ఒక కవిగాని, రచయిత కాని తన రచనను ప్రాణంలా చూసుకుంటాడు. ఎందుకంటే అది అతని హృదయాంతరాలనుండి వచ్చినది కాబట్టి. ఆ రచన అతని ఆలోచనలను, భావాలను స్పష్టంగా చూపిస్తుంది. అదే విధంగా నాటినుండి నేటివరకు తమ రచనలను జీవనోపాధికి అమ్ముకోక తప్పలేదు. ఎందుకంటే కవితలు, కావ్యాలు రాస్తుంటే బ్రతుకు బండి ఒక్కడుగు కూడ కదలదు కదా.

కవిత అంటే సరస్వతీమాత. దానిని ఎందరో కవులు స్త్రీగా , తమ మానస పుత్రికగా అభివర్ణించారు. కవితాస్త్రీకి కవి తండ్రి అవుతాడు కాని వల్లభుడు కాదు. ఆ కవితను ఇతరులకు అంకితమిచ్చునపుడు ఆతడు కన్యాదాత కావున జనకుడు అయ్యాడు. అందుకేనేమో పోతన తన భాగవత మహా కావ్యాన్ని శ్రీమహావిష్ణువుకు అంకితమిస్తూ ఇలా అన్నాడు.

ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుః గొన్ని పుచ్చుకుని చొక్కి శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరా జొకఃడు భాగవతంబు జగద్దితంబుగన్.

అధములైన రాజులకు అంకితమిచ్చి వారిచే పురములు,వాహనములు, సొమ్ములు పుచ్చుకుని తదనంతరం కష్టాలు పడడం ఇష్టంలేక నా భాగవతాన్ని మనస్ఫూర్తిగా ఆ శ్రీహరికే అంకితమిస్తున్నాను. అంతకంటే గొప్పవాడైన కృతికర్త ఉండునా?

బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్
కూళల కిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్
హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూలకౌ
ద్దాలికులైన నేమి నిజ దార సుతోదర పోషణార్థమై !!

ఇది కూడా పై పద్యానికి కొనసాగింపే. కాని రాసింది పోతన కాదు. మంచన రచించిన కేయూరబాహు చరిత్ర కావ్యంలోని పద్యం ఇది. అతి కోమలమైన కావ్య కన్యకను కూళల (దుర్మార్గులు) కిచ్చి ఆ పడుపుకూడు తినడంకంటే మహా కవులు, తమ భార్యా పిల్లలను పోషించుకునేందుకు వ్యవసాయం చేయడం మేలు . లేదా అడవిలో ఆకులు, అలములూ తిని బ్రతకడం మేలు అని భావము. నిజంగానే ప్రతి తండ్రి తన కూతురిని యోగ్యుడైనవాడికే ఇవ్వాలనుకుంటాడు కాని మూర్ఖులు, దుర్మార్గులైనవారికి కాదు కదా. రాజులందరూ దుర్మార్గులు, దుష్టులు కాదు. ఉత్తములైన రాజులకు ఇచ్చిన తప్పు లేదంటున్నాడు కవి. ఎంతైనా తండ్రి మనసు .

అదే విధంగా బాధపడుతున్న భారతీదేవిని పోతన ఈ విధంగా ఓదారుస్తున్నాడు.

కాటుక కంటి నీరు చను కట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో
హాటక గర్భు రాణి నిను నాకటికిన్ గొని పోయి యెల్ల క
ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ !!


"ఓ భారతీదేవి! కైటబుని చంపిన శ్రీమహావిష్ణువు కోడలా! ఎందుకేడుస్తావు తల్లీ? బాధపడకు నా భాగవతాన్ని నీచులయిన రాజులకు అమ్మనుగాక అమ్మను. త్రికరణశుద్ధిగా చెప్తున్నాను. నన్ను నమ్ము తల్లి అని ఓదారుస్తున్నాడు పోతన.


ఈ టపా రాయడానికి కారణమేంటంటే....

మా అమ్మాయి పెళ్లి విషయంలో మావారి భయాలు, అనుమానాలు, జాగ్రత్తలు చూస్తుంటే ఈ పద్యాలు గుర్తొచ్చాయి. ఎంతైనా తండ్రికి కూతురిమీద చాలా ప్రేమ ఉంటుంది ( మా నాన్నగారూ అంతే). తల్లిలా దగ్గరకు తీయలేకపోయినా తన కళ్లముందు బుడిబుడి అడుగులతో తిరిగిన చిట్టితల్లి పెరిగి పెద్దదై పరాయింటికి వెళ్లినపుడు ఆమెను ఎలా చూసుకుంటారో, కష్టాలు పెడతారో, అబ్బాయి మంచివాడో కాదో? ఎలా చూసుకుంటాడో ఏమో?అని సవాలక్ష సందేహాలు ఉంటాయి. ఈ కవులకు ఉన్నట్టు. కాదంటారా??

ఇది దైవికమో? యాదృచ్చికమో? తెలీదు. నిన్న ఈ టపాను అనుకోకుండా రాసాను.రాస్తూ మా నాన్నను గుర్తు చేసుకున్నాను. పొద్దున్నే గుర్తొచ్చింది. ఇవాళ మా నాన్నగారు పుట్టినరోజు అని. ఎంత కాకతాళీయకం కదా? పాతికేళ్లు అల్లారు ముద్దుగా పెంచిన తల్లితండ్రులు, తోడబుట్టినవాళ్లను వదిలి ఒక కొత్త ఇంటిలో తన జీవితాన్ని కొనసాగించడానికి వచ్చిన అమ్మాయికి భర్త ఒక మంచి తండ్రి ఐతే ఎంత బాగుండు?? ఇక ఆమెకు తన పుట్టిల్లు గుర్తొస్తుందా?
పూర్తిగా చదవండి