబా తాను కనిపించే మూడున్నర మూరల దేహమే కాదని, ఈ సృష్టి అంతటా ప్రాణవాయువు వలె నిండి వున్న ఆత్మ తత్వమే తానని భక్తులలు తెలియజేయదం కోసమే ఈ లీలను చూపించారు.

బాబా పరిశుద్ధ పరమేశ్వర అవతారం. సర్వ గతమైన పరబ్రహ్మ తత్వమే ఆయనగా భక్తులను శ్రేయోమార్గం లో నడిపించుటకు వెలిసింది కాబట్టి ఆయనకు జనన మరణాలతో సంబంధంలేదు. అందుకే ఆయనను ఈ గోచరించు విశ్వమంతయూ ఆవరించి వున్న పురుషుడు,చరా చర జీవులన్నింటిలో బాహ్యాభ్యంతరములలో నిండి వున్న సర్వాంతర్యామి, మాయాతీతుడు, సాక్షాత్ పరబ్రహ్మం, దక్షిణామూర్తి అవతారం, నాశనం లేనట్టి ఆనంద స్వరూపం నిరంజనుడు,నిర్వికల్పుడు,నిర్మలుడు అధ్వయుడు, స్మృతి మాత్ర ప్రసన్నుడు ఓంకార స్వరూపుడు, కలియుగ దైవం భక్తులకు సదా రక్షణ కవచమునందించి అతి దుర్లభమైనట్టి ఈ సంసార సాగరమును అవలీలగా దాటింపజేయునట్టి ఆశ్రిత కల్పవృక్షం శ్రీ శిరిడీ సాయినాధులు సాయిదేవుని పాదములకు శత సహస్ర కోటి నమస్సుమాంజలులు అర్పించెదను .

సర్వం శ్రీ శిరిడీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
పూర్తిగా చదవండి